pratilipi-logo ప్రతిలిపి
తెలుగు
ఒక నలభై వసంతాల నవ యువకుడు మినీ కథ చక్ర వర్తి, కథా నిధి కె.బి.కృష్ణ తో ముచట్లు.
15 మార్చి 2018

 

మీ పూర్తి పేరు

కాకరపర్తి భగవాన్ కృష్ణ , కాని సాహితీ ప్రపంచంలో కె.బి.కృష్ణ గానే బాగా పరిచయం.

మీ బాల్యం గురించి చెప్పండి.

మా స్వంత ఊరు రాజమండ్రి ఇప్పుడు రాజమహేంద్రవరం అని పిలుస్తున్నారు. అసలు పేరు ఇదే. నలుగురు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిల కుటుంబం లో నేను చిన్నవాడిని. చిన్నతనంలో తల్లితండ్రి మరణించడం తో నా బాల్య మంతా చీకటి వెలుగులు ఒక రకంగా చెప్పాలంటే విదివంచితున్ని.

మీ విద్యాభ్యాసం గురించి చెప్పండి.

అమ్మ నాన్న మరణం తరువాత, తరగని సిరిసంపదలు ఉన్న సరే, నా మీద దయ చూపించిన వారి వలన స్కూల్ ఫైనల్ వరకూ చదివి తరువాత గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీ లో పీ యు సి

చదివాను.

మీ ఉద్యోగం గురించి చెప్పండి.

ఆంధ్రప్రదేశ్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాసి చిన్న గుమాస్తా గా ఎన్నికయ్యాను. తరువాత పెద్ద గుమాస్తా అయ్యాను. అనేక పరీక్షలు రాసి పట్టుదల తో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఆర్ధిక మరియు ప్రణాలికా ( ప్రాజెక్ట్స్) శాఖ లో దివిసినల్ అకౌంట్స్ ఆఫీసర్ (వర్క్) గా నియమించా బడ్డాను.  2002 మే నెల లో పదవీ విరమణ చేశాను. ఆంధ్ర రాయలసీమ,తెలంగాణా ప్రాంతాలలో పనిచేసాను.

మీ కుటుంబ నేపధ్యం గురించి 

తూర్పు గోదావరి జిల్లా లో మా నాన్న గారు అప్పట్లో తహసిల్దార్ గా పనిచేసేవారు. కాకరపర్తి శ్రీశైలం వారి పేరు. ఇప్పటికీ మా నాన్నగారు గోదావరి జిల్లా లో కొంతమంది ఊహల్లో బ్రతికే ఉన్నారు. మా అమ్మ గారు సూరమ్మ ఆమె అన్నపూర్ణ.

ఇద్దరు అన్నయ్య లలో ఒకరు డిప్యూటీ కలెక్టర్ గా పనిచేస్తూ మరణించారు. ఇంకో అన్నయ్య డిగ్రీ కాలేజీ లో ప్రిన్సిపాల్ చేసి న తరువాత మరణించారు. ఇద్దరు అక్కయ్యలు. ఒక బావగారు కేంద్ర ప్రభుత్వం లో ఫీల్డ్ ఎక్సిబిషన్ ఆఫీసర్ గా పదవీ విరమణ చేశారు. రెండవ బావ గారు ఎలక్ట్రిసిటీ డిపార్టుమెంటు లో సెక్షన్ ఆఫీసర్ గా చేస్తూ మరణించారు. పెద్ద అక్కయ్య పరమ పదించారు, రెండవ అక్కయ్య గవర్నమెంట్ లో పని చేసి సుఖంగా హైదరాబాద్ లో ఉంది. తరువాత అన్నయ్య ఈనాడు పత్రిక లో పదవీ విరమణ చేసి ప్రస్తుతం గృహ శోభ పత్రిక కార్యాలయం లో పని చేస్తున్నారు. నేను చివరి వాణ్ని.

సాహిత్యం వేపు మీ అడుగులు ఎలా పడ్డాయి ?

1965 లోనే నేను చిన్న కథలు రాయడం మొదలు పెట్టాను , కాని అప్పటి నా పెద్దలు వాటిని మాయం చేసేసేవారు. తిరిగి నా కాళ్ళమీద నేను నిలబడ్డాక 1978 లో నాగార్జునసాగర్ లో ఉద్యోగం చేసేటప్పుడు ప్రముఖ రచయిత నా ప్రియ మిత్రులు ‘’ వాణిశ్రీ ‘’ గారి ప్రేరణ తో రచనా వ్యాసంగం మొదలుపెట్టాను.

మినీ కథలనే ఎంచుకోడానికి కారణం ?

