pratilipi-logo ప్రతిలిపి
తెలుగు
పి.యస్.యం.లక్ష్మి
16 జనవరి 2018

కుంభకోణం యాత్ర

రచన;పి.యస్.యం.లక్ష్మి

కుంభకోణం- అంటే అదొక మోసాల పుట్ట అని అందరి అభిప్రాయం.కుంభకోణం అంటే సృష్ఠి ప్రారంభమయిన స్థలమని తమిళుల నమ్మకం.కాని కుంభకోణం అంటే ఆలయాల పుట్ట , అవి చిన్నా చితకా వి కాదు పెద్ద నుంచి చాలా పెద్ద ఆలయాలే ఉన్నాయి అని అంటారు రచయిత్రి పి.యస్.యం. లక్ష్మిగారు.మరి వాటి గురించి, రచయిత్రి గురించి రచయిత్రి తో జరిగిన చిన్న సంభాషణలో తెలుసుకుందాము.

హలో లక్ష్మి గారు,

నేను మీ యాత్రా బ్లాగ్ నూ , మీ యాత్రల పుస్తకాలనూ చదువుతాను. ఈ కుంభకోణం పుస్తకం గురించి మీరు చెపితే వినాలని ఇలా వచ్చాను.కాస్త మీ పుస్తకం గురించెప్పండి.

1.మీకు యాత్రలు చేయాలి అని, అవి ఇలా అందరికీ చెప్పాలనీ ఎందుకు అనిపించింది?

నమస్కారం మాలాగారూ.  ముందుగా నా పుస్తకం పరిచయం చెయ్యబోతున్నందుకు ధన్యవాదాలు.  

నాకు చిన్నప్పటినుంచీ కొత్త ప్రదేశాలు చూడాలని చాలా సరదాగా వుండేది.  అయితే సాధ్యమయింది మాత్రం పెళ్ళయిన తర్వాతే.  అంతకు ముందు అనేక భవ సాగరాలు.  కానీి పెళ్ళయిన తర్వాత మా శ్రీవారు వెంకటేశ్వర్లుగారికి కూడా ఈ ఆసక్తి వుండటంతో అవకాశం వున్నప్పుడల్లా ఏదో ఒక కొత్త చోటుకి వెళ్ళి వచ్చేవాళ్ళం.  మాకు చుట్టాలిళ్ళకు వెళ్ళటంకన్నా కొత్త ప్రదేశాలు చూడటంలోనే ఆసక్తి వుండేది.  

తర్వాత పాప, బాబు పుట్టిన తర్వాత కూడా వాళ్ళని కూడా తీసుకుని వెళ్ళేవాళ్ళం.  చిన్న పిల్లలు, వాళ్ళు తట్టుకుంటారో లేదో కూడా ఆలోచన మాకప్పుడు రాలేదు. సెలవల్లో ఎక్కడికన్నా వెళ్ళి రావాలి ..  అంతే.  మా అమ్మాయి తొమ్మిదో తరగతికి వచ్చేదాకా బాగా తిరిగాము.  తర్వాత పిల్లల చదువుని దృష్టిలో పెట్టుకుని కొంతకాలం ఎక్కడికీ వెళ్ళలేదు. అయితే అప్పుడు వీటి గురించి రాయలేదనే చెప్పాలి.  అసలు ఆ ఆలోచన కూడా రాలేదు. 

పిల్లలు చదువులకీ, ఉద్యోగాలకీ బయటకి వెళ్ళాక మాకు తోచక కొంతకాలం చాలా ఎక్కువగా తిరిగాము.  ఆ సమయంలో దేవాలయాలు కూడా చాలా చూశాము.  తోచకపోతే అప్పటికప్పుడు అనుకుని కూడా కారులో బయల్దేరేవాళ్ళం.  కారు మావారే నడిపేవారు.  అప్పట్లో రోజుకి 3, 400 కి.మీ. లు కూడా నడిపేవారు అవసరాన్నిబట్టి.  పగలంతా తిరగటం, రాత్రికి కొంచెం పెద్ద ఊరు ఏది దగ్గర్లో వుంటే అక్కడ హోటల్ లో రూమ్ తీసుకుని వుండటం. అలా చేసేవాళ్ళం.  ఆయన సహకారం వల్లనే ఇన్ని ప్రదేశాలు తిరగగలిగాను.  

