pratilipi-logo ప్రతిలిపి
తెలుగు
ప్రముఖ కవయిత్రి సొన్నాయిల కృష్ణవేణి గారితో అఖిలాశ ముఖాముఖి
12 సెప్టెంబరు 2017

 

మీ పూర్తీ పేరు?

సొన్నాయిల కృష్ణవేణి..కలం పేరు అనామిక


మీ విద్యాభ్యాసం గురించి?

నేను పదవతరగతి వరకు కరీంనగర్ జిల్లాలో చదివాను.... తర్వాత పెళ్ళవడంతో వరంగల్ రావడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ పన్నెండేళ్ళకి ఓపెన్ ఎడ్యుకేషన్ ద్వారా చదువు మొదలు పెట్టాను.... అలా డిగ్రీ, బి.ఎడ్, పి.జి,ఎమ్.ఎడ్ చేసాను.

 

మీ కుటుంబం గురించి?

నాన్న గారు టీచర్... అమ్మ గృహిణి... ఒక అక్క ఒక తమ్ముడు.... మా ఆయన కుమారస్వామి మా కులవృత్తి చేస్తారు... ముగ్గురు పిల్లలు...!!


సాహిత్యం వైపు మీ అడుగులు ఎలా పడ్డాయి?

నాకు చిన్నప్పటి నుండీ మా నాన్న పుస్తకపఠనాన్ని ఒక వ్యసనంలా అలవాటు చేసారు... ఆ విధంగా సాహిత్యం పై ఇష్టం పెరిగింది... పెళ్ళయి అత్తవారింటికి వచ్చాక ఒంటరితనాన్ని ఫీలయేదాన్ని....నామనసులో భావాలు బాధలు సంతోషాలు ఏవి పంచుకోవాలన్నా కలం కాగితాలే నా నేస్తాలయ్యేవి అలా సాహిత్యం వైపు అడుగేసా....!!

 

మీకు ఇష్టమైన రచనలు?మరియు కవులు రచయితలు?

శ్రీశ్రీ గారి మహాప్రస్థానం... కాళోజీ గారి నాగొడవ..!!


స్త్రీవాద కవిత్వం పై మీ అభిప్రాయం?

స్త్రీవాదమైనా ఏ వాదమైనా ఆ వర్గ అస్తిత్వాన్ని గౌరవాన్ని  నిలబెట్టటమే ఆ వాదపు ముఖ్యలక్ష్యం కావాలి..!!


స్త్రీల హక్కులపై మీ పోరాటం మున్ముందు ఎలా ఉంటుంది?

స్త్రీల హక్కుల విషయంలో పురుషులతోనో ప్రభుత్వంతోనో పోరాటం చేయటం కన్నా ముందు తమ హక్కుల పట్ల స్త్రీలకు అవగాహన కల్పించాలి...!!


పెళ్లి అయినా తర్వాత మహిళా ఇంటి పేరు మార్పు పై మీ పోరాటం గురించి?

నా అభిప్రాయంలో ఇంటి పేరు మార్చుకోవడమంటే తన అస్తిత్వాన్ని పోగొట్టుకోవడమే.... ఎందుకంటే పెళ్ళి అనేది అమ్మాయికెంత అవసరమో అబ్బాయికీ అంతే అవసరం.. మరి అబ్బాయిని ఇంటిపేర్చుకోమని ఆమ్మాయికోరితే ఎంతమంది అబ్బాియిలు ఒప్పుకుంటారు..!!


నేటి మహిళా మగవాడికి బానిస అని మీరు భావిస్తున్నారా?

