pratilipi-logo ప్రతిలిపి
తెలుగు
అలేఖ్య గారితో ముఖాముఖి
26 మే 2021

సాధారణ గృహిణిగా తమ పనులను ముగించుకొని విశ్రాంతి తీసుకొనే సమయం లో తమ మనసులోని భావాలను కలం నుండి జాలువారుస్తూ...ఎన్నో అధ్బుతమైన రచనలను మనకు అందించిన అలేఖ్య గారి గురించి తెలుసుకుందాం.

  • నమస్కారమండి. ముందుగా మీ గురించి చెప్పగలరా అంటే మీ బాల్యం,చదువు, ఉద్యోగం వగైరా.

నమస్తే అండి...నా పేరు అలేఖ్య.నేను ఒక సాధారణ గృహిణిని...నేను యంసీఏ చదువుకున్నాను...మా నాన్నగారు వ్యాపారం చేస్తారు...అమ్మ కూడా గృహిణి...నాకు ఒక అన్నయ్య ఉన్నారు ...ఆయన మా నాన్నగారితో బిజినెస్ చూసుకుంటారు...ఇక నా బాల్యం అంతా పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరంలో జరిగింది...మొత్తం నా చదువు పూర్తిగా భీమవరంలోనే జరిగింది...నిజానికి నా బాల్యం అంతా ఏ బాధలు లేకుండానే సాగింది...ఎంతసేపు ఆడుకోవడం...అమ్మ పెట్టిన బువ్వ తినడం...చదువుకోవడం ఇవే నాకు తెలిసినవి...మా నాన్నగారు నాకు చదువులో బాగా ప్రోత్సహించారు...ఆడపిల్లకు చదువు ఎందుకు దండగ అనుకోకుండా చదువుకుంటేనే మంచి చెడు ఏమిటో తెలుస్తుంది అని నన్ను అన్ని విధాలా ప్రోత్సహించారు...ఆ విషయంలో ఆయన నాకు తండ్రి అనుకోవడం కన్నా దేవుడు అనుకోవడం కరెక్ట్ ఏమో...ఇక అమ్మ సరే సరి...బాగా చదువుకో...ప్రతి చిన్నదానికి ఇది ఏంటి అని వేరే వాళ్ళని అడిగేలా కాదు వాళ్ళు అడిగితే చెప్పేలా ఉండాలి అని చెప్పేది...ఇక మా అన్న ఏమి చెప్పాలి నా డామినేషన్ ఎక్కువ...పాపం చాలా నెమ్మదస్తుడు...సున్నితమైన మనసు కలవాడు...అందుకే నా ఆటలు సాగాయి...అలా అలా గడిచిపోయింది...2011 లో పెళ్లి అయ్యింది..మా వారు ఒక ప్రైవేట్ స్కూల్ లో గణిత ఉపాధ్యాయులు....మాకు ఒక పాప...మా అత్తగారు ఇదే మా చిన్న కుటుంబం...

  • మీ సాహిత్య ప్రస్థానం ఎలా మొదలైంది?

a.ఇక్కడే మన ప్రతిలిపి లోనే సరదాగా స్టార్ట్ చేసా...ముందుగా నేను నా ఇంటర్మీడియట్ చదువుకునే రోజుల్లో సరదాగా రాసుకున్న ప్రేమ కవితలను ఇక్కడ పోస్ట్ చేసా...దాదాపు నెల తిరిగేసరికి అనుకుంట కనీసం యాభై నుంచి వంద మంది అనుచరులు వచ్చారు...ఆ తరువాత ఇక్కడ అందరూ రాస్తుంటే వాళ్ళని చూసి సరదాగా నాకు రాయలనిపించి స్టార్ట్ చేసాను ...అంతే...అది ఇక్కడికి తీసుకువచ్చింది నన్ను...చాలా సంతోషంగా ఉంది...

  • కవిత్వం పై మీ అభిప్రాయం ?

a.నిజానికి కథలు,నవలలు కన్నా తక్కువ పదాలతో భావవ్యక్తీకరణ చేసే కవితలు అంటే నాకు చాలా ఇష్టం...మనసులో ఉన్న మాటలు చెప్పడానికి అద్భుతమైన మార్గం కేవలం కవిత అన్నది నా అభిప్రాయం...

  • ఇంతవరకు ఎన్ని పుస్తకాలు ముద్రణ రూపంలో వచ్చాయి ?

లేదు అండి..నేను పుస్తకాలు ఏమి ముద్రణ చేయలేదు..ఇంకా నాది నేర్చుకునే స్థాయినే...ఇంకా చాలా నేర్చుకోవాలి...అప్పటికి కానీ పుస్తకాల ముద్రణ జోలికి వెళ్లను...

  • “నిన్నుకలిసాక”  ధారావాహిక రాసినప్పుడు మీరు పొందిన అనుభూతి ఏమిటి?

