pratilipi-logo ప్రతిలిపి
తెలుగు
బలభద్రపాత్రుని రమణి
16 జనవరి 2018

ఆలింగనం

రచయిత్రి;బలభద్రపాత్రుని రమణి

నేను రమణిగారి రచనలను చాలానే చదివాను. రమణిగారి రచనలు చాలా సున్నితంగా ఉంటాయి. చదువుతున్నప్పుడు మనసుకు ఆహ్లాదంగా  ఉంటాయి.  కాకపోతే  " ఆలింగనము" అన్న నవల అన్ని రచనలకన్న భిన్నం గా అనిపించింది.  ఇది ఒక టీనేజ్ అమ్మాయి ఆముక్త కథ.  టీనేజ్ అమ్మాయిల మనోభావనలకు రూపకల్పనలా ఉంది.  ఒక అమ్మాయి భావనలను ఈ కోణం లో వ్రాసిన కథను నేనింతవరకూ చదవలేదు.  ఈ కథ ఒక రకంగా నచ్చింది.  ఇంకో రకంగా చూస్తే ఎంత టీనేజ్ అమ్మాయైనా ఇన్నిసార్లు అబ్బాయిలను అంత సులభంగా నమ్మేస్తుందా అనిపించింది.  ఇక ఆముక్త పెద్దక్క సరయు పెద్దగా కోరికలేమీ లేకుండా ఉన్న మాములు అమ్మాయి.  చిన్నక్క కాళింది చదువు మీద ఆసక్తి ఉండి, బాగా చదువుకొని తండ్రి బాధ్యతలను పంచుకోవాలనుకునే అమ్మాయి.  ఇలా విభిన్నమైన మనస్తత్వాలు కల అక్కచెళ్ళెళ్ళ కథ నే ఈ "ఆలింగనం" ఇందులోని ఆముక్త పాత్ర రూపకల్పన గురించి రచయిత్రి నే అడిగి తెలుసుకోవాలనుకున్నాను .

నమస్కారమండి  రమణి గారు,

మీ ఇంటర్వ్యూ తీసుకునే ముందు మీకు ఒక విషయము చెప్పాలి.  నాకు బ్లాగ్ ఓపెన్ చేసినప్పుడు మా అబ్బాయి నన్ను, “నీ బ్లాగ్ కు ఏమి పేరు పెడతావు” అని అడిగాడు.  అప్పుడు నేను ఆంధ్రభూమి లో మీ సీరియల్ చదువుతున్నాను.  ఆ సీరియల్ పేరు గుర్తు లేదు కానీ, అందులో నాయిక సాహితి , నాయకుడు ఇతిహాస్.  సాహితి , ఇతిహాస్ పేర్లు ఇంగ్లీష్ లో తిరిగేసి చదువుతే (SAHITI- ITIHAS) ఒకటే స్పెల్లింగ్స్ వస్తాయి. ఆ పేర్లు నాకు చాలా నచ్చాయి.  అందుకని సాహితీ నా మెయిన్ బ్లాగ్ కు, ఇతిహాస్ నా టెస్ట్ బ్లాగ్ కు పెట్టుకున్నాను.  నా బ్లాగ్ సాహితి నన్ను ఒక రచయిత్రిగా మార్చింది.  ఇంతకు  ముందు ఈ విషయము  మీకు ఒక కామెంట్ లో చెప్పాను మీకు గుర్తుందో లేదో 😊  పరోక్షంగా నన్ను రచయిత్రి ని చేసినందుకు మీకు ధన్యవాదాలు.

  1. మీ రచనలు నేను చాలా సంవత్సరాల నుంచి చదువుతున్నాను.  మీరు చాలా పెద్దవారనుకున్నాను.  చూస్తే ఇంత చిన్నగా ఉన్నారు 😊 మీరు ఎప్పటి నుంచి రచనలు చేస్తున్నారు ?

జ; చిన్నప్పటి నుంచి నేను  విపరీతంగా చదివేదాన్ని. అద్దె పుస్తకాల షాప్ ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ సులోచనారాణి, మల్లాది, వీరేంద్రనాథ్ గారులాంటివారివి చదవడమే కాకుండా ఇంట్లో పెద్ద లైబ్రరీ ఉండడంవల్ల శరత్‍చంద్ర సంపుటాలు, అడవి బాపిరాజుగారు, పానుగంటివారు ఇలా చాలామంది రచనలు  చదివాను.  నాకు పంతొమ్మిదేళ్ళకే పెళ్ళైందండి.  నాకు పెళ్ళైన తరువాత మా అత్తవారింట్లో కూడా చాలా పుస్తకాలు ఉండేవి.  అలా చాలా పుస్తకాలు చదివాను.  పిల్లలు పెద్దవాళ్ళయ్యి స్కూల్ కు వెళ్ళటము మొదలుపెట్టాక నేను నా ఇరవైఆరోఏట నుంచి రచనలు చేయటము మొదలుపెట్టాను.

  1. మీ సాహితీ ప్రస్థానం గురించి వివరించగలరా ?