పితారక్షతి కౌమారే భర్తా రక్షతి యౌవనేసుతా రక్షతి వార్ధక్యే నస్త్రీ స్వాతంత్ర్యమర్హతి అంటూ పురాణకాలం నుండే స్త్రీని చెప్పుచేతల్లో పెట్టుకున్నారు మగవాళ్ళు.... యత్ర నార్యస్తు పూజ్యతే రమతి తత్ర దేవతాః అంటూనే విద్యకు దూరం చేసి వంటింటికే పరిమితం చేసి సర్వత్రా బంధించారు... స్త్రీ ని పురుషుడి ఆస్తిగా చూపిస్తూ భర్త మాటకు ఎదురు చెప్పకపోవటం భర్త స్త్రీలోలుడైనా వ్యసనపరుడైనా భర్తని దైవంలా పూజించటం వంటి లక్షణాలను పతివ్రతా లక్షణాలుగా చూపిస్తూ కల్పితగాథల్ని సృజన చేసి స్త్రీల ఆలోచనల్ని సైతం తమకు అనుకూలంగా ఉండేలా చేసుకున్నారు.... అయితే ఈ కాలంలో కొద్దిగా మార్పు వస్తున్నప్పటికీ ఇంకా చాలా మార్పు రావాల్సిన అవసరం ఉంది.....!!


ఒక స్త్రీ రచయిత్రిగా మహిళాలోకానికి మీరు ఇచ్చే సందేశం?

సందేశాలిచ్చేంత దాన్ని కాదుగానీ, ఒక్క మాట చెప్పగలను... సాధ్యమైనంత వరకూ ఇంకొకరి మీద ఆధారపడొద్దు... ఎట్టి పరిస్థితిలోనూ ఆత్మాభిమానాన్ని పోగొట్టుకోవద్దు...!!


తెలంగాణ ప్రభుత్వం సాహిత్యానికి పెద్ద పీట వేసింది అని మీరు భావిస్తున్నారా?
రాష్ట్ర సాహిత్య అకాడమీ ని ఏర్పాటు చేయడం, తెలుగు విశ్వవిద్యాలయం ద్వారా కవుల,రచయితల పుస్తకాల ప్రచురణలకు ఆర్థిక తోడ్పాటునివ్వడం రాష్ట్ర సాంస్కృతిక రాజధాని ఐన వరంగల్ లో కాళోజీ కళాక్షేత్రాన్ని  ఏర్పాటు చేయటం వంటి విషయాలు సాహిత్యకారులకి కవులకీ కొంత  ఆనందం కలిగించినప్పటికీ ఇంకా పూర్తిస్థాయిలో న్యాయం జరగలేదనే చెప్పాలి..!!


కలం పట్టిన ప్రతివారు కవి అయిపోతారా?

కష్టజీవికి ఇరువైపులా ఉండేవాడు కవి... సాహిత్యమంటే సమాజహితాన్ని కోరుకునేది... ఈ రెండు మాటల ప్రకారం సమాజంలోని సమస్యలను ఎత్తి చూపేవాళ్ళు, తమ రచనల ద్వారా ఆ సమస్యల పట్ల ప్రజల్లో పాఠకుల్లో అవగాహన కల్పించే వాళ్ళే నిజమైన కవులు... అలా అని భావకవులనీ,ప్రేమ కవిత్వం, అనుభూతి కవిత్వం రాసేవాళ్ళనీ చులకన చేయడం నా ఉద్దేశ్యం కాదు. అయితే కవిత్వంలోని అర్థానికీ,భావానికీ ప్రాముఖ్యతనీయకుండా కేవలం ప్రాస కోసం ప్రాకులాడే వాళ్ళని కవులని నేనంగీకరించను.....


సాహిత్య ప్రక్రియలలో మీకు ఇష్టమైన ప్రక్రియ?

సాహిత్యప్రక్రియల్లో నేనిష్టపడేది వచనకవిత్వమే.....!!


ప్రతిలిపి పై మీ అభిప్రాయం?

ప్రతిలిపి ద్వారా చాలా మంది కొత్త కవులు వెలుగులోకి వస్తున్నారు.... ఇది చాలా మంచి ప్రయత్నం....!!


అఖిలాశ పై మీ అభిప్రాయం?

సమాజం పట్ల బాధ్యతను గుర్తెరిగి సమాజక్షేమం కోసం రచనలు చేస్తున్న యువకవి అఖిలాశ.. నిజంగా సమాజానికి ఇలాంటి యువకుల అవసరం ఎంతైనా ఉంది..!!

మీ 

జాని.తక్కెడశిల (అఖిలాశ)