నేను కథలు రాయడం మొదలుపెట్టిన కొత్త లో పెద్ద కథలు ఎక్కువగా రాసేవాడిని. అప్పట్లోనే నవల, పెద్ద కథ, కథానిక, చిన్నకథ వరకూ రాసేవాడిని. కాలక్రమేనా జనానికి చదివే అభిరుచి తగ్గడం తో మినీ కథ, కాలం కథ, అర నిమిషం కథ, కార్డు కథ అని రాయడం మొదలుపెట్టాను. నన్ను ఎక్కువగా ఆంధ్ర జ్యోతి, పల్లకి, ఉదయం, మయూరి, పత్రికలూ ప్రోత్సహించాయి. నేను మినికదా రచన మొదలుపెట్టాక చాల మంది రచయితలు నన్ను అనుసరిస్తున్నారని ‘’ మయూరి ‘’ వార పత్రిక నా 51 మినీ కథల పుస్తకాన్ని సమీక్షిస్తూ పేర్కొనడం నాకు ఎంతో ఆనందాన్ని కలగచేసింది.

పూర్వం మీ ఇంట్లో ఎవరైనా సాహితీ వేత్తలు ఉన్నారా ?

1950 – 1960 మధ్యలో మా పెద్దక్కయ్య ‘’ సర్వ లక్ష్మి ‘’ పత్రికలలో మంచి సాహిత్య విలువలు ఉన్న కథలు రాసేది. ఎక్కువగా ఆనాడు ‘’ ఆంధ్ర ప్రభ సచిత్ర వార పత్రిక ‘’

లో ఆమె కథలు వచ్చేవి. నేనే బజారుకు వెళ్లి వార పత్రిక తెచ్చేవాడిని. కాని అప్పుడు ఆమె కథలు చదివి ఆస్వవదించలేక పోయేవాడిని.

కవిత్వం పై మీ అభిప్రాయం ?

1978 లో నేను రచనలు చేయడం మొదలు పెట్టెక కవితలు,పెద్ద కవితలు, కధలు,వ్యాసాలూ  శీర్షికలు ఒకటేమిటి ఏది పడితే అది రాసేసేవాడిని. అప్పట్లో దాదాపు ఏభై కవితలు ప్రచురణ అయ్యాయి. అయితే కథలూ కవితలూ జోడు గుర్రాల స్వారీ వద్దు, ఎదో ఒకటి రాస్తే, ఆ రంగం లో ప్రావీణ్యత వస్తుందని కొంతమంది పెద్దలు సలహా ఇస్తే కవితలు వదిలేసాను.

కథ రాయడం కన్నా కవిత్వం రాయడం కష్టం అనిపించింది నాకు. నేడు కవితలకు వున్నా ఆదరణ, వంద, వెయ్యి కవి సమ్మేళనాలు చూస్తూ అయ్యో ఎందుకు కవితలు రాయడం మానేసాను అని బాధపడుతున్నాను.

కొత్తగా కథలు రాసే వారికి మీ సూచనలు ?

కథలు రాసే వారికి సూచనలు ఇచ్చేటంత గొప్పవాడిని కాను. ఇంకా మంచి కథలు రాయాలనే తపన తో కథలు రాయడం ఇంకా నేర్చుకుంటున్నాను. వైవిధ్యమైన కథలు రాయడం నాకు ఇంకా రాలేదు. అయితే కొత్తగా కథలు రాసే వాళ్ళు కథ రాస్తూనే దానిని ఏ పత్రిక కు పంపాలి,

ఒకవేళ ప్రచురిస్తే వారు ఎంత డబ్బు ఇస్తారు ? అనే ఆలోచన లో ఉంటున్నారు. అలా కాకుండా మనం కథలు రాస్తూ ఉంటె మంచి పేరు వస్తుంది, తరువాత మనల్నే పత్రికల వాళ్ళు కథలు రాయమని కోరుతారు. ముఖ్యంగా ప్రముఖ కథా రచయిత ల కథలు కూడా బాగా పరిశీలించాలి.

ఇంతవరకూ ఎన్ని పుస్తకల్లు ముద్రణ రూపం లో వచ్చాయి ?

ఇంతవరకూ పన్నెండు పుస్తకాలు వెలువడ్డాయి, వీటిల్లో ఎక్కువ నేను చేతులు కాల్చుకున్నవే. రచయిత తన పుస్తకం ఎవరికైనా ఇస్తే ‘’ దీని ఖరీదు ఎంతండీ – కొంచమైన తీసుకోండి ఇస్తాను ‘’ అని వారు చెప్పే రోజులు రావాలని ‘’ పగటి కలలు ‘’ కంటున్నాను.