జ ;  సాహితీ ప్రస్థానం గురించి చెప్పాలంటే నేనొక స్కూల్ లో పనిచేసేదానిని. అక్కడి పిల్లలకోసం పాటలు , హైస్కూల్ పిల్లల కోస హాస్య నాటికలు వ్రాసేదానిని.  ”డిటెక్టివ్ గురునాధం” అన్నది నేను మొదటిసారి వ్రాసిన హాస్యనాటకం.  అది అందరు మెచ్చుకున్నారు.  అప్పుడు వ్రాయగలను అని నేను తెలుసుకున్నాను.  ఓ కథ వ్రాసి విపులకు పంపించాను.  దాని పేరు "ముళ్ళబాట". అది రమణీప్రభాకర్ పేరు మీద వచ్చింది.  నేను స్కూల్ లో పని చేస్తున్నప్పుడే ఏరోజుకారోజు డైరీ లాగా ఒక కథ వ్రాయటం మొదలుపెట్టాను. దాని పేరు "తృప్తి”.  దానిని చతుర ఆఫీసుకు తీసుకెళితే చలసాని ప్రసాద్ గారు “నోట్ బుక్ లో రాసుకొచ్చిందా నవల?” అని ఆశ్చర్యం గా చూసి "అమ్మా, ఇంతకు ముందు నువ్వు ఏఏ పుస్తకాలు చదివావు?" అని అడిగి తెలుసుకొని,"నీకు సాహితీ జ్ఞానం ఉంది. ఇలా నోట్ బుక్ లో రాసి తేకూడదు.  తెల్ల పేపర్ కు ఒకవైపు రాయాలి.  అయినా పరవాలేదు, వేసుకుంటాను" అని చతురలో ప్రచురించారు.  అనుకొకుండా ఒక కవిత రాసి ఆంధ్రజ్యోతి కి పంపాను.  అది  వీరేద్రనాథ్ గారు చూసి, బాగా రాసింది ఆ అమ్మాయి ని తీసుకురండి అని పిలిచారు.  ఆయన పిలిచినప్పుడు రెండుమూడు సార్లు నాకు వెళ్ళేందుకు వీలుకాలేదు. ఒకసారి మావారిని తీసుకొని వెళ్ళాను.  అప్పుడు వీరేంద్రనాథ్‍గారు,  “మీరు కవిత బాగా రాసారు ఇంకేమైనా రాసారా!” అని అడిగారు.  ఏవో నేను రాసుకున్నవి చూపించాను.  “మీరు బాగా రాస్తారు” అని ఎంకరేజ్ చేసి, “మీరు కథలు రాయొచ్చు కదా” అన్నారు.  దానికి నేను,  “మా తాతగారి గురించి రాసాను.  మా తాతగారు అమ్మమ్మ ఫ్రీడం ఫైటర్స్.  రాజమండ్రి నుంచి లక్నోదాకా కాలినడకన వెళ్ళారు.  ఎన్నో కష్టాలు పడ్డారు.  యేడాది పసి పాపను తీసుకొని ఐదునెలల పద్నాలుగు రోజులు నడిచి వెళ్ళారు.  వారి గురించి "లీడర్"అనే పేరు తో రాసాను.  అది వేయించగలరా?” అన్నాను.  “ఇవి ఎవరూ చదవరు.  ఏ పబ్లిషర్ వేయరమ్మా.  అయినా చదివి చెపుతాను” అని తీసుకున్నారు.  తరువాత వారం రోజులకే “సిటీసెంట్రల్ లైబ్రరీ లో మీ బుక్ అవిష్కారం ఉంది రం”డన్నారు. నేను షాక్ అయిపోయాను.  “ఎమెస్కో విజయ కుమార్ తో మాట్లాడాను.  మీ పుస్తకం వేయిస్తున్నాను” అన్నారు.  డిశంబర్ 31 -1993 న నా బుక్ అవిష్కరణ అయితే, జనవరి 1 -1994 న నా తృప్తి నవల చతురలో పబ్లిష్ అయ్యింది.  అది నా మొదటి నవల.  అలా నా సాహితీప్రస్థావన మొదలయింది.

  1. మీకు ఎటువంటి రచనలంటే ఇష్టం ?

జ ; నాకు అవీ ఇవీ అనిలేదు అన్నిరకాల రచనలూ ఇష్టమే. . కాకపోతే ఇటీవల వస్తున్న రచనలే అంతగా నచ్చటం లేదు.  యంగ్స్టర్స్ అసలు రాయటం లేదు.  మిగతావాళ్ళేమో  ఓల్డేజ్ ప్రాబ్లమ్స్ లేదా పిల్లల గురించీ, పిల్లలు విదేశాలకు వెళ్ళిపోవటము, తల్లి తండ్రులను  పట్టించుకోవటము లేదు, యంగ్ జనరేషన్ అంతా పాడైపోతోంది అన్నధోరణిలో,  ఇప్పుడు మనకు లేనటువంటి కష్టాల గురించి ,ఆడవాళ్ళ అణిచివేత లాంటి  పాత చింతకాయ పచ్చడి కథలు వస్తున్నాయి.  లేదా మరీ న్యూ ట్రెండ్ లో వాళ్ళేమి రాస్తున్నారో వాళ్ళు మనసులో ఇంగ్లీష్ లో అనుకొని తెలుగులో రాస్తున్నారు.  గ్రామర్, వాక్య నిర్మాణము సరిగ్గా ఉండదు.  చదువుతుంటే ఆహ్లాదంగా, మనోరంజకంగా  ఉంటే , మనము కథలో ఏమి చెప్పినా పాఠకులు చదువుతారు.  మనోరంజకంగా కాదు కదా కనీసం ఆసక్తితో తరువాత పేజీ తిప్పుదాము అని కూడా అనిపించటం లేదు.  నాలుగైదు పేజీల కథలు కూడా పైపైన తిరిగేసి లాస్ట్ కేమి రాసారు అని చూసే పరిస్తితి వచ్చింది అంటే రచనలో పట్టులేదు అని నేను అనుకుంటున్నాను.  తక్కువ మంది చాలా తక్కువ మంది  బాగా రాస్తున్నారు.  పత్రిక లో నాలుగైదు కథలు పడితే ఒక్కటి కూడా బాగాలేదు.  ఎప్పుడైనా ఒక్కటి బాగుంటోంది.  ఆ మంచి కథ కూడా ఎక్కడో ఒక చోట తగులుతోంది.  నేను మాగజైన్స్ కి కథలు రాయటం మానేసాను కూడా.  టి. వి లో, సినిమాలో బిజీగా ఉంటూ ఆరేడు యేళ్ళగా రాయటం లేదు.  నేనంటే చాలా ఇష్టపడేవారు, నా అభిమానులు అలా అనవచ్చో లేదో తెలియదు వారు అడగటము వలన  లాస్ట్ యియర్ “ఎందుకీ సందెగాలి. . ” అనే ఒక నవల రాసాను అది అందరికీ నచ్చింది

