pratilipi-logo ప్రతిలిపి
తెలుగు
ప్రముఖ రచయిత్రి మంథా భానుమతి గారితో ముఖాముఖి
14 सितम्बर 2017

మీ పూర్తి పేరు?

మంథా భానుమతి

మీ విద్యాభ్యాసం గురించి?

Ph.D  ఆర్గానిక్ కెమిస్ట్రీ.(Osmania University),  M.S Photo Chemistry (U.S.A) Diplomo in Karnatic music, Potti Sreeramulu elugu University.


మీ కుటుంబం గురించి?

మా వారు, మంథా రామారావుగారు, AP electricity Board లో సూపరెంటెండెంట్ ఇంజనీర్ గా రిటైర్ అయ్యారు. ఇద్దరబ్బాయిలు. పెద్దబ్బాయి రమేష్ అమెరికాలో స్థిరపడ్డాడు. అతనికి ఒకబ్బాయి, అమ్మాయి. కోడలు ఆరాధన, తను కూడా ఉద్యోగం చేస్తుంది.

రెండవ అబ్బాయి రవి. విదేశాల్లో ఉద్యోగాలు చేసి, హైద్రాబాద్  వచ్చి స్థిర పడ్డాడు. కోడలు కవితతో కలిసి సేంద్రియ వ్యవసాయం, సూపర్ మార్కెట్ నడుపుతూ, finance consultant గా ఉన్నాడు. అతనికి ఇద్దరబ్బాయిలు.


సాహిత్యం వైపు మీ అడుగులు ఎలా పడ్డాయి?

చిన్నతనం నుంచీ చదవటం అలవాటు. అప్పుడప్పుడు నాలుగైదు కథలు, వ్యాసాలు అచ్చయినా, ప్రస్థానం 2005 నుంచీ మొదలయింది. మొదటి నవల గ్లేషియర్, రచన మాస పత్రికలో 23,000 రూపాయల బహుమతి గెలుచుకుని నాకు ప్రోత్సాహం అందించింది. అప్పటి నుంచీ రాస్తూనే ఉన్నాను.


ఇప్పటివరకు మీరు అచ్చు వేసిన పుస్తకాలు?

మూడు కథా సంపుటిలు, మూడు నవలలు.


కొత్తగా వస్తున్న నవల రచయితలకి మీరు ఇచ్చే సూచనలు?

బాగా చదవాలని.. చదువుతే మంచి అవగాహన వస్తుంది, ఏ విషయం మీద నైనా. సమకాలీన కథా వస్తువులు తీసుకుని సందేశాత్మకంగా రాయాలని చెప్తాను.

 

నోట్ల మార్పుతో అవినీతి మటుమాయం అయిపోయిందా?

అయినట్లు ఎక్కడా కనిపించట్లేదు. కొంత నల్లధనం వెలికి వచ్చిందేమో!


ఉపాధ్యాయ వృత్తితో సంతోషంగా ఉన్నారా లేదా ఒక రచయిత్రిగా ఆనందంగా ఉన్నారా?

ఇది మరీ బాగుంది.. మీకు ఎడం కన్ను కావాలా కుడి కన్ను కావాలా అని అడిగినట్లుంది. ఉపాధ్యాయ వృత్తి నేనెన్నుకున్న వృత్తి. రచన నేనెన్నుకున్న ప్రవృత్తి. రెండూ ఆనందం కలిగించేవే. ఒకటి అన్నం పెడితే మరొకటి ఆహ్లాదాన్నిస్తోంది.


నేటి కవులలో ఇష్టమైన వారు ఎవరు?

ముందుగా నేనే.. నవ్వద్దు.. నా కవిత్వం మీద నాకు ఇష్టం లేకపోతే రాయనే లేను కదా! నేటి యువత ఎక్కువగా భావ కవిత రాస్తున్నారు.. కథలు, నవలలు అంటే చాలా సమయం పడుతుందనో ఏమో!వారణాసి నాగలక్ష్మి, ఉమాదేవి కల్వకోట, సరోజిని బులుసు, శైలజా మిత్ర, ఇంద్రాణి.. చాలా మందే ఉన్నారు. ఇంక ఛందోబద్ధ కవిత్వం రాసే వారు.. కట్టుపల్లి ప్రసాద్, కలిదిండి రామచంద్ర రాజు వంటి వారు.. వీరు పుస్తకాలు అచ్చు వేయించారు. అచ్చులోకి తీసుకు రాకుండా చాలా మందే ఉన్నారు, అచ్చంగా తెలుగు, ఛందస్సు, ప్రజ-పద్యం వంటి సమూహాల్లో. అందరి పద్యాలూ బాగుంటున్నాయి. పోటీలలో బహుమతులు గెల్చుకుంటున్నారు. చాలా మంది ఉన్నారు.. అందరి పేర్లూ రాయటం కుదరదు కదా!


