pratilipi-logo ప్రతిలిపి
తెలుగు
జొన్నలగడ్డ ఇందిరతో ముఖాముఖి
17 జులై 2018

“రచయిత్రులం ఉత్సాహం ఉరకలు వేసినపుడు గుట్టల కొద్దీ కథలు రాస్తాం ! అదే సమయాన మన పుస్తకాలు కొనుక్కుని చదివే పాఠకులు పట్టుమని పదిమందైనా కన్పించనపుడు నిరుత్సాహపడతాం ! మన రచనలను మనం కన్న బిడ్డల్లా చూసుకుంటాం ! వాటిని ఎవరైనా తమ చేతుల్లోకి తీసుకుని - ఆయా పేజీలను మురిపెంగా తిరగేస్తుంటే ఎంతో మురిసిపోతుంటాం !

అయితే మన రచనలని తమ అక్కున చేర్చుకుని , వాటికి ఏ చెద సోకకుండా అల్మారాల్లో భద్రపరచడమే కాదు, వాటిని ఎంతో ఇష్టంగా కొని -తన సన్నిహితులకు గిఫ్ట్స్ గా ఇస్తూ - వాటి గొప్పదనాన్ని ఫేస్బుక్ లో పదిమందికీ చెప్పే వ్యక్తులు కన్పించినపుడు అబ్బురపడతాం! మన రచనలకి మనం కన్న తల్లులమైతే - అలాంటి పాఠకులు పెంపుడు తల్లులు ! ఆయా రచనల్లోని గొప్పదనాన్ని తమ చక్కటి విశ్లేషణతో పఠితల ముందుంచే పాఠకులలో . . 'ఆమె' ముందువరసలో వుంటారు. అలాంటి పాఠకులు దొరకడం నిజానికి ఆయా రచయితలు చేసుకున్న అదృష్టం!

అయితే ఆమె ప్రత్యేకత కేవలం రచనలకి మాత్రమే పరిమితం కాదు ! సంగీతం, సినిమా, నాటకం, అది ఏదైనా - అందులో ఏ చిన్న స్పార్క్ కన్పించినా - దానిపై తన దృష్టి పడకుండా వుండదు, దాన్ని ఆమె మెచ్చుకోకుండా వుండరు! పఠనాభిలాషని పెంపొందించే ఆమె అభిరుచి అచ్చెరువు కలిగిస్తుంది ! ఆమె పోస్ట్స్ లో ఒక పరిణతి , ఒక పరిపక్వత కనిపిస్తుంది ! అఫ్కోర్స్ ఆమె తలచుకుంటే - చక్కటి రచయిత్రి కాగలదు ! ( కథలూ రాస్తారేమో నాకు తెలీదు. . ) , సాధన చేస్తే చక్కటి గాయని కాగలదు ! (ఆమె పాటలు పాడ్తారని మాత్రం తెలుసు ! )

అయినా ఆమె తనకున్న ప్రత్యేకతలన్నీ పక్కనబెట్టి , ఆయా కళాకారుల్లోని 'కళ' కే - బ్రహ్మరథం పడతారు అదే ఆమెలో నాకు నచ్చిన అంశం !”

అని, ప్రముఖ విద్యావేత్త, ప్రముఖ రచయిత్రి, అపురూప అవార్డ్ తో రచయతలను ప్రోత్సహించే శ్రీమతి అమృతలత గారిచే ప్రశంసించబడి, "అమృతల అపురూప అవార్డ్స్"ఫంక్షన్ లో రచయితలతో పాటు ప్రత్యేక బహుమతి అందుకున్న శ్రీమతి. ఇందిర జొన్నలగడ్డ గారి తో ఈ నెల పరిచయము. రచయతలల్లోని ప్రతిభనే కాదు, పాఠకులలోని ప్రతిభనూ గుర్తించిన అమృతలతగారికి ధన్యవాదములు.

 

  • నమస్కారండి ఇందిరగారు. మీరు అమృతలత- అపురూప అవార్డ్స్ ఫంక్షన్ లో ప్రత్యేక బహుమతి అందుకున్నందుకు అభిననందనలండి. ఆసంధర్భం గా మిమ్మలిని ఇంటర్వ్యూ చేద్దామని వచ్చాను. మీకు సంగీతం, సాహిత్యం లో ప్రవేశం ఎలా కలిగింది?

నమస్కారం మాలగారు! ధన్యవాదాలండీ!