  1. మీ రచనలు చాలా వరకు సున్నితం గా  ఉంటాయి.   కాని “ఆలింగనం” చదివి నప్పుడు వేరు గా అనిపించింది.  ఒక అమ్మాయి అంతగా మగవాడి ని నమ్ముతుందా ? ఆ నవల గురించి మీరు ఏమి చెపుతారు ?

జ.  ఆలిగనం నవల గురించి అడిగారు. ఒక అమ్మాయి అంత మంది మగవాళ్ళతో మోసపోవటము జరుగుతుందా అని.  ఇది వాస్తవ గాధ.  ఒక అమ్మాయి నాదగ్గరకు వచ్చి చెప్పింది. ఆ అమ్మాయి చెప్పినప్పుడు ఇంకా కొంచం జోడించిరాసాను. చాలా మంది ప్రేమించే టెండెన్సీ ఉన్న అమ్మాయిలు గురించి మాట్లాడుతున్నాను.   పదమూడు పద్నాలుగేళ్ళ వయసులో రోజూ చూసే పాలవాడో పక్కింటి అబ్బాయో ఎవరైనా సరే ప్రేమించాలని ఉంటుంది.  ఎందుకంటే ప్రేమించే వయసు.  అలాగే అబ్బాయిలకు కూడా అమ్మాయిలను చూడగానే అట్రాక్షన్స్ మొదలవుతాయి.  కాలేజ్ లో, టీనేజ్ లో ఉన్నప్పుడు.  ఆ స్టేజ్ మనమంతా దాటి వచ్చాము.  చాలాకాలమైపోయి టీనేజ్ దాటి వచ్చిన వాళ్ళకు అవి గుర్తుండవు.  కాని అవి మధురస్మృతులుగా దాచుకున్నవాళ్ళకి గుర్తుంటాయి.  ప్రేమ కథలు, ప్రేమలేఖలు, ప్రేమ వ్యవహారాలు ఆ ఏజ్ లో చాలా సహజము.  కాని ఈ అమ్మాయి  చెప్పిందానికి నేను ఇంకా కల్పించి రాసాను.  నాకు చాలా ఇష్టం ఈ నవల.  ఇప్పటికీ చదువుకుంటూ ఉంటాను.  ఎందుకంటే ఇందులో వర్జినిటీ ఉంది. నేను మొదట్లో రాసిన నవలల్లో స్వేచ్చగా నా భావాలన్నీ రాసేదానిని.  వాళ్ళే మనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని నేనాడూ ఆలోచించలేదు.  సో ఒక ఆడపిల్ల ఏమనుకుంటుందో స్వచ్చంగా రాసిన భావాలవి.  చాలామంది అమ్మాయిలకు నచ్చిన నవల.  నాకూ చాలా ఇష్టమైనది.  ఇంకోటి అలా నేను రాయలేను కూడా ఎందుకంటే అప్పుడు ఆ వయసు లో ఉన్నాను కాబట్టి రాసాను.

5. మీరు టి. వి రంగము లోకి ఎలా ప్రవేశించారు ? టి , వి లో మీకు నచ్చిన అంశం ఏమిటి ?టి. వి , రచన రెండింటి లో దేనికి మీ ప్రిఫరెన్స్ ?