 ఇది అని చెప్పలేను...ఎందుకంటే యీ కథలోని సంజనా పాత్ర యొక్క భావాలను భావోద్వేగాలను నేను మనసుతో అనుభవించి మీకు రాసి ఇచ్చాను...అందుకే నిన్ను కలిసాక ధారావాహిక చదివిన ప్రతిఒక్కరు ఆ కథలోని పాత్రల యొక్క భావోద్వేగాలను కూడా అనుభవిస్తారు...ఇంతకు మించి నాకు ఏమి కావాలి...పాఠకులు మనసు కదిలించగలిగితేనే కదా ఒక రచయితగా నేను విజయం పొందినట్లు.

  • మీరు ఎక్కువ ప్రేమ కథలు రాస్తున్నారు. దాని వెనుక గల కారణం?

ప్రేమ కథలు రాయడానికి ఒకటే ముఖ్య కారణం...మన రోజు వారీ జీవితంలో ఉరుకులు,పరుగులు పెడుతూ ప్రేమ అనే సున్నితమైన భావాన్ని కూడా మన మనుషులు ఆస్వాదించడం మర్చిపోతున్నారు...మర్చిపోయి నిస్తేజంగా జీవితాన్ని గడిపేస్తున్నారు...అందరూ అలానే ఉన్నారా అని కాదు కొందరైనా అలా ఉంటారు అని...అందుకే నేను రాసే కథల్లో పాత్రల మధ్య మన నిజ జీవిత పరిస్థితులను తీసుకువచ్చి కథని నడిపిస్తూ ఉంటాను...దాని వల్ల కొందరు అయినా వాళ్ళ ఆలోచనల తీరు మార్చుకుంటారు ఏమో అని అంతే...అంటే కథలు చదివి మారిపోతారా అని అడిగితే నాది ఒకటే సమాధానము మన డైలీ లైఫ్ లో ఎక్కడో ఒకచోట ముఖ పరిచయం ఉన్నా లేకున్నా కొంతమంది లేదా కొన్ని సంఘటనలు మనల్ని ప్రేరేపిస్తాయి...కాబట్టి కొంత అయినా మనం రాసేవాటి వల్ల వాళ్ళ లైఫ్ లో చిన్న మార్పుతో ఆనందంగా ఉంటే అదే చాలు...నిజానికి కొంతమంది పాఠకులు మీ వల్ల మేము కొన్ని అభిప్రాయాలు మార్చుకుంటున్నాము అని మెసేజ్ చేసారు...ఇంతకుమించి ఇంకేమి కావాలి...

  • మీ అభిమాన రచయత ఎవరు?

 నా ఆల్ టైం ఫేవరెట్ సూర్యదేవర రాం మోహన రావు గారు...గురువుగారు అనుకుంటాను నేను...ఆయన రాసిన విదుర్ నీతి స్వాతి మ్యాగజైన్ లో చదివిన దగ్గర నుంచే కథలు చదవడం వరకే ఉన్న నాకు ఇంత పెద్ద ధారావాహికలు ఉంటాయి అని తెలిసింది...అప్పటినుంచి మిగిలిన వాటిని వెనక్కి నెట్టి ఫుల్ టైం పాఠకురాలిగా మారిపోయాను...ఇంకా బి.గీతిక గారు,ముసునూరి సుబ్బయ్య చౌదరిగారు,గొర్లి శ్రీనివాసరావు గారు ఇంకా చాలా లిస్ట్ ఉంది...ఒక్కరు అని చెప్పడం కష్టం...అందరూ వారి శైలిని బట్టి ఒక్కో ఆణిముత్యాన్ని పాఠకులకు ఇచ్చారు...అందుకు మేము వీరందరికి సర్వదా కృతజ్ఞులం...

  • ఒక సరదా ప్రశ్న , రచయిత గొప్ప వాడా ? పాఠకుడు గొప్పవాడా ? అంటే మీ జవాబు ఏమిటి ?

హ హ భలే చిక్కు ప్రశ్న వేసారే...నిజానికి ఇద్దరు గొప్ప వాళ్లే ఎందుకంటే రచయిత అన్నవాళ్ళు పాఠకులు ముందు ఊహలోకాన్ని సృష్టించి అందులో ఉండే పాత్రలకు జీవం పోస్తే...దాన్ని తమ మనో నేత్రంతో చూస్తూ ఆస్వాదిస్తూ మన రచనలకు పట్టం కడతారు పాఠకులు...కాబట్టి యీ సాహితీ సున్నితపు త్రాసులో ఇద్దరూ సమమే సుమా...

  • ఒక మంచి రచయిత గా  ఈ బహుమతి వచ్చినందుకు మీరు ఎలా ఫీలవుతున్నారు?