జ;సంగీత సాహిత్యాలలో ప్రవేశం అంటే. . పెద్దగాఎమీ లేదండీ! కానీ మొదటినుంచీ ఆసక్తి మాత్రంచాలా వుంది. ఎవరికైనా చిన్నప్పటి చుట్టూవున్న వాతావరణ ప్రభావం చాలా ప్రభావంచూపిస్తుంది. మా ఇంట్లో అందరికీ సంగీతంలో కాస్త ప్రవేశం వుండి చాలా బాగా పాడేవారు. మా పెద్దపెదనాన్న వీణ, సితార్ వాయించేవారు! వారమ్మాయిలు ప్రఖ్యాత విద్వాంసులు ములుకుట్ల సదాశివ శాస్త్రిగారి శిష్యులు. వేసవి సెలవుల్లో అందరం కలిసినప్పుడు అమ్మా, దొడ్డమ్మలూ, అక్కయ్యలూ అందరూ కలిసి పాడుతుంటే చిన్న కచ్చేరీ లాగా ఎంతోబాగుండేది. నిజంగా వారు పాడుతున్నప్పుడు విని వినీ సంగీతం పట్ల ఆసక్తి పెరిగింది. నాయనమ్మ కూడా కార్తీకపురాణం సంస్కృత శ్లోకాలు రాగయుక్తంగా పాడుతూ వుండేది. ఇలా విని నేర్చుకున్న సంగీతమేనాది! ముఖ్యంగా రేడియోలో వచ్చే లలిత సంగీతం! ఆవిడ దగ్గరనుంచీ ఇంట్లో అందరికీ పుస్తకం రోజుకి కనీసం పదిపేజీలైనా చదివే అలవాటు ఉండేది. న్యూస్ పేపర్లు తప్పనిసరిగాచదవడంఅలవాటు. ఉమ్మడికుటుంబమైన మా ఇంట్లోఆంగ్లం, తెలుగు, సంస్కృతాల పుస్తకాలతోచాలా మంచి లైబ్రరీ వుండేది. వీటి మూలకంగా ఒక డీఫాల్ట్ లక్షణంగా ఆసక్తి వచ్చేసింది. సంగీతంపద్ధతిగా నేర్చుకున్నది పెద్దగా లేదుకానీ విని నేర్చుకున్నదే ఎక్కువ. ఎన్నోపుస్తకాలు ఇంట్లోఅందుబాటులో వుండటంవల్ల బాగా చదువుతూ వుండేవారం. ఇప్పటికీ రాత్రి పడుకోబోయేముందుకొన్ని పేజీలైనా చదవకుండా వుండను. ఏదైనా గొప్ప పుస్తకం చదివిన తర్వాతగానీ, దృష్టినాకర్షించిన కొన్ని సంఘటనల గురించీ, ఆ ప్రభావం పోక దాని గురించి రాయాలని బాగాఅనిపించేది. హైస్కూల్ రోజులనుంచీ దాదాపు పాతికేళ్ళు డైరీ రాశాను. ఇప్పుడు ఫేస్ బుక్ లోరాస్తున్నాను.

  • మీకు ఎలాంటి పుస్తకాలంటే ఇష్టం?

;అన్నీ చదువుతూనే వుంటాను కానీ నాకు ప్రధానంగా యాత్రా సాహిత్యం, జీవిత చరిత్రలూచాలా ఆసక్తి! పుస్తకాల షాపు కి వెళ్ళినప్పుడు నా దృష్టి ప్రధానంగా వీటిమీదే! తెలుగులోఇపుడిపుడే కాస్త యాత్రాకధనాలు వస్తున్నాయి. వాటిని చదువుతున్నప్పుడు అవి ఒక గైడ్ లాగామనం వెళ్ళినప్పుడు వెతుక్కోకుండా సహాయం చేస్తాయి. వెళ్ళలేని ప్రదేశాల విశేషాలుతెలుస్తాయి. పరవస్తు లోకేశ్వర్ గారి గారి "సిల్క్ రూట్ లో సాహస యాత్ర " చదివిఅబ్బురపడిపోయాను! వివిధ రంగాలలో గొప్ప పేరుతెచ్చుకున్న మహానుభావులందరూ అతిసామాన్యంగా జీవితం మొదలు పెట్టినవారే! అందరిలాగే వారికీ వొడిదుడుకులూ, కష్టాలూ, అసంతృప్తులూ. . . వున్నా వాటన్నిటీ అధిగమించి ఎలా వారి జీవితాన్ని మలుచుకున్నారన్నదిచాలా ఆసక్తికరంగా, ఆశ్చర్యంగా అనిపిస్తుంది నాకు!

  • మీ అభిమాన రచయత ఎవరు?

;అభిమాన రచయిత అంటే చెప్పలేను గానీ రచనలు చాలా వున్నాయి. ఒకరచయిత రాసిన అన్నిరచనలూ మనం బాగావున్నాయనుకోలేం!