అప్పుడే చాలామందికి తెలియని కొన్ని ఆలయాలు గురించి తెలుసుకున్నాము.  దోవలో కమాను కనబడితే చాలు .. గుడి వుందని వెళ్ళిపోయేవాళ్ళం.  కొన్నిసార్లు అవి అపురూపమయిన ఆలయాలుగా సాక్షాత్కరించేవి, కొన్ని సార్లు దీనికోసమా ఇంత హంగామా చేశారు అనిపించేటట్లు వుండేవి.

అలా ఎక్కువమందికి తెలియని ఆలయాలగురించి తెలుసుకున్నాప్పుడు వాటిని గురించి అందరికీ చెప్పాలి అనే తపన నాలో మొదలయింది.  కొన్ని అతి పురాతనమైన ఆలయాలు, ఎంతో చరిత్ర కలిగినవీ, ప్రస్తుతం మరుగునపడిపోతుంటే చాలా బాధనిపించేది.   అప్పుడే నేను ఎకౌంటెంట్ జనరల్ ఆఫీసునుంచి సీనియర్ ఎకౌంట్స్ ఆఫీసర్ గా రిటైర్ అయ్యాను.  దానితో సమయంకూడా చాలా దొరికింది.  మా అబ్బాయి సహాయంతో ఒక బ్లాగ్ ఓపెన్ చేశాను.  దానిలో నేను చూసిన ప్రదేశాల గురించి రాయటం మొదలు పెట్టాను.  ఆ సమయంలో మా పిల్లలిద్దరూ అమెరికాలో వుండటంతో మేము మూడు నెలలు అక్కడ వున్నాము.  కొత్త ప్రదేశాలు చూడటంలో మా ఆసక్తి, నా పిచ్చి తెలిసిన మా పిల్లలు అమెరికాలో చాలా ప్రదేశాలు చూపించారు. అవి చూసి అక్కడ సంవత్సరాల తరబడి వున్నవాళ్ళు మేము కూడా ఇన్ని ప్రదేశాలు చూడలేదు, మీరు ఇన్ని చూశారా అని ఆశ్చర్యపోయారు.  4, 5 సార్లు అమెరికా వెళ్ళి వచ్చినా, అంతా కలిపి 8 నెలలు కూడా అక్కడ లెేకపోయినా మా పిల్లలు, తర్వవాత మా అల్లుడు వల్ల అమెరికాలో చాలా ప్రదేశాలు చూశాము.  వాటి గురించి నా బ్లాగులోను, చిత్ర, గో తెలుగు.కాంలో వీక్షణం శ్రీర్షికలోనూ అనేక వ్యాసాలు వచ్చాయి.

ఇంతకీ ఇన్ని ప్రదేశాలు చూడగలగటానికి కారణం నా కుటుంబ సభ్యులు.  అందరికీ చెప్పాలి అనుకోవటానికి కారణం  నేను చూసిన మాణిక్యాలు మరుగున పడకూడదని, వాటి విలువ అందరీకీ తెలియాలనీ.

2.మీకు ఆ స్తల పురాణం మీద ఆసక్తా? అక్కడి దేవుడి మీదనా? లేక ఆ ఆలయాలల్లోని శిల్పకళనా? దేని మీద ఆసక్తి ?

ప్రత్యేకించి ఒకదానిమీద ఆసక్తి కాదండీ.  అన్నింటిమీదా ఆసక్తి వున్నది. కొన్ని ఆలయాలలో స్ధల పురాణం మహిమాన్వితమైనదిగా వుంటుంది, కొన్నింటిలో దేవుడు కోరిన కోర్కెలన్నీ తీరుస్తాడని భక్తుల నమ్మకం, కొన్నింటిలో శిల్పకళ అత్యద్భుతంగా వుంటుంది.  ఇలా దేని ప్రత్యేకత దానిది.  అందుకే అక్కడ ఏ విశేషముంటో అది తెలియజెయ్యటానికి ప్రయత్నిస్తాను.