జ ; ;. నా మొదటి సీరియల్ "అనూహ్య".  అది ఈటివి లో వచ్చింది. అది స్వాతి లో వచ్చిన నా నవల.  దానికి స్క్రీన్ ప్లే మాటలు నేనే రాసాను.  అప్పుడే ఆంధ్రప్రభ లో పడిన "రేపల్లెలో రాధ " కూడా బాలకృష్ణ , ఆయన తొడల్లుడు కలిసి సినిమాగా తీసారు.  రెండు షూటింగ్ లూ ఒకేసారి స్టార్ట్ అయ్యాయి. అలా అనుకోకుండా నవలలు వాళ్ళు కొనుక్కోవటం వల్ల  సినిమాలో, టివీ లో ఎంటర్ అయిపోయాను.  నేను కథ, స్క్రిన్ ప్లే, మాటలు అన్నీ రాస్తాను మా గురువుగారు శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు.  ఆయన వర్క్ షాప్ లో శిష్యురాలిని ని కాను కాని, లీడర్ నవల గురించి ఆయనను అడిగినప్పటి నుంచి, సీరియల్ రాసినా, నవల రాసినా ఆయనకు చూపించి సలహాలు తీసుకునేదానిని.  అప్పట్లోనే ఆయన వెన్నెల్లో ఆడపిల్ల, అంతర్ముఖం ఇవన్నీ టి. వి లో సీరియల్స్ గా వచ్చేటప్పుడు నాతో మాటలు రాయించారు.  అసలు స్క్రీన్ ప్లే అంటే ఏమిటి అని నేను అడిగినప్పుడు, మాటలు ఎలా రాయాలి అని  ఒక తెల్ల కాగితము తీసుకొని మధ్యలోకి మడిచి, “చూడు, నీ ఎడమచేతి వైపు నీ మనసులోని భావాలు, వాళ్ళు ఏమి చేస్తారు? ఏమి నటిస్తారు ఆ మాట చెప్పేటప్పుడు వాళ్ళ హావభావాలు, కాళ్ళు చేతులు ఏ భంగిమలో నిలబడ్డారు? ఇవన్నీ ఇక్కడ రాయి.  కుడిచేతివైపున వాళ్ళ సంభాషణలు రాయి.  సంభాషణలు నువ్వు చాలా బాగా రాస్తావు. ” అని నన్ను ఎంకరేజ్ చేసారు. అప్పటి నుంచి ఆ పేపర్ చేతిలో పట్టుకొని, ఇన్నేళ్ళుగా దాదాపు ఇరవై ఏళ్ళుగా దానిమీద బతుకుతున్నాను. లిటరల్గా బతుకుతున్నాను టి. వి కి స్క్రీన్ ప్లే , టివి.  కి కథ టి. వి సంభాషణలు సమకూర్చి. ఇవి కాకుండా స్క్రీన్ ప్లే లో చాలా మెళుకువలు,స్క్రీన్ ప్లే ఎలా చేయాలి,ఒక నవల తీసుకుంటే ఎలా మార్చాలి అంటే, సుడులు రేగుతున్న ఆలోచనల తో ఆమె చాలా గంభీరంగా ఉంది.  ప్రశాంత గోదావరి లా ఉంది కాని మనసులో సుడి గుండాలు తిరుగుతున్నాయి.  ఇది రచనా సంస్కృతి తో రచయిత్రులు రాసే భాష.  కాని తెర మీద మనకు ఆ అమ్మాయి బాధ పడుతోంది. ఆ అమ్మాయిలో చాలా అంతరంగ మధనం జరుగుతోంది అని చూపించాలి దానికి మనం స్క్రీన్ ప్లే ఎలా రాస్తాము ? ఆ అమ్మాయిని ఎక్కడ, ఎటువంటు పరిస్థితులలో కూర్చోబెడతాము? పగలా రాత్రా?  టైం ఏమిటి, గదిలోనా, బయిటా, సింబాలిక్‍గా మోడుగా ఉన్న ఒక చెట్టు కింద కూచోబెట్టి చూపిస్తున్నామా లాంటివే  కాకుండా, ఆ అమ్మాయి  ఎదుటివాళ్ళతోటి మాట్లాడుతున్నప్పుడు బాధంతా ప్రస్పుటమయ్యేలా మరీ ఎక్కువ పేరాలు పేరాలు కాకుండా చిన్న చిన్న మాటల్లో చెప్పడం, ఎవరూ లేకపోతే తన బాధని ఎలా వ్యక్తీకరించుకుంటుంది, హావభావాలను ఎలా చూపిస్తుంది, ఇవన్నీ స్క్రీన్ ప్లే.  స్క్రీన్ ప్లే అంటే మనము పేపర్ మీద రాసిందంతా ఎలాచూపిస్తాము అన్నది స్క్రీన్ ప్లే.  ఇది ఆయన నాకు నేర్పించారు.  అప్పటి నుంచి నేను నవల, కథ పత్రిక లో రాయటం తగ్గించి, టి. వి కి, సినిమా కి ఎక్కువగా రాస్తూ వచ్చాను.  కారణం డబ్బండి.  ప్రధాన సమస్య ఏమిటంటే అప్పుడు కథ కు నాకు ఐదొందలు ఇస్తే ఇప్పటికీ నాకు ఐదొందలే ఇస్తున్నారు పత్రిక వాళ్ళు.  సీరియల్స్ లో కొన్ని పత్రికలు , పేర్లెందుకు కాని లేడీ ఎడిటర్స్ గా ఉన్నవాళ్ళు నన్ను చాలా సార్లు అడిగారు.  మీ సీరియల్స్ బాగుంటున్నాయి, అందరూ చదువుతున్నారు, వరుసగా ఇస్తాను.  నాకు సగం, నీకు సగం డబ్బులు అని వారపత్రిక ఎడిటర్ అడిగారు.  నాకు విసుగొచ్చి మానేసానండి.  నేను రూపాయి కూడా ఎవరికీ లంచం ఇవ్వను.  ఈ టి. వి లో కూడా ఒకరు లంచమడిగితే కేసు పెట్టాను.  రామోజీ రావుగారికే డైరెక్ట్ గా ఉత్తరం రాసాను.  “నాకు న్యాయం గా రావలసిన  రూపాయి నాకు రావాలి.  అందులో పావలా కూడా ఎవరికీ ఇవ్వను.  ఎక్కువ ఇయ్యక పోతె పావలానే ఇవ్వండి.  కాని ఆ పావలాలోనే వాటా అడగకండి.  ఎందుకు మీకు జీతాలిస్తున్నారు కదా యజమాన్యం.  మీరెందుకు లంచాలు తీసుకోవాలి? కలుషితమైన నీళ్ళ తోటి మొక్కలను పెంచినట్లు మీరు పిల్లలను ఈ లంచాల తో పెంచకండి. ” అని ఆ ఆడ ఎడిటర్ కు నేను సలహా ఇచ్చా.  ఉత్తరము కూడా రాసా.  ఆ సెక్షన్ లో వాళ్ళందరు కూడా ఆ ఉత్తరం చదివారు అప్పట్లో.  ఆ తరువాత ఆవిడ చాలా మంది దగ్గర లంచాలు తీసుకుంది .  ఇప్పటి సంగతి నాకు తెలీదు.  ఇప్పుడు రెగ్యులర్ గా రాసే రైటర్స్ ఎవరూ లేరు కూడా.  అందుకని టి. వి వైపు మొగ్గు చూపిస్తున్నాను.  మాకు తగినంత డబ్బు వాళ్ళిస్తారు.  కరెక్ట్ గా ఇస్తారు ఏరోజు ది ఆరోజు మొత్తం నెల అయ్యేసరికి మనకు వచ్చేస్తుంది.  రోజుకి నాలుగైదు వేలు సంపాదించుకునేవాళ్ళం.  వీళ్ళు ఇన్ని వారాలు రాస్తే మాగ్జిమం ఇరవైవేలు ఇస్తారేమో.  ఒక్క స్వాతి వాళ్ళు తప్పిస్తే.  ఆయనొక్కరే ఇస్తున్నారు లక్ష రూపాయాలు.  దీని కోసం నేను ఆరు నెలలు ఏడునెలలు రాసి ఎదురుచూడటం కంటే కూడా మాకు నెలనెలా ఇక్కడ పెద్ద చెక్కులు వస్తున్నాయి కాబట్టి నేను టి. వి కి వ్రాయటానికి ఇది మొదటి కారణం.  రెండోది నిజానికి నాకున్న సీనియారిటీ వల్ల నాకు డిమాండ్ ఉంది.  డిమాండ్ ఉన్నంతవరకే మనం రాయగలం.  నవలా చిత్రాలు తీసే రామానాయుడుగారు, కె. యస్. రామారావు గారు వాళ్ళు ఇప్పుడు తీయట్లేదు కాని కొత్త ప్రొడ్యూసర్స్ ఎవరైనా వచ్చి, విలువలున్న సినిమాలు మేము తీస్తాము అంటే నేను కథ తప్పకుండా ఇస్తాను. ఇప్పుడు నేను సినిమాలకు పని చేయటం లేదు అని కాదు కాని, స్క్రీన్ ప్లే కాని ఏ సహకారమడిగినా చేస్తాను పెద్దబానర్ లో చిన్నబానర్ లో ఎవరడిగినా సహకారం చేస్తాను. నా నవలలు, నా కథలు ఇవ్వాలంటే ఇప్పుడొస్తున్న ట్రెండ్ కి ఇష్టం ఉండకపోవచ్చు.  నేను కూడా ఎక్కువ ట్రై చేయటం లేదు.  ఎందుకంటే చాలా శ్రమ, కాల వ్యయం ఇవన్నీ మనసులో పెట్టుకొని వచ్చిపడిపోతున్న పనులు రోజువారీ పనులు, డైలీ సీరియల్స్, వెబ్ సీరీస్ ఇవన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయి.  రెండు వెబ్ సీరీస్ చేస్తున్నాను.  ఇప్పుడు "మాతృదేవోభవ" జెమినిలో అక్టోబర్ ముప్పై నుంచి ప్రసారమవుతుంది ఎనిమిది గంటలకు.  ఇంకో సీరియల్ చేస్తున్నాను "సంధ్యారాగం" v6 చానల్ లో. అందుకని సినిమాల కోసం తిరిగి వాళ్ళ వెనుక పడే టైం నాకు లేదు. ఎవరు నన్ను అడుగుతున్నారో అందులో నాకు నచ్చిన నిర్మాతలకు చేస్తున్నాను. రచన,టివి దేనికి ప్రాధాన్యం అంటే  అంటే నా నవలలే నాకిష్టం అండి.   కాని నాకిప్పుడు టైం దొరకటం లేదు.  నాలుగైదు సంవత్సరాలు ఇలా బిజీగా ఉంటే ఆ తరువాత  బలవంతంగానైనా రిటైరై ప్రశాంతముగా నేను రాయలనుకున్న చాలా సబ్జెక్ట్ లున్నాయి, అవి రాయాలని అందరికీ ఆనందం కలిగించాలని నా అభిమతం.