(1) గాయత్రి ( 7 కథలు )( 2)  ఆమె నవ్వింది ( 51 మినీ కథలు )( 3)  అనుబంధాలు (12  కథలు ) ( 4)జంతర్ మంతర్ ( నవల ) ( 5) చిత్రలోకం (16 హాస్య కథలు )( 6)  మోహన రాగం (నవల )  (7) అభిషేకం ( 101 మినీ కధలు )( 8) రివర్స్ గేర్ ( 12  హాస్య కధలు) విశాలాంధ్ర పుబ్లిషింగ్ హౌస్, ప్రచురణ.( 9)  సంస్కారం ( 36 మిని కధలు ) (10) 101 జోక్స్, అర నిమిషం కథలు( వసుంధర పబ్లికేషన్స్ , విజయవాడ వారి ప్రచురణ ) (11) అ అంటే మమ్మీ (54 కార్డు కథలు  ) (12)  మమతల  పందిరి ( 18 కథలు )

నేను ఇప్పటివరకు 750 కథలు రాశాను వాటిల్లో ఒక 50   ప్రచురణ అవలేదు. 16  నవలలు రాశాను. సంపుటాలు చాలా ప్రచురించాలి కాని ఎలా ? కొని చదివే వారు లేరు.

సాహిత్యం లో మీరు సాధించిన విజయాలు.

ఎన్నో కధలకు బహుమతులు పొందాను. 1997  లో ఆస్ట్రేలియా లోని తెలుగు వారు నిర్వహించే ‘’ తెలుగు పలుకు ‘’ కథల పోటీలలో, పెద్ద కథల విభాగం లో నేను రచించిన

‘’ ఈ కొట్టుకు సెలవు లేదు ‘’ కథ కు ప్రధమ బహుమతి గెలుచుకోవడం, ఈ బహుమతి పొంది నందుకు కథానిలయం వ్యవస్థాపకులు డాక్టర్ కాళీపట్నం రామారావు గారిచే సత్కారం అందుకోవడం ఒక సాహిత్య అకాడమి బహుమతి తో సమానం అని భావిస్తుంటాను. 2006 వ

సంవత్సరంలో స్వాతి సపరివార పత్రిక వారు నిర్వహించిన 16 వారాల సీరియల్ నవలల పోటీ లో నేను రచించిన సోషల్, రొమాంటిక్ థ్రిల్లర్ ‘’ మోహనరాగం ‘’ 25000/- రూపాయలు గెలుచుకోవడం మరో అద్భుత సత్కారం. ఇక పురస్కారాల విషయానికి వస్తే ---

2003 లో అంజలి గోదావరి పుష్కర ప్రతిభ పురస్కారం, 2008 లో Doctor కె.ఆర్.కె.మోహన్ స్మారక పురస్కారం, 2009 లో వేదగిరి కమ్యూనికేషన్స్ వారు విజయనగరం లో నిర్వహించిన నూరేళ్ళ తెలుగు కదా సంబరాల్లో నూరు మంది లో ఒకడి గా రజత పతకం తో సత్కారం.        2012 లో అభ్యుదయ ఫౌండేషన్, కాకినాడ వారిచే ఉత్తమ కథా పురస్కారం, 2012  లో నల్గొండ లో డాక్టర్ నోముల సత్యనారాయణ ఉత్తమ కథా పురస్కారం, 2013 లో ఆంధ్ర సారస్వత సమితి, మచ్లిపట్నం వారిచే ఉగాది సాహిత్య ప్రతిభా పురస్కారం, 2014   లో అనకాపల్లి, మల్ల జగన్నాధం స్మారక ప్రతిభ సాహిత్య పురస్కారం, 2016 లో ఆంధ్ర సారస్వత సమితి, మచిలీపట్టణం వారిచే సాహిత్య జీవన సాఫల్య పురస్కారం, 6-11-2016    న కర్నూల్ లో కర్నూల్ హాస్య కళాసమితి మరియు రేడియన్ సాహిత్య సాంస్కృతిక సమాఖ్య సంయుక్తం గా నిర్వహించిన సత్కారా సభలో ‘’ మినీ కథా చక్రవర్తి ‘’ బిరుదు ప్రదానం.      2017 లో ‘’ భావతరంగిని ‘’  మాస పత్రిక   వ వార్షికోత్సవం లో ‘’ కథా నిధి ‘’ పురస్కారం నన్ను వరించాయి. ఈ బహుమతులు, పురస్కారాలు మరియు చదువరుల అభినందనలతో కూడిన ఆదరణ నన్ను ఈ 74 సంవత్సరాల వయసులో ఇంకా రచనలు చేయిస్తున్నాయి.