పురాతన ఆలయాలు తీసుకోండి.  సాధారణంగా వాటికి క్షేత్ర పురాణాలు వుంటాయి.  ఫలానా ఋషి ఇక్కడ తపస్సు చేస్తే ఆయనకి ఫలానా దేవుడు ప్రత్యక్షమయ్యాడు ..  ఈ వరం ఇచ్చాడు  .. వగైరా.  ఇందులో నన్ను ఎక్కువగా ఆకర్షించేది ఫలానా ఋషి పూర్వం ఇక్కడ తపస్సు చేశాడు అని.  ఆ మాట నిజమే అయి వుండవచ్చు.  ఎందుకంటే మన దేశం ఋషులు నడయాడిన తపోభూమి.  అంత గొప్ప ఋషి అక్కడ తపస్సు చేసుకున్నాడు అంటేనే ఆ ప్రదేశానికి విలువ పెరిగింది.  నా కళ్ళముందు పచ్చని ప్రకృతిలో ఏ కొండ గుహలోనో తపస్సు చేసుకునే ఋషి సాక్షాత్కరిస్తాడు.  ఆయన ఇప్పుడు లేక పోవచ్చు.  ఆయన, ఆయనలాంటివాళ్ళు మిగిల్చిన ఆధ్యాత్మిక సంపద ఇంకా వున్నదికదా.  అలాంటప్పుడు ఆయనని తలచుకుని ఒక నమస్కారం చెయ్యటం, ఆయన ఇక్కడ తపస్సు చేసుకున్నాడు .. ట .. అని ఇతరులకు తెలియజేయటంలో తప్పులేదు.  పైగా నాకు నేను తెలుసుకున్న విషయాలు ఇతరులకు చెప్పటం  అమిత సంతోషాన్నిస్తుంది.  అందుకే  నాకు చేతనయినంతమటుకూ అన్నింటి గురించీ ఆరా తీస్తాను.  విషయ సేకరణ చేస్తాను. వాటికి నేను చూసింది కలిపి పాఠకులకి వీలయినంతమటుకు వాస్తవాలని అందజేస్తాను.  అంటే అప్పటి సంగతులు చూసినవాళ్ళెవరూ ఇప్పుడు లేరు.  శాసనాలు, స్ధల పురాణం, ఆలయ నిర్వాహకులు ఇచ్చిన వివరాలు, జనశృతి, ఇంకా దొరికిన ఇతర పుస్తకాల ఆధారంగా నేను వివరిస్తాను.

3,.మీ బ్లాగ్ లోనూ , మీ పుస్తకాల ద్వారానూ చాలా దేవాలయాల గురించి చెప్పారు కదా ఎవరైనా వాటిని ఫాలో అయ్యారా? వాటి గురించి మిమ్మలిని అడిగారా?

చాలామందే అడిగారు.  అవ్వన్నీ చెబితే అదే ఒక పెద్ద పుస్తకం అవుతుంది.  నా బ్లాగ్ లో కాశీ ప్రయాణం మేడ్ ఈజీ అని 27 భాగాల కాశీ యాత్ర గురించి వ్రాశాను. గూగుల్ తెలుగు గ్రూప్ అనుకుంటా .. పేరు సరిగ్గా గుర్తులేదు అందులో ఒకరికి కాశీ వివరాలు కావాల్సివచ్చి అడిగితే, నేను ఇచ్చిన వివరాలు బాగున్నాయని వాటిని పిడిఫ్ చేసి సర్క్యులేట్ చేసుకున్నారు.  నాకు తెలియజేశారు.  అంతేకాదు వారిని శ్రీశైలంలో ఒక కార్యక్రమంలో కలిసినప్పుడు మీరు ఫలానా కదూ, మీ కాశీ విశేషాలు బాగా పనికొచ్చాయి, అందరం సర్క్యులేట్ చేసుకున్నామని చెప్పారు.  చాలా సంతోషం అనిపించింది.

కుంభకోణం ముందు తెలుగువన్.కాంలో ధారావాహికంగా వచ్చినప్పుడు చదివి కొందరు ఇవ్వన్నీ ముందు తెలియటంవల్ల వివరంగా చూశామన్నారు, కొందరు, ఏదో టెంపుల్, దేవుడు అని వెళ్ళి దణ్ణం పెట్టుకొచ్చాంగానీ ఇన్ని వివరాలు ఇప్పుడే తెలుసుకున్నాము అన్నారు.ప్రకాశం జిల్లా సింగరాయకొండ శ్రీ వరాహ నరసింహస్వామి దేవాలయం ఎక్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ చౌదరిగారు నా రచనలు చూసి వారి ఆలయం క్షేత్ర పురాణం రాయించుకున్నారు.

అలాగే రామప్ప దేవాలయం గురించి రాసినప్పుడు కూడా ఆ దేవాలయం చాలాసార్లు చూశాంగానీ, మీ వ్యాసం దగ్గర పెట్టుకుని మళ్ళీ చూడాలని వుంది, చూస్తాము అని రాసిన వాళ్ళు వున్నారు.  ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే వున్నాయి.