నేను చేసినవి కొద్ది సినిమాలే ఐనా నాకు మంచి పేరు తెచ్చాయి.  రేపల్లెలో రాధ కొత్తవాళ్ళను పెట్టి తీయటము వల్ల పెద్దగా ఆడకపోయినా నాకు వంశీ బర్కిలీ అవార్డ్ వచ్చింది ఉత్తమ కథాచిత్రం గా చాలా మంచిపేరు వచ్చింది.  సత్యనారాయణగారు, గుమ్మడి గారు అందులో ఆక్ట్ చేసారు.  సత్యనారాయణగారు మా ఇంటికి కూడా వచ్చారు. నాకు ఆ నవల ఎంతో నచ్చిందమ్మా అన్నారు.  అందరూ ఆ నవల చదివే ఆక్ట్ చేసారు. శరత్ గారు డైరక్ట్ చేసారు.  అప్పుడే నాకు నడుముకు ఆపరేషన్ అయ్యింది.  అయినా కాని నేను వెళ్ళి ఆ సినిమాకు వర్క్ చేసాను.  రాజమండ్రి లో షూటింగ్.  మా అమ్మను, మా చిన్న అబ్బాయిని తీసుకొని వెళ్ళి రెండు రోజులు వాళ్ళ తోనే ఉన్నాను.  అందరూ నాకు విలువ నిచ్చేవారు. రామానాయుడు గారు ఏ భాషలో తీసినా నేనే స్క్రీన్ ప్లే రాసేదానిని.  “మధుమాసం” వందరోజుల సినిమా.  దానికి ఉత్తమ కథా నంది ఎవార్డ్ వచ్చింది.  “అందరి బంధువయా” నాకు మంచి పేరు తెచ్చింది.  దానికి కథా మాటలు కూడా నేనే రాసాను. అందులోని కామెడీ సంభాషణలు అందరికీ నచ్చాయి.  దానికీ ఉత్తమ కుటుంబ కథా నంది ఎవార్డ్ వచ్చింది.  నాకు ఎన్నో ఎవార్డ్స్ వచ్చాయి.  మా ఇంటి నిండా ఉన్నాయి.  నాకు ఎంతో ఇష్టమైంది, స్పెషల్ గా అనిపించేది నా నందులు కాకుండా "నెమలికంటి మహలక్ష్మమ్మ” ఎవార్డ్  యద్దనపూడి సులోచనారాణి గారి అమ్మగారి పేరు మీద వచ్చినది. అప్పుడు గోవిందరాజు సీతాదేవిగారు మా అమ్మ ఎవార్ద్ తీసుకుంటున్నావు మా అమ్మవు  అన్నారు.  సులోచనారాణి గారు నా కలలరాణి . ఆవిడను చూసే నేను కలం పట్టాను. ఆవిడ దగ్గర నుంచి ఎవార్డ్ తీసుకోవటం అన్నది నా జన్మ ధన్యం గా భావిస్తున్నాను.  అట్లాగే నేను మధుమాసం సినిమా రాసిన తరువాత వీరేంధ్రనాథ్ గారు ఒక రోజు నాకు ఫోన్ చేసి చాలా బాగా రాసావమ్మా అన్నారు. విశ్వనాథ్ గారు కూడా ఒకసారి ఫోన్ చేసి నన్ను మెచ్చుకున్నారు. నా కాలం దాటని కథలు చదివి నేను కామెడీ బాగా రాస్తాను అంటారు.  ఆ కాలం చాలా మందికి నచ్చి,  నేను కామెడీ బాగానే రాస్తాను అని రాసిన ఉత్తరాలు చదువుతుంటే ఓహో అనిపించి అలా కంటిన్యూ చేస్తున్నానండీ “ఆడవాళ్ళల్లో కామెడీ రాయటమన్నది చాలా అరుదు. ఆడవాళ్ళు కామెడీ రాస్తే అందులో వల్గారిటీ లేకుండా, అపహాస్యం లేకుండా, వెకిలితనం లేకుండా రాస్తారు అని మా కర్ధమైంది. సున్నితంగా ఉంటుంది. రమణి కామెడీ బాగా రాస్తుంది” అంటారు నాగబాబు గారు,అరవింద్ గారు. నాకు అవకాశం వచ్చినంతవరకూ కామెడీ రాస్తూనే ఉంటాను.  నాకు ఇష్టమైనది హాస్యరసం.