బెంగలూరు కు చెందిన శ్రీ కె ఎల్ రంగనాథ రావు  గారు నాకు 1995 నుండి నా కథలు కన్నడం లోకి అనువదిస్తున్నారు. నా కథలు ‘వినోద’ ‘ప్రజావాణి’ ‘గండ హెందతి ‘ ‘ హాస్య దర్శన ‘’ ‘ అక్షర ఐ సిరి ‘’ ‘ సంయుక్త కర్ణాటక ‘’ ‘’ అనంత ప్రకాష్ ‘’  వంటి కన్నడ పత్రికల లో ప్రతి నేలా ప్రచురించ బడుతున్నాయి. వీరు నా పుస్తకాలు ‘’ ఆమె నవ్వింది ‘’ ‘’ఆవలు నక్కలు ‘’ అనే పేరుతోనూ ‘’ చిత్రలోకం ‘’ పుస్తకం ‘’ నాగు ఎంబ టానిక్ ‘’ పేరు

తోనూ ప్రచురించారు. వీరు అనేక కన్నడ కథ సంపుటాలలో నా కథలు చేర్చారు.

‘’ అ అంటే మమ్మీ ‘’ కార్డు కథలను ప్రస్తుతం వీరు కన్నడం లోనికి అనువదిస్తున్నారు.

బెంగళూరు నివాసులు శ్రీ ఎం.ఆర్.నాగరాజా రావు గారు ‘’ మమతల పందిరి ‘’ పుస్తకాన్ని కన్నడం లోనికి అనువదిస్తానని నా దగ్గర అనుమతి పత్రం తీసుకున్నారు.

ఇక పోతే నా రచనల పై పలు పరిశోధనలు జరుగుతున్నాయి.

శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, బొమ్మూరు కు చెందిన శ్రీ గంజి శ్రీనివాస రావు

ప్రొఫెసర్ పీ లీలావతి గారి పర్యవేక్షణ లో ‘’ కె.బి.కృష్ణ మినీ కథల సంపుటి ఆమె నవ్వింది  -- ఒక పరిశీలన ‘’ అనే అంశం పై పరిశోధన చేసి మార్చ్ 2000 లో ఏం.ఫిల్ పట్టా పొందారు.

మదురై కామరాజ్ యూనివర్సిటీ లో శ్రీ కె. దుర్గా ప్రసాద్ ‘’ కె బి కృష్ణ కథలు – ఒక పరిశీలన’’ అనే అంశం పై పరిశోధన చేసి ఎం.ఫిల్ పట్టా 2008 పొందారు, ఈ పరిశోధన గ్రంధాన్ని పుస్తక రూపం లో తీసుకువచ్చారు.

తెలుగు అకాడమి, హైదరాబాద్ 2005 లో ప్రచురించిన ‘’ తెలుగు కథా కోశం, తెలుగు కధకుల కథల సమాచారం అనే 605 పేజీల  గ్రంధం లో 70 – 71 పీజీల లో నా రచనల వివరాలు ఉన్నాయి.

నేను రచించిన పత్రికలలో ప్రచురించ బడిన కథలు రాష్ట్రం లో వివిధ సంస్థలు ప్రచురించిన దాదాపు 30 కథల సంపుటాల్లో చేర్చబద్దాయని చెప్పడానికి గర్వపడుతున్నాను.

నేను లయన్స్ ఇంటర్నేషనల్ క్లబ్ లో 2006 to 2010 వరకు సామజిక సేవ చేశాను.

తెలుగు సాహిత్యానికి ప్రపంచ సాహిత్యంలో మంచి పేరు ఉందని మీరు భావిస్తున్నారా ?

ప్రపంచ సాహిత్యం లో మంచి పేరు ఉండాలంటే, ఆంగ్ల భాష కె అపరిమితమైన అవకాశాలు ఉన్నాయి , ఐయితే తెలుగు వారు కూడా శత విధాలా ప్రయత్నిస్తున్నారు.

రచయిత గొప్ప వాడా ? కవి గొప్పవాడా ? అంటే మీ జవాబు ఏమిటి ?

చాల క్లిష్టమైన ప్రశ్న. సాహిత్యానికి కథా సాహిత్యం మరియు పద్యం కవిత రెండు కళ్ళు అని నేను భావిస్తాను. అయితే సాహిత్యం లో మిగతా ప్రక్రియలు కూడా ఉన్నాయనుకోండి. ఎవరి ప్రక్రియ లో వారు గొప్పవారు అని చెబితే సమంజసం గా ఉంటుంది.