సాహిత్యం-యువత పై మీ అభిప్రాయం?

“తెలుగు సాహిత్యం”.. ఎంత మంది యువత చదువుతున్నారు? పది శాతం మాత్రమే సాహిత్యం మీద ఆసక్తి కనబరుస్తున్నారని అనుకుంటున్నాను. తెలుగు బిడ్డలే, హై స్కూల్లో తెలుగు ప్రధమ భాషగా నేర్చుకున్న వాళ్లకే (ఉదాహరణకి మా పిల్లలే..) మన సాహిత్యం మీద అభిరుచి లేదు. అందుకే ఎవరైనా నా సలహా కోసం వస్తే ఎంతో ప్రోత్సాహిస్తుంటాను. ఆ మధ్యన ఇన్ఫోసిస్ కంపనీలో తెలుగు సాహిత్యం ప్రాతిపదికగా ఒక బృందం ఏర్పడిందంటే చాలా ఆనందం కలిగింది. ఈ విధంగా అన్ని కంపనీలల్లోనూ, తెలుగు వాళ్లు కలిసినప్పుడు తెలుగులో మాట్లాడడం, వారానికి ఒక రోజయినా సాహితీ కార్యక్రమాలు, కనీసం ఒక గంట పెట్టుకుంటుంటే, తెలుగు భాష మనుగడకి అవకాశం ఉంటుంది.


కులాల సాహిత్యం మతాల సాహిత్యం నేటి కాలంలో మనుగడ సాధిస్తుందా?

ఈ కాలంలో.. కుల మత వివక్ష తగ్గడానికి బదులు పెరిగి పోతోందేమో అనిపిస్తోంది. వాదాలు, ఇజమ్ లు అధికమయ్యాయి. ఏదయినా వ్యతిరేక భావాలు వెలిబుచ్చిన సాహిత్యం నలుగురి నోళ్లలో.. మంచయినా చెడయినా నానుతోంది. ఇదివరకటి కావ్యాల్లా, గ్రంధాలలా వర్ణనలు, ప్రేమ కథలు, తేలికగా తీర్చివేయగల సమస్యలు, సమాచారానికి సంబంధించినవి రాస్తుంటే ఎవరూ పట్టించుకోవట్లేదు. క్లుప్తంగా చెప్పాలంటే కుల మతాలకి సంబంధించిన సాహిత్యమే సాగుతోందనిపిస్తుంది.


నేడు తెలుగు సాహిత్యంలో కుప్పలు తెప్పలుగా పుస్తకాలు వస్తున్నాయి కాని అన్ని నాణ్యమైన సాహిత్యం అందిస్తున్నాయా?

ఏ కాలంలోనైనా.. వచ్చిన పుస్తకాలన్నీ నాణ్యమైన సాహిత్యం అందించలేవు. నాణ్యమైనసాహిత్యం అందించిన అన్ని రచనలూ ప్రాముఖ్యతని సంతరించుకోలేవు. మునుపటి రోజుల్లో రాజుల ప్రాపులో ఉన్న కవులు, లేదా రాజుల ప్రాపుని ససేమిరా కాదని, వారి ఆగ్రహానికి గురైన కవుల కావ్యాలే వెలికి వచ్చాయి. పసలేని సాహిత్యం మనుగడ తాత్కాలికమే. ఇంతకీ నీ ప్రశ్నకి జవాబు.. అన్నీ అందించడం లేదు. అందించిన వాటిలో కూడా అధికారుల, ప్రముఖుల దృష్టిలోకి వచ్చినవే సాహిత్యానికి కొలమానం అవుతున్నాయి.


కవికి ఏమైనా ప్రామాణికాలు ఉంటాయా?

తప్పకుండా ఉంటాయి. ఒక కావ్యాన్ని మహాకావ్యంగా మలచగలవాడే కవి. ఆదికవి నన్నయగారే కావ్యానికి నిర్వచనం ఇచ్చారు.

     “ఏయది హృద్య, మపూర్వం

      బేయది, యెద్దాని వినిన యెఱుక సమగ్రం

      బైయుండు, నఘనిబర్హణ

      మేయది, యక్కథయ వినగ నిష్టము మాకున్.