మల్లాది కృష్ణమూర్తిగారు కూడా కాలం దాటని కబుర్లు కు ముందు మాట వ్రాయమంటే "హాస్యం రాస్తే పొత్తూరి విజయలక్ష్మి, బలభధ్రపాత్రుని రమణి వీళ్ళే రాయాలి" అని రాసారు. నీలాగా రాయాలి అని నేనుట్రై చేస్తాను. ఎలా రాస్తావు అలా అని వీరేంధ్రనాథ్ గారు ఫోన్ లో అడిగినప్పుడు చాలా గర్వంగా ఫీలయ్యాను. ఎందుకంటే ఆయన శైలి కోసం నేను పాకులాడేదానిని. ఆయన శైలి అంటే విపరీతమైన ఇష్టం.  నా అభిమాన రచయత, నా గురువు ఆయన మెచ్చుకోవటం అన్నది నాకు వరము. కాబట్టి నేను చాలా సంతోషంగా ఉన్నాను నా రచనా జీవితం లో.

5. ఈ మధ్య టి. వి కార్యక్రమాల గురించి చాలా విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా మహిళలను విలనల్ లు గా చూపించే సీరియల్స్ గురించి మీ అభిప్రాయం ఏమిటి? పెద్దవాళ్ళు అవి నచ్చకపోతే న్యూస్ , భక్తీ చానల్స్ చూడవచ్చుగా అని కొంత మంది అంటున్నారు.  అంటే కొంచం పెద్ద వయసు వచ్చినంతమాత్రాన ఏ సరదాలు ఉండ కూడదా ? ఇక భక్తి కి, వార్తలకు అంకితం అయిపోవాలా ?

