pratilipi-logo ప్రతిలిపి
తెలుగు
జి.యస్.లక్ష్మి
16 జనవరి 2018

 

జి.యస్.హాస్యకథలు / వదినగారి కథలు

రచయిత్రి;జి.యస్.లక్ష్మి

నవరసాలల్లో హాస్యరసం ప్రాధానమైనది అని నా భావన.నవ్వు నాలుగు విధాల చేటు అన్నారు .కాని అన్ని సమయాలల్లో కాదు.అసలు నవ్వని వాడు ఒక రోగి, నవ్వటం ఒక భోగం అన్నారు జంధ్యాల.చక్కగా నవ్వుతూ ఉండేవాళ్ళను చూస్తే ఎవరికైనా మాట్లాడాలనిపిస్తుంది.అదే చిటచిటగా ఉంటే దూరంగా ఉందామనిపిస్తుంది.మనసు బాగాలేనప్పుడు, ఏదైనా చికాకు కలిగినప్పుడు మనసు మళ్ళించుకునేందుకు ఓ హాస్య నవలో, కథో చదవాలనిపిస్తుంది.ఆ కథ చదవగానే పెదవులపై ఓ చిరునవ్వు రావాలి.అందులోని హాస్య సంఘటనలు పదే పదే గుర్తొచ్చి పడీ పడీ నవ్వాలి. "పాపం బిక్కమొహం వేసాడు."అని చదవగానే ఆ బిక్క మొహం కళ్ళ ముందు మెదలాడాలి.ఏదైనా సంఘటన హాస్యంగా ఉండవచ్చు.దానిని హాస్యంగా వ్రాయటం ఒక కళ. పత్రికలల్లో హాస్యకథ అని రాసినా ఆ కథ చదవగానే నవ్వు కాదు కదా పెదాలు కూడా విచ్చుకోవటం లేదు! కాని అదేమిటో తెలుగు లో  అలాంటి హాస్య రచయతలు ఎక్కువగా లేరు.ఉన్న కొద్ది హాస్య రచయతలల్లో కి ఈ మధ్య తన హాస్య కథలతో దూసుకు వచ్చేస్తున్నారు జి.యస్.లక్ష్మి గారు. ఆరోగ్యం కోసం హాస్యం అంటూ ,"జి.యస్.హాస్యకథలు / వదినగారి కథలు " పుస్తకాన్ని, మనసారా నవ్వుకోండి అని పాఠకులకు అందించారు.

జి.యస్ హాస్యకథలల్లో మొత్తం పదమూడు కథలు ఉన్నాయి.మొదటి కథ "అమ్మగారికి దండం పెట్టు " తో నవ్వటం మొదలుపెడితే ఇక ఆప కుండా నవ్వుకుంటూ పోవటమే మన పని.అయ్యో కథ లన్నీ అప్పుడే ఐపోయాయా అనుకోకుండా , వెనక్కి తిప్పుతే గడుసు వదినగారు, అమాయకపు మరదలు కథలు కనిపించి అమ్మయ్య ఇంకాసేపు నవ్వుకోవచ్చు అనుకుంటాము.ఆ కథల గురించి నేను చెప్పట మెందుకు మీరే చదివి నవ్వుకోండి. పుస్తకము కొని చదువుకునే ముందు కొంచము రచయిత్రి తో  మాటా మంతీ.

1. మీకు రచనలు చేయాలనే కోరిక ఎప్పుడు కలిగింది?

జ) 1992 నుంచీ అప్పుడప్పుడు ఆకాశవాణిలో ప్రసంగవ్యాసాలు, నాటికలు, పాటలు ప్రసారమయ్యేవి. నా మొట్టమొదటికథ ఆ రోజుల్లోనే ఆంధ్రప్రభ వారపత్రికలో పడినా నేను రచనావ్యాసంగాన్ని సీరియస్ గా తీసుకున్నది 2002 నుంచే.

2. మీ హస్య కథల గురించి మాట్లాడుకునే ముందు, మీ నవల "ఒక ఇల్లాలి కథ " గురించి చిన్న అనుమానము. మీ "ఒక ఇల్లాలి కథ" లో నాయిక స్వరాజ్యమును ముందు నుంచీ సాత్వికురాలిగా, తల్లికీ, భర్తకూ విధేయిరాలుగా, అణుకువగా చూపించి, చివరలో తిరుగుబాటు చేయిస్తారు. నిజ జీవితం లో అలా మారటం సాధ్యమంటారా?

జ) ఇల్లాలికథలో నాయిక స్వరాజ్యం మనస్తత్వం మొదటినుంచీ తన గురించి కన్న యితరుల గురించే యెక్కువ ఆలోచించే మనస్తత్వం. అందుకే పెద్దవాళ్ళ నిస్సహాయతను గుర్తించి రమణమూర్తి పెట్టిన షరతులకు లోబడి పెళ్ళి చేసుకుంది. పెళ్ళయాక ఆ యింటికే అంకితమయిపోయి, పుట్టింటినుంచి తను తెచ్చుకున్న బంగారంకూడా ఆడపడుచుని గొప్ప యింటిలో యివ్వడానికి తనంతటతనే యిచ్చేసింది. ఆఖరున కూడా తన తల్లీ, మేనత్తలకోసమే రమణమూర్తి దగ్గరకి వెడదామనుకుంది. కానీ, ఎప్పుడయితే మేనకోడలు స్రవంతి, ‘నువ్వు అలా వెడితే నిన్నే మాకు ఆదర్శంగాచూపిస్తారు’ అని చెప్పిందో అప్పుడుకూడా అదే మనస్తత్వంతో తనకోసం కాకుండా తన తరవాతి తరంవారికోసం తిరుగుబాటుకు నాంది పలికింది.