నిజానికి నేను గెలుస్తాను అని అనుకోలేదు...ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఫస్ట్ రావడం అనేది నా కల అయితే అది కల లాగానే మిగిలిపోయింది...అలా అని ఏనాడు బాధపడలేదు...మన కష్టానికి తగిన ఫలితం దొరికింది అంతే అని సరిపెట్టుకునేదాన్ని...కానీ ప్రేమతో లో మొదటిసారిగా నేను మొదటి విజేత అని తెల్సినపుడు మొదట నమ్మడానికి నాకు చాలా సమయం పట్టింది...తరువాత విజయాన్ని ఆస్వాదించి...సంతోషంగా ఉన్నాను...కానీ యీ గెలుపు నేను జీవితంలో మరచిపోలేనిది...

  • మీరు ఏదైనా చెప్పదలచుకున్నది,మేము మిమ్మల్ని అడగనిది?

నాకు రచయితగా ఇక్కడ పేరు తెచ్చుకునేల ఒక మంచి ప్లాటుఫామ్ ఇచ్చినందుకు మీకు వేల వేల కృతజ్ఞతలు...మన ప్రతిలిపి ఎప్పుడు ఇలానే ఉండాలి అని కోరుకుంటున్న...ఎంతోమంది కొత్త రచయితలను ఇక్కడినుంచే పరిచయం చేయాలి ప్రపంచానికి అని ఆశిస్తున్నా...ఇంకా మన ప్రతిలిపి  రీడింగ్ ఆప్స్ లో నెంబర్ వన్ గా ఉండాలి అని అనుకుంటున్నా...

  • మీకు రచనలు చేయాలనే కోరిక ఎప్పుడు కలిగింది?

ఒక పాఠకురాలిగా దాదాపు సంవత్సరం ప్రతిలిపి లో కొనసాగుతున్నప్పుడు అందరూ హీరో నే ఆకాశానికి ఎత్తేస్తూ ...హీరోయిన్ ని ఆపదలో ఉంటే కాపాడటం రాస్తుంటే...హీరోయిన్ అలా ఎందుకు చేయకూడదు అనిపించి నేను నా తొలి ప్రేమ ధారావాహిక " ప్రేమతో నీ నేను " స్టార్ట్ చేసి ఈరోజు ఇక్కడ స్థిరపడ్డాను...

  • మీకు రచనలు కాకుండా ఇంకా ఏకళల్లోనైనా ప్రవేశం ఉందా?

 లేదు అండి...నాకు తెలిసినవి రెండే చదవడం...రాయడం అంతే...

  • రచయిత్రి రచన చేసేటప్పుడు దేనిని గుర్తు పెట్టుకోవాలి?

 సాధారణంగా రచనలు చేసేటప్పుడు నాణేనికి రెండు వైపులా ఉన్నట్లు కథలోని పాత్రల భావాలను భావోద్వేగాలను వాటి చుట్టూ తిరుగాడే సామాజిక సాధ్యాసాధ్య పరిస్థితులను బేరీజు వేసుకుని ఒక వైపే సమర్ధించినట్లు కాకుండా ఇరు వైపులా ఉన్న భావాలను వ్యక్తం చేస్తూ రచనలకి సరైన న్యాయం చేయాలి ...అప్పుడే పాఠకుడి భావాలను మనం తెలుసుకోగలం...లేకుంటే యుద్ధాలే వాళ్లతో...

  • మీకు ఎలాంటి పుస్తకాలంటే ఇష్టం?

నాకు ఎక్కువ ఫిక్షన్ ఇష్టం...అందులోనూ నిజ జీవితానికి దగ్గరగా ఉంటూ పాత్రల్లో భావాలను పలికించేవి ఇంకా ఇష్టం...

  • మీ రచనల గురించి ఏమైనా చెప్పదలచుకున్నారా?

నేను రాసే ఏదో ఒక రచన నన్ను పాఠకుల హృదయాల్లో గుర్తుంచుకునేలాగ చేస్తే చాలు అంతకు మించి నాకు ఇంకేమి అక్కర్లేదు...ముఖ్యంగా నాకు యాభై ఏళ్ళు వచ్చాకా నేను వెనక్కి తిరిగి హృదయపూర్వకంగా చేసిన పని ఏది అని చూసుకుంటే... నా రచనలు ఉన్నాయి...ఇవి చాలు నాకు...ఇంకేమి అక్కర్లేదు అని అనిపించాలి...ఎందుకంటే నేను అల్పసంతోషిని. యీ చిన్న చిన్న ఆనందాలు నాకు చాలు...ధన్యవాదాలు...

ఓపిక గా నా ప్రశ్నలకు సమాధానాలు నందుకు ధన్యవాదాలండి. ముందు ముందు మీరు రచనలు కూడా చేసి మరింత గుర్తింపును తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను.

 

****