టి. వి సీరియల్స్ గురించి నా అభిప్రాయం అడుగుతున్నారు ఆడవాళ్ళను విలన్స్ గా చూపించటం గురించి.  ఇప్పుడూ దాని గురించి నేను చాలా సార్లు వివరణ ఇచ్చాను.  చానల్ డిమాండ్, ప్రొడ్యూసర్ డిమాండ్ ఎలా ఉంటే అలాంటి కథలు వాళ్ళు అప్రూవల్ చేస్తారు.  కొన్నిసార్లు విలన్ లు లేక పోతే వాళ్ళను విలన్ లు చేయి, వీళ్ళను విలన్ లు చేయి అంటారు. వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే ప్రతికూల శక్తి ఉంటేనే కాని హీరో కాని ఒక హీరోయిన్ కాని వాళ్ళ మంచితనం ఎలివేట్ అవుతుంది అని.  పాతకాలం నుంచీ కూడా రావణుడు ఉంటే నే రాముడి గొప్పతనం తెలిసింది. అలాగే శూర్పణఖ ఉంటేనే సీతా, మండోదరి పతివ్రతలయ్యారు. అందుకని వాళ్ళు కథ కు విలన్స్ ను పెడతారు. విలన్స్ కు ఆడ మగ అని బేధం లేదు. మొత్తం మగ విలన్స్ ఉంటే చూడలేం మనం. ఆడ విలన్స్ ఉంటే వాళ్ళు పెట్టుకునే నాగుపాము బొట్టు, వాళ్ళ హావభావాలు, వాళ్ళ అలంకరణ, వాళ్ళు కట్టుకునే చీరలు వాటి మీద దృష్ఠి పోయి కొంత కామెడీ గా కూడా ఉంటూ ఉంటాయి కాబట్టి ఆ విలనిజం తగ్గుతుందేమో నని నేను అనుకుంటున్నాను.  మీరన్నట్లు కోడళ్ళను మెట్ల మీద నుంచి పడేయటం , వేడి నూనే పోయటం మొదలైనవి నాకు కూడా అసహ్యమే.  అలాంటి వి నేను అంగీకరించను,వ్రాయను.  టివి రంగం లో మగరచయతలు చాలా మందే ఉన్నారు. కాని ఆడవాళ్ళల్లో రాస్తున్నది నేనూ, ఉషారాణిగారు ఇద్దరు ముగ్గురమే ఉన్నాము.  ఎక్కువ మంది లేరు.  అందరి మీద కత్తి కట్టి ఉధ్యమాలు చేసే బదులు చేతి లో రిమోట్ ఉంది కదా మార్చుకోవచ్చు కదా అని అనుకుంటాను.  పెద్దవాళ్ళను నేను భక్తి చానల్స్ మాత్రమే చూడండి అని ఎప్పుడూ చెప్పను.  అన్ని చానల్స్ చూడాలి.  అన్నీ ఎంజాయ్ చేయాలి. కాని నచ్చనివి చూస్తూ వాళ్ళను తిట్టుకుంటూ, మానసికంగా కుమిలిపోతూ అనారోగ్యం కావటం కంటే నచ్చినవేవో వెతుక్కొని  చూడటం మంచిది కదా!

6. ?

  • ; చిన్నప్పటి నుంచి కళలంటే చాలా ఇష్టం.  స్కూల్ లో ఉన్నప్పుడు నేను డాన్స్ చేసేదానిని.  మా అమ్మ మంచి గాయని.   మా అమ్మ సత్యవతి , ఇంద్రగంటి జానకీ బాల గారు ,ఇంకొక ఆవిడ ఐపాప అని వీళ్ళు ముగ్గురూ కూడా చాలా మంచి సింగర్స్.  ఘంటసాల గారి తో కూడా కచేరీలు చేసింది.  ఫ్రీడం ఫైటర్ గా బాక్ గ్రౌండ్ ఉంది.  సాహిత్యం ఉంది.  నేను ఎక్కువగా స్కూల్ లో ఉన్నప్పుడు నాటకాలు ఎక్కువగా కల్చరర్ ఆక్టివిటీస్ లో పాల్గొనేదానిని.  కాలేజ్ లో ఉన్నప్పుడు డ్రామాలు నేనే రాసి, డైరెక్ట్ చేసి, నటించేదానిని.  నటించటము కూడా ఇష్టం.  కాని వీటన్నిటి మీద దృష్ఠి పెట్ట కుండా రచనల మీద పెట్టటానికి కారణం ఏమిటంటే మన లోకంలో  ఎవరి ప్రమేయం లేకుండా మనము చేసుకునే పని.  నృత్యం అంటే కూడా పెళ్ళైన తరువాత, పిల్లలు పుట్టిన తరువాత కూడా మనతో ఒకరుండటము, ఒక బృందము, నట్టు వాంగము ఇదంతా ఉంటుంది.  నేను కూచిపూడి డాన్స్ కూడా నేర్చుకున్నాను.  అవన్నీ నేను అటకెక్కించేసాను.  ఇది మాత్రం మిగిలింది.  ఎందుకంటే ఇది లేట్ గా మొదలు పెట్టాను.  మా అమ్మమ్మగారు కూడా చాలా పుస్తకాలు రాసారు.  దుర్గాబాయి దేష్ ముఖ్ తో కలిసి హాస్టల్ లో ఉండి చదువుకున్నారు.  ఆవిడ మనవలకు ఇంగ్లీష్ లెక్కలు చెప్పేవారు.  సో ఈ బాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన నాకు సాహిత్యం అంటే ఉండే మమకారం వల్ల ఈ రంగం లో స్థిరపడ్డాను.

నేను ఇరవై ఆరు నవలలు, మూడువందలరవై కథలు ఇంక వెయ్యి కాలమ్స్ రాసి ఉంటాను,. ఇంకా చాలా చాలా వ్యాసాలు కూడా రాసాను.  పది సంవత్సరాల నుంచి ఒక్క నెల కూడా ఆగకుండా “కాలం దాటని కబుర్లు” అనే హాస్యకాలమ్ కౌముది లో రాస్తున్నాను.

కొత్త రచయిత్రుల కు నేనిచ్చే సలహా ఇదే. .  “బాగా చదవండి.  అన్ని సాహిత్యాలు చదవండి. అందులో ఏది మంచి, ఏది చెడు నిర్ణయించుకోండి. మీరు బాగుండే విధంగా రాయండి. ఎవరేమనుకుంటారో అనే విధంగా ఎపుడూ ఆలోచించి రాయొద్దు.  ఎవరినీ మనసులో రానివద్దు . మీరు చెప్పదలుచుకున్న భావాలు స్వేచ్చగా,నిర్భయంగా, తలెత్తుకొని చెప్పండి. ఎక్కడైతే నిష్కల్మషంగా ,పవిత్రంగా మన మనసులో ఉన్న ఆలోచనలను అవిష్కరిస్తామొ అప్పుడు రచన అందంగా వస్తుంది. ”

6. మీరు ఇంత అందంగా ఉన్నారు.  మీ వాయిస్ కూడా బాగుంది. మీరెందుకు టివి, సినిమాలల్లో నటనకు వెళ్ళలేదు ?