3. మీవి కొన్ని బ్లాగ్ పోస్ట్ లూ, ఒక కథ "అమ్మ మారిపోయిందమ్మా"మీ పేరు లేకుండా ఎవరో షేర్ చేసారు కదా!దానికి మీ స్పందన ఏమిటి?

జ) నా పేరు లేకుండా షేర్ అయినందుకు బాధగా అనిపించింది.

4. మీ కథ"అమ్మ మారిపోయిందమ్మా" కథ, దానితో పాటు మీరు పాపులర్ అయిపోయారు దానికి మీ స్పందన ఏమిటి?

జ) సంతోషంగా అనిపించింది.

5. మీకు రచనలు కాకుండా ఇంకా ఏకళల్లోనైనా ప్రవేశం ఉందా?

జ) ప్రవేశం మాత్రమే వుంది.

6. రచయిత్రి రచన చేసేటప్పుడు దేనిని గుర్తు పెట్టుకోవాలి?

జ) తన చుట్టూ వున్న సమాజాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఆ రచయిత చేసే రచన వల్ల సమాజంలో ఒక నేరస్తుడు మంచివాడుగా మారాలి కానీ, ఒక మంచివాడు నేరస్తుడుగా మారకూడదు.

7. రచనల్లో స్త్రీపాత్రలను యెలా చిత్రీకరించాలి?

జ) స్త్రీలు కూడా మనుషులే. వారికి కూడా వ్యక్తిత్వం వుంటుంది. అటువంటి వ్యక్తిత్వం గలవారిగా చిత్రించాలని నా అభిప్రాయం.

8. ఇక హాస్య కథలు గురించి హాస్యకథలు రాయడానికీ, సీరియస్ కథలు రాయడానికీ మధ్యగల తేడా యేమిటో చెప్పండి.

జ) చాలా తేడా ఉందండీ. సీరియస్ కథలనబడే కరుణ రసాత్మక కథలూ, అణచివేత కథలూ, ఆకలి కథలూ, సమస్యలకు పరిష్కారాన్ని చూపించే కథలూ వంటివి రాస్తున్నప్పుడు ఆ రసం పండడానికి ఆ సన్నివేశాన్ని ఎంత ఎక్కువగా వర్ణించితే పాఠకులు అంత ఎక్కువగా ఆస్వాదిస్తారు.

 కానీ, హాస్యకథలు రాసేటప్పుడు ఆ సన్నివేశాన్ని పండించడానికి అలా ఎక్కువగా రాస్తే ఆ హాస్యం పాఠకుడికి వెగటు పుట్టిస్తుంది. తక్కువగా రాస్తే ఆ హాస్యం పండదు. అందుకే హాస్యరసాన్ని చాలా బాలన్సెడ్ గా రాయాలి.

9. బాలన్సెడ్ గా అంటే? ఏమైనా జాగ్రత్తల్లాంటివి తీసుకోవాలా?

జ) అవునండీ. హాస్యం రాసేటప్పుడు అది ఎదుటి మనిషిలోని అవకరాన్నిగానీ, లోపాన్నిగానీ యెత్తి చూపించి పాఠకులని నవ్వించే ప్రయత్నం చెయ్యకూడదు. ఒక మనిషి అరటితొక్కమీద కాలేసి జారిపడినట్టు లాంటివి రాస్తే, అది ఎదుటి మనిషి పడే బాధని మనం హాస్యంగా తీసుకున్నట్టవుతుంది.  అది పాఠకుడిలో ఉండకూడని గుణాన్ని మనం పైకి తీసుకొచ్చినట్టవుతుంది. అందుకే హాస్యరచయిత(త్రి) మరింత జాగ్రత్తగా రచనలు చెయ్యాలి.

10. “వదినగారి కథలు” లో వదినగారి గురించి అలా రాసినందుకు మీ వదినగారు ఏమీ అనుకోలేదా?

జ) హ హ.. చాలామంది అలాగే అడుగుతుంటారండీ. కానీ, నా వదినగారికథల్లో వదిన నేను సృష్టించిన పాత్ర. మా వదినలెవ్వరూ అలా లేరు. కొంతమంది మనుషులు వాళ్ళు చేసిన పని తప్పయినా సరే, తప్పని వాళ్లకి తెలిసినా సరే అస్సలు ఆ తప్పు ఒప్పుకోరు. పైగా వాళ్ళ మాటల చాతుర్యంతో ఆ తప్పుని ఒప్పుగా ఎంచక్కా దిద్దేస్తారు. దానికి చాలా తెలివితేటలూ, సమయస్ఫూర్తీ, వాక్చాతుర్యం లాంటివి కావాలి. అలాంటి పాత్ర సృష్టే ఈ వదిన. అందుకె ఈ వదినంటే నాకెంతో ఆరాధన.

11. మీరు ఇంకా ఏమైనా చెప్పదలచుకుంటే చెప్పండి.

జ. తప్పక చెపుతానండీ. ఇలా నా అభిప్రాయాలను పంచుకోవడానికి దోహదపడిన మీకూ, పత్రికా సంపాదకులకూ నా ధన్యవాదాలు.

లక్ష్మిగారు మీ అభిప్రాయాలను మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలండి.

ప్రఖ్యాత రచయిత్రి మన్నెం శారదగారు చిత్రించిన ముఖ చిత్రము తో ఉన్న ,జి.యస్.హాస్య కథలు / వదినగారి కథలు అన్ని పుస్తక షాపులల్లోనూ దొరుకుతుంది. వందరూపాయిలకు కొనుక్కొని కడుపుబ్బ నవ్వుకోండి.

మీ 

మాల కుమార్