  • మీకు నచ్చిన ఒక పుస్తకం గురించి చెప్పగలరాఏదైనా ఒక కథ చదివినప్పుడు ఇది ఇలా కాకుండా మరో రకంగా రాస్తే బాగుండేది అని ఎప్పుడైనా అనిపించిందా?

;క్లిష్టమైన ప్రశ్న!"నచ్చిన " అనగానే మనసులో చాలా పుస్తకాలు వరస కట్టేశాయి! నెనెప్పూడైనాఇష్టంగా చదువుకోకలిగినవి రెండు. "విశాల నేత్రాలు", "వసంతగానం". పిలకా గణపతిశాస్త్రిగారి కల్పన, భాష నాకు చాలా ఇష్టం.చదువుతూ ఉండగానే కళ్ళముందు అక్షరాలు మాయమై,నిచుళాపురం, హేమాంబ నేత్రద్వయం, కావేరీ నది, రంగనాధుడూ.కనబడుతూఊహాలోకంలోకి వెళ్ళిపోతుంటాను. వసంతగానం లాంటి ఆహ్లాదకరమైన పుస్తకం నాకు మరోటిదొరకలేదు. కొన్ని కధలు గొప్ప ఎత్తుగడతో మొదలయ్యి ఎంతో పేలవంగా ముగిసినట్టు నాకుచాలాసార్లు అనిపిస్తూ వుంటుంది. అదే పట్టు చివరివరకూ కొనసాగదు. కొంచెం మారిస్తే ఎంతోబాగుండేదని అనిపిస్తుంటుంది!. అలాంటివి ఉదహరించలేను గానీ నా పాఠకానుభవంతోఅలా అనుకుంటాను.

  • మీరు ఇన్ని పుస్తకాలు చదివారు కదా మీకు సాహిత్యం లో ఎలాంటి మార్పులు కనిపించాయి? కొత్త రచయతలు ఏమని సలహాలు ఇస్తారు?

;ఒకప్పుడు రచయితగా గుర్తింపబడాలంటే కేవలం పత్రికలే ఆధారం. ఇపుడు ఎన్నోమాధ్యమాలున్నాయి! ముందు తరంవారి రచనల్లో ముఖ్యంగా కుటుంబ సమస్యలూ, ప్రేమా, కొంతవరకూ సమకాలీన సమస్యలూ వుండేవి. కానీ ఇప్పుడు ఎంతోమందియువరచయితలు చక్కటి వైవిధ్యంతో ఎంతోబాగా రాస్తున్నారు. బ్లాగుల్లో, ఫేస్ బుక్కు లో,జాల పత్రికల్లో వీరి రచనలూ, వారెంచుకునే విషయాలు నన్నెంతో ఆశ్చర్యానికీ,ఆనందానికీగురి చేశాయి. మంచి భాష, జీవితపు విలువలూ, సంస్కృతీ, సాంప్రదాయాల పట్ల, సంగీతసాహిత్యాల పట్ల గొప్ప అవగాహనా.. కలిగిన వీరి రచనలు ఒక్కోసారి ఏ ప్రసిద్ధ రచయితలకీతీసిపోవు. జాల పరిధి కొంత చిన్నదవటం, వారు పరిమిత పాఠకులకె పరిమితమవడం వల్లరావలసిన గుర్తింపు రావడంలేదనుకుంటాను నేను. కొత్తగా రచనలు చెయ్యాలనుకునేవారికిఎవరైనా చెప్పేదొకటే, రాసింది ఒకటికి రెండుసార్లు చదువుకున్న తరువాత కూడా వారికినచ్చి, లోపాలు లేవనుకుంటేనే ప్రచురణకి ఇవ్వడం, ముందుతరం వారివీ సమకాలీనులవీరచనలు విస్తృతంగా చదవడం!

  • మీరు ఎవరికైనా ఒక పుస్తకం గిఫ్ట్ గా ఇవ్వాలంటే ఎలాంటి పుస్తకం ఇస్తారు ?

పుస్తకం బహుమతిగా ఇవ్వడమంటే. . మొదట్లో నాకు అప్పుడు బాగా నచ్చిన పుస్తకాన్ని ఇవ్వాలనుకోవడం జరిగేది. కానీ "మిథునం " అలా ఇచ్చినప్పుడు ఆ విషాదాంతం కొంతమందికి బహుమతిగా నచ్చలేదు. అప్పటినుంచీ మొదట అవతలవారి అభిరుచి, అసలు పుస్తకాల పట్ల ఆసక్తి ఉందాలేదా అని గమనించుకుని ఇస్తున్నాను. ఈ మధ్యకాలంలో ఎవరికైనా బహుమతిగా ఇవ్వదగ్గ చక్కటి పుస్తకం వాడ్రేవు వీరలక్ష్మీ దేవి గారి " భారతీయ నవలా దర్శనం".