  • ;చాలా మంది అడుగుతారండి. చాలా యంగ్ ఏజ్ లోనే నాకు అవకాశాలు వచ్చాయి. కాని అది నా లైన్ కాదు అనుకున్నాను. మా అమ్మ కూడా ఇష్టపడలేదు. అందుకే నేను సినిమా లో ఆక్ట్ చేయలేదు. మాకు సినిమా పరిశ్రమ తో కొంచము అనుబంధం ఉంది. నేను స్కూల్ లో ఉన్నప్పుడే నాటకాలల్లో పాటలు పాడేదానిని.  నన్ను నాటకాలల్లో ఆక్ట్ చేయించాలని ట్రై చేసేవారు అందరు. నేను రేడియో డ్రామాలల్లో యాక్ట్ చేసేదానిని.  అప్పుడు నన్ను స్టేజ్ మీదకు తీసుకెళ్ళాలని దేవదాసుకనకాల లాంటి వారు కూడా అడిగారు.  కాని నాకు ఆ రంగం ఇష్టం లేదండి.  ఇప్పుడు కూడా నాకు చాలా అవకాశాలొస్తున్నాయి.  సింగీతం శ్రినివాసరావు గారు అడిగారని “వెల్కం ఒబామా” లో నటించాను.  అప్పుడు నాకు వంట్లో కూడా బాగాలేదు. ఐనా నటించాను. జో అచ్యుతానంద లో కూడా మంచి అవకాశము వచ్చింది.  కాని మా అబ్బాయి కాన్వొకేషన్ అని అమెరికా వెళ్ళిపోయాను. వచ్చిన తరువాత కూడా చాలా మంది అడిగారు.  అమ్మ అత్త పక్కకు నిలబటం లో ఏముంటుంది నటన.  ఇప్పుడు బాధ్యతలు లేవు కాబట్టి బాగా నటనకు ప్రాధాన్యత ఉండి, నాకు నచ్చే పాత్ర వస్తే చేస్తానేమో.  నా యంగ్ ఏజ్ లో నేను డాన్స్ చేసేటప్పుడు చాలా మంది అడిగారు కాని అమ్మ, నాన్న ఒప్పుకోకపోవటము వలన నటించలేదు.  బహుశా రచయిత్రి గా మారటమే రాసి పెట్టి ఉందేమొ!

7. చివరగా మీ కుటుంబము గురించి చెప్పగలరా ?

నేను తొమ్మిదో క్లాస్ లో ఉన్నప్పుడే మా అన్నయ్య ఫ్రెండ్ ప్రభాకర్ నన్ను ఇష్టపడ్డాడు. ఇంటర్ మిడియేట్ లో ఉన్నప్పుడు “రమణి కి మీరు ఏ సంబంధాలు చూడొద్దు నేను పెళ్ళిచేసుకుంటాను” అని మా అమ్మకొచ్చి చెప్పాడు.   నేను మేజర్ అయ్యాక పెళ్ళి చేసుకున్నారు :) మా ఇద్దరబ్బాయిలూ అమెరికాలో యం. యస్ చేసి వచ్చారు.  రెండోవాడు అమెరికాలోనే ఉన్నాడు.  చిన్న కుటుంబం మాది.  ఇద్దరు అబ్బాయిలు.  రాబోయే ఇద్దరు కోడళ్ళు.  ఆయన సహకారం చాలా ఉంది.  ఆయన ప్రొత్షాహం లేకుండా ఇంత పేరు తెచ్చుకునేదాన్ని కాదు.  పిల్లలను, బయట నేను సక్రమంగా నిర్వహించటానికి కారణం మా ఆయన.  అమ్మ నన్ను చాలా కష్టపడి పెంచింది.  అమ్మ సహకారం ఇప్పటికీ ఉంది.  అమ్మ కు మా ఆయనకు నేను చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటాను.  వీళ్ళ కు కాకుండా ఇంకెవరికన్నా అంటే మా పిల్లలకు చెప్పుకుంటాను.   నేను టైం అంటూ లేకుండా టి. వి,సినిమా రంగాలల్లో పని చేస్తూ ఉంటాను.  ఐయినా కూడా మా పిల్లలు  ఏరోజూ అమ్మ సరిగ్గా చూడలేదు అని కంప్లేంట్ చేయలేదు.  వాళ్ళకు నా రచనలంటే చాలా ఇష్టం.  భగవంతుడు నా మీద చూపించిన అనుగ్రహముతో నాలుగు అక్షరాలు వచ్చాయి.  వచ్చే జన్మలో కూడా రచయిత్రిగా పుట్టించమని ఆ దేవదేవుని కోరుకుంటున్నాను.

8. ?

  • ; ఎమెస్ కో, నవోదయా లో చాలా వరకు దొరుకుతాయి.
  • ,నమస్తే .

రమణిగారూ  మీ విలువైన సమయాన్ని నా కొరకు వెచ్చించి , ఓపికగా సమాధానాలు ఇచ్చినందుకు ధన్యవాదాలండి.

ప్రఖ్యాత రచయిత్రి బలబధ్రపాత్రుని రమణి గారి తొ సంభాషించటము చాలా సంతోషం గా ఉంది. వచ్చే నెల మరో రచయిత పరిచయము తో కలుసుకుందాము.

 

మీ 

మాల కుమార్