సాధారణంగా పుస్తక సమీక్షలు వచ్చినప్పుడల్లా నేను చాలా మంచి పని చేస్తున్నానని ప్రశంశిస్తుూ ఫోన్లు వస్తాయి.  ఇవ్వన్నీ నాకు టానిక్కుల్లాగా పని చేస్తాయి.  నాలో నూతన ఉత్సాహాన్ని నింపుతాయి.


4,.మీ యాత్ర బ్లాగ్ లోని సమాచారము , కొన్ని పత్రికల వాళ్ళు, కొన్ని టి.వీ చానల్స్ వాళ్ళూ మీకు చెప్పకుండా వాడుకున్నప్పుడు మీకేమనిపించింది? 

చాలా బాధ అనిపిస్తుంది.  నా పేరు వేసినా, కనీసం నాకు తెలియజేసినా బాగుండేది అనిపిస్తుంది.  చాలాకాలం క్రితం ఒక ప్రఖ్యాత టీ.వీ. ఛానల్ ఉద్యోగి నేను మీ బ్లాగ్ ని రెగ్యులర్ గా ఫాలో అవుతానని చెబితే సంతోషించాను.  తర్వాత అసలు విషయం తెలిసింది.

అనేకసార్లు నా వ్యాసాలు, ఫోటోలతోసహా వేరేవారు కాపీచేసుకుని వారి వాటిలా ఫేస్ బుక్ లోనూ, ఇతరత్రా పోస్టు చేసుకున్నారు.  నా పేరు కూడా ఇస్తే సంతోషించేదాన్ని.  అలాంటివారిలో కొందరిని నిలదీసి అడిగితే సారీ చెప్పారు.  నాకు తెలియకుండా కూడా వుండే అవకాశం వున్నది.

ఇలా నాకే కాదు.  చాలామందికి జరుగుతున్నాయి.   మీరీ ప్రశ్న అడిగినందుకు ఈ అవకాశాన్ని నేను వినియోగించుకుంటున్నాను.  ఎవరైనా, ఎవరి రచనైనా బాగున్నదని షేర్ చేసేటప్పుడు దయచేసి అసలు రచయిత పేరుతో షేర్ చెయ్యండి.  అసలు రచయిత సంతోషిస్తారు.  మీకు కాపీ  చేసిన దోషం అంటదు.  లేకపోతే ఎవరు కాపీ చేశారా అని నానా రభసా.


5.ఈ మధ్య చాలా మంది ప్రవచనాలు చెపుతున్నారు.కొంతమంది ఒకటి మంచిది అంటే ఇంకోరు ఇంకోటి మంచిది అంటున్నారు.కొన్ని సార్లు ఒక్కోదానికి పొంతన ఉండటం లేదు.అప్పుడు వినేవాళ్ళు ఏది ఆచరించాలంటారు?

వీటి గురించి చెప్పే తాహతు నాకు లేదు గానీ, దీనివల్ల ప్రేక్షకులు కొంతమందన్నా అయోమయానికి గురవుతున్నారనే మాట మాత్రం వాస్తవం.  వీళ్ళూ ఎవర్నో ఒకర్నే ఫాలో అయితే ఏ ఇబ్బందీ వుండదు.  వారు చెప్పినట్లు చెయ్యచ్చు.  రెండు మూడు ఛానల్స్ చూశారంటే వీళ్ళ పని అయిందన్నమాటే.  మనిషికి ఏ చిన్ని కష్టం వచ్చినా తట్టుకోలేక దానిని ఎంత తొందరగా తొలిగించుకుందామా అనే ఆరాటంలో పెట్టే పరుగులుకానీ ఇవ్వి వీటివల్ల వాళ్ళు చెప్పిన ఫలితాలన్నీ వస్తే వాళ్ళింకా ప్రవచకులగానే ఎందుకుంటారండీ .. ఈ పాటికి దేవుళ్ళని చేసెయ్యరూ మనవాళ్ళు.  

మనిషికి తెలివితేటలున్నాయి.  వారి కుటుంబాలలో అనాదినుంచీ వచ్చే ఆచారాలూ, ఆనవాయితీలు వున్నాయి.  మంచి మార్గాన నడుస్తూ, కుటుంబ నియమాలని పాటిస్తే వేరే పరుగులు అనవసరం.  మనిషికి కష్టం వచ్చినప్పుడే నిబ్బరం, దానిని తొలగించుకునే ఉపాయం కావాలి.  అంతే.