  • సాహిత్యానికీ, సంగీతానికి ఉన్న వ్యత్యాసం ఏమిటి ?

;గొప్ప మానసికానందాన్నిచ్చే సందర్భంలో ఈ రెంటికీ తేడా లేదు. చక్కటి భావగర్భితమైన సాహిత్యం సంగీతాన్ని మరింత రసరంజకం చేస్తుంది. అలాగే కర్ణపేయంగా వున్న సంగీతం మరోసారి మరోసారి వినాలనిపించి అందులో సాహిత్యం వైపు ఆకర్షిస్తుంది. భేదమేమంటే సంగీతాన్ని పాడాలనుకుంటే నిరంతర సాధన లేకపోతే కొంతకాలంతరువాత గొంతు సహకరించక కేవలం విని ఆనందించగలం! కానీ సాహిత్యం ఎన్నాళ్ళయినా చచదువుకోగలం!

  • ఒక మంచి పాఠకురాలుగా ఈ బహుమతి వచ్చినందుకు మీరు ఎలా ఫీలవుతున్నారు?

;సహజంగానే మొదట ఆశ్చర్యం, తరువాత ఆనందం కలిగాయి! అవార్డు కంటేకూడా అమృత లత గారు నా పోస్ట్ లన్నీ చదువుతున్నారన్నది నాకు గొప్ప ఆనందాన్నిచ్చింది. నిరంతరం ఎన్నో రకాల వ్యాపకాలతో క్షణం తీరిక లేకుండా వుండే ఆమె దృష్టిని ఆకర్షించడం నాకొక గొప్ప గౌరవం! పిల్లలు చదువులయ్యి దూరంగా వెళ్ళాక కాలక్షేపంగా వుంటుందని ఫేస్ బుక్ లో ఎకౌంట్ ఓపెన్ చేశారు. మొదట్లో కాస్త బెరుగ్గానే వున్నా తరువాత నాకెంతో బాగుంది. నా వేవ్ లెంగ్త్ కి తగిన మంచి మిత్రులూ, గొప్ప పుస్తకాలూ, చిన్నప్పుడెప్పుడో విని మర్చిపోయిన అద్భుతమైన పాటలూ. . . . . ఎన్నో దొరికాయి. రాయడం మర్చిపోయిన నాకు తిరిగి రాయాలన్న కుతూహలం కలిగింది. అమృత లత గారివంటి విశిష్ట వ్యక్తుల దృష్టిని ఆకర్షించి నాకొక చిన్న గుర్తింపు తెచ్చిపెట్టింది!

  • ఒక సరదా ప్రశ్న , రచయిత గొప్ప వాడా ? పాఠకుడు గొప్పవాడా ? అంటే మీ జవాబు ఏమిటి ?

;విత్తు, చెట్టు సామెత గుర్తొస్తోంది! పరస్పర సమాన సంబంధం ఇద్దరిదీ! ఒకరు లేకుండా రెండోవారికి రాణింపు లేదేమో!

  • సాహిత్యం లో ఇంత పరిచయం ఉన్న మీరు రచనలు ఎందుకు చేయరు?

జ;రచనలు అంటే. . ఫేస్ బుక్ లో తరచుగా నాకు తోచింది రాస్తూనే వున్నాను. చుట్టుపక్కల నన్నాకర్షించిన వాటిగురించో, నచ్చిన పుస్తకం గురించో నాకనిపించినదంతా రాయాలనిపిస్తుంది. కానీ ఆయా సంఘటనలను కధలుగా మలిచే నైపుణ్యం నాకులేదనుకుంటాను!

ఓపిక గా నా ప్రశ్నలకు సమాధానాలు నందుకు ధన్యవాదాలండి. ముందు ముందు మీరు రచనలు కూడా చేసి మరింత గుర్తింపును తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను.

ఒక రచన గుర్ప్తింపు పొందాలంటే ఒక మంచి పాఠకుడు అవసరము. అలాగే ఒక మంచి రచన చదవాలంటే ఒక రచయిత అవసరము. పాఠకుని ది, రచయితది విడదీయలేని అవినాభావ సంబంధము. అందుకే, ఎప్పుడూ రచ్యతలను పరిచయము చేసే నేను, మంచిపాఠకురాలుగా అమృతలత గారి చే గుర్తింపబడిన ఇందిర జొన్నలగడ్డగారిని పరిచయము చేయటము సముచితముగా భావిస్తున్నాను.