హృద్యంగా అపూర్వంగా, అఘనిబర్హణం చేసేదిగా ఉంటూ, వింటే సమగ్రమైన జ్ఞానాన్నిచ్చేదే మహా కావ్యం. అటువంటి ప్రామాణికంతో రాసిన వాడే కవి.


కవి గొప్ప, రచయిత గొప్ప మీ సూటి సమాధానం?

“కవి” కవి రచన క్లుప్తంగా ఎన్నో భావాలని ఒక పద్యంలో, లేదా కవితలో వెలిబుచ్చగలగాలి. అదే రచయిత, తాను అనుకున్నది విస్తృతంగా చర్చించగలుగుతారు.


సాహితి సంస్థలు ప్రకటించే అవార్డ్స్ సరైన వారికే అందుతున్నాయా?

అందుతున్నాయన్నదే నా అభిప్రాయం. ఒకే స్థాయిలో ఒకటికి మించిన రచనలుండవచ్చు. అందులో నిర్ణేతలకు బాగా నచ్చిన వాటికే అవార్డ్స్ ఇస్తారు. అవార్డ్ వచ్చినవి అందరికీ నచ్చాలని లేదు. కానీ ఏదో ఒక ప్రామాణికం ఉండే ఉంటుంది.


ప్రభుత్వాలు సాహిత్యాన్ని ప్రోత్సహిస్తున్నయా?

లేదు. పుస్తకాలు అచ్చువేయించుకోవడానికి ఇదివరకు కొంత ఆర్ధిక సహాయం చేసే వారు. ఇప్పుడు ఆ సదుపాయం ఉందో లేదో తెలియదు. ముఖ్యంగా రాష్ట్రాలు విడిపోయాక గందరగోళం ఐపోయింది. ఎవరు ఎవరికి దరఖాస్తు పెట్టుకోవాలో తెలియడం లేదు.

అలాగే లైబ్రరీలకి కొనడం కూడా తగ్గి పోయింది. ఒక వేళ కొన్నా 50% మాత్రమే ఇచ్చి కొంటున్నారు. రచయితలు ఎక్కువ ఖరీదు పెడ్తే ఎవరూ కొనరని సరిగ్గా ఖర్చు అయినంతే పెడుతున్నారు. అంటే, ఖర్చు పెట్టిందాంట్లో సగం కూడా రావడం లేదు.. అదీ ఒక వేళ ఆర్డర్ ఇస్తే.


మీకు ఇష్టమైన పుస్తకం,వాక్యం?

నాకు బాగా ఇష్టమయిన పుస్తకం, భువనచంద్రగారు రాసిన “వాళ్లు”. అందులో కథలున్నాయి, కవితలున్నాయి, వేదాంత సారముంది. ఈ పుస్తకంలోదే ఒక వాక్యం.. “జననం.. మరణం..  రెండూ రెండు అట్టలు. ఈ అట్టల మధ్య కుట్టబడిన పుస్తకమే జీవితం. ఏ క్షణపు అనుభవం ఆ క్షణంలోనే నమోదవుతుంది. కాయితానికి ఒక పేజీ రాత్రయితే ఇంకో పేజీ పగలు. రోజుకో కాయితం నిండుతూ ఉంటుంది.”


మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు?

నేర్చుకోవలసినది చాలాఉందని. పైన నన్నయగారిచ్చిన నిర్వచనం చూశావు కదా.. ఆ విధంగా ఒక రచన చేయాలని.. చేయగలనా అని.


కాలుష్య నియంత్రణ సాధ్యమౌతుందా?

అసంభవం. ప్రకృతే ప్రత్యామ్నాయం వెతుక్కోవాలి.


ఇర్మ హరికేన్ మానవాళికి ఒక హెచ్చరిక అంటారా?

ఇటువంటి ప్రళయాలు ప్రకృతి సహజం. మానవాళి తలవంచక తప్పదు. హెచ్చరికే అయినా చెయ్యగలిగిందేం లేదు.


ప్రతిలిపి పై మీ అభిప్రాయం?

తెలుగు సాహిత్యాన్ని నిలబెట్టుకోవడానికి తన వంతు చేయూతనందిస్తోందని.. ఆ కృషి ప్రశంసనీయం.


అఖిలాశ పై మీ అభిప్రాయం?

ఉత్సాహం ఉన్న యువకుడని, ప్రోత్సాహం అందుతే అనుకున్నది సాధించగలడనీ.

మీ 

జాని.తక్కెడశిల(అఖిలాశ)