6.అలాగే దేవాలయాలకు వెళ్ళటము కూడా ఇదివరకటికంటే ఎక్కువయ్యింది.పర్వదినాలల్లో మరీ రష్ గా ఉంటోంది.ఒకరినొకరు తోసుకుంటూ ఉంటారు.వాళ్ళు వెళ్ళి పక్కవాళ్ళ మీద పడుతుంటారు, వాళ్ళు తిడుతుంటారు.ఇదంతా అవసరమా? ఇంత కష్టపడి ఆ రోజు తప్పనిసరిగా దేవుణ్ణి చూడాలా?

దేవాలయాలకి వెళ్ళేది ప్రశాంతత కోసం.  అది లేనప్పుడు ఆ దర్శనం వ్యర్ధం.  తమ కోర్కెలన్నీ తీర్చేవాడిగా దేవుణ్ణి చూడకూడదు.  మనల్ని సన్మార్గంలో నడిపే తేజో శక్తిగా, మన బలహీన క్షణాలలో భుజం తట్టి నిలబెట్టే ధైర్యంలా చూడాలి దేవుడిని.  మనం భక్తులమయినంత మాత్రాన మనముందు నాలుగు చేతులతో రెండు కాళ్ళతో ప్రత్యక్షమయిపోడు దేవుడు.  మన అంతరంగంలో వుంటాడు, మన ఆలోచనల్లో వుంటాడు, మన పనుల్లో వుంటాడు.  ఇలా ఎక్కడ పడితే అక్కడ దేవుడిని చూడగలిగేవాళ్ళల్లో వుంటాడు.  కనుక ఆయన దర్శనానికి ఎప్పుడైనా వెళ్ళవచ్చు .. పండగ రోజు ప్రత్యేకత అంటే పుట్టిన రోజునాడు శుభాకాంక్షలు చెప్పటంలాంటిది.

 

ఇక చివరిగా మీరు మా పాఠకులకు ఏమి చెపుతారు ?

పాఠకులకి ఒక చిన్న మనవి చెయ్యదల్చుకున్నానండీ.  దేవాలయాలకి వెళ్ళినప్పుడు దర్శనం సమయంలో దయచేసి నిశ్శబ్దం పాటించండి.  ఆ సమయంలోనే పక్కవాళ్ళతో ఇంటి వ్యవహారాలన్నీి మాట్లాడటం అవసరం కాదు.  దీనివల్ల ప్రశాంతంగా దణ్ణం పెట్టుకుందాం అనుకునే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది.

కొబ్బరి చిప్పలు అక్కడే కొట్టి తినేవారు దయచేసి ఆ పెంకులని తీసి చెత్త బుట్టలో వెయ్యండి. లేకపోతే అని వేరేవాళ్ళ కాళ్ళల్లో గుచ్చుకోవచ్చు. శుభ్రతని పాటించండి.

ఈ విషయంలో నేను తమిళనాడు ఆలయాలలో నేను గమనించిన విషయాలు చెబుతాను.  అక్కడ ఆలయానికి ఎవరికి వాళ్ళు వస్తారు.  ప్రశాంతంగా దర్శనం చేసుకుని వెళ్తారు.  కబుర్లు వుండవు.  ఆలయాల శుభ్రత కూడా అక్కడ బాగా పాటిస్తారు.  ఆలయాలనిండా వేసిన పెద్ద పెద్ద ముగ్గులు కన్నులవిందు చేస్తూ వుంటాయి.

మనం కూడా మన సమీప ఆలయాలని తరచుగా దర్శిద్దాము.  వాటిని పరిశుభ్రంగా వుంచటానికే కాదు, అక్కడ సాయంకాలాలు సత్కార్యక్రమాలు జరిగేటట్లు చూస్తే వృధ్ధులకు సత్కాలక్షేపం అవుతుంది.  కొందరు కలిసి ఏ పురాణమో చదవచ్చు, భజనలు, వారికి తెలిసిన విషయాలు చెప్పటం వగైరా.

మా ఈ చిన్ని ఇంటర్వ్యూకు ఓపికగా సమాధానాలు ఇచ్చినందుకు ధన్యవాదాలండి లక్ష్మిగారు.

మన దేవాలయాల గురించి తెలుసుకోవాలన్నా, అవి ఎలా వెళ్ళి చూడాలన్నా లక్ష్మిగారి యాత్రాదీపికలు చదివి తెలుసుకోవచ్చు. ఈ పుస్తకాలన్నీ అన్ని పుస్తకాల షాప్ లల్లో దొరుకుతాయి.లేదా పర్సనల్ గా లక్ష్మిగారిని సంప్రదించవచ్చు.

లక్ష్మి గారి సెల్ నంబర్;9866001629

మీ 

మాల కుమార్