ఇప్పుడు మీ ప్రస్తుత జీవన  విధానం ఏమిటి ?

దాదాపు 37 సంవత్సరాలు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం లో ఉద్యోగం చేసేక 2002 లో పదవీవిరమణ  చేసేక నేను అప్పటివరకూ తీరిక దొరికితే రచనలు చేసేవాడిని కాని ఇప్పుడు పూర్తి కాలపు రచయిత గా మారాను.

నాకు దైవం ప్రసాదించిన నా శ్రీమతి సరస్వతి తో ప్రశాంతం గా జీవిస్తున్నాను. బ్యాంకు లో అప్పు తీసుకుని చిన్న డాబా ఇల్లు కట్టుకుని కాకినాడ లో నివసిస్తున్నాను.

మా అమ్మాయి చిరంజీవి భార్గవి సాయి కుమారి ఏం.ఎస్.సి, బి.యిడి చదివింది. ఆమె భర్త

శ్రీ విన్నకోట రవికుమార్ రాష్ట్ర ప్రభుత్వం లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్టుమెంటు లో జాయింట్ ఇన్స్పెక్టర్ జనరల్ గా ఉద్యోగిస్తున్నారు. వీరికి ఇద్దరు అమ్మాయిలు, ఒక అమ్మాయి శ్రీజ , లండన్ లో ఇంగ్లీష్ డిగ్రీ చదువుతోంది, ఒక అమ్మాయి విజయవాడ లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో సెవెంత్ క్లాసు చదువుతోంది.

మా అబ్బాయి కాకరపర్తి చెన్న కేశవ నరసింహ శ్రీనివాస్ బి.టెక్ చదివాడు. ఫరీదాబాద్ లో సామ్ సంగ్ హెవీ ఇండస్ట్రీ లో డిప్యూటీ మేనేజర్ గా పని చేస్తున్నాడు. కోడలు సేశారత్న మాధురి ఎల్ అండ్ టి లో డిజైన్ ఇంజనీర్ గా పని చేస్తోంది. వీరి ఏకైక కుమార్తె రేవతి  మానవ రచన ఇంటర్నేషనల్ స్కూల్ లో ఫస్ట్ క్లాసు చదువుతోంది.

నేను నా శ్రీమతి పిల్లల కబుర్లు చెప్పుకుంటూ హాయిగా కాలక్షేపం చేస్తున్నాం. కథ రచన లో సుదీర్ఘ కాలం కొనసాగాలని వుంది. వెయ్యి కథలు మించి రాయాలని ఉంది మరి ఏమవుతుందో ఎవరికీ తెలుసు ?

రాజకీయాల పై మీ అభిప్రాయం ?

నో కామెంట్స్ ప్లీజ్ –

సాహిత్యానికీ, సంగీతానికి ఉన్న వ్యత్యాసం ఏమిటి ?

సాహిత్యం మనిషి చదివేక, చదివింది అతని మనసు లో చొరబడితే తన్మయుడై ఆనందిస్తాడు. లేదా విచారిస్తాడు. స్పందించడానికి కొంత సమయం పడుతుంది. కాని సంగీతం అలా కాదు, శ్రావ్యమైన సంగీతం మనిషిని అప్పటికప్పుడే ఆనంద డోలికల్లో తేలియాడించి అతని మనసునూ శరీరాన్ని ఉపసమింపచేస్తుంది. నా దృష్టి లో సంగీతం అజరామరమైంది.

చివరగా మీరు అడగని ప్రశ్నకు జవాబు చెప్పవలసిన అవసరం నాకు ఉంది.

2016 లో నేను ప్రతిలిపి లో ప్రవేశించాను. కథను రచయితే స్వయంగా టైపు చేసి, వెను వెంటనే ఆ కథను  ప్రతిలిపి ప్రచురించడం నాకు అంతులేని, వ్యక్తపరచలేని సంబరాన్ని ఆనందాన్ని కలగచేసింది. పైగా రచయిత కథ ను ఎంత మంది చదివారో ఎప్పటికప్పుడు తెలిసిపోవడం సంతోషం గా ఉంది. ప్రతిలిపి చాలా పోటీలు ప్రవేశ పెట్టి రచయితలను ప్రోత్సహిస్తూంది. చదివే అలవాటు సన్నగిల్లి పోతున్న ఈ గడ్డు రోజుల్లో మళ్ళీ చదువరులను చదివిస్తున్న ప్రతిలిపి కి నా హృదయ పూర్వక అభినందనలు మరియు ఆస్సీస్సులు.