pratilipi-logo ప్రతిలిపి
తెలుగు
డా||మంథా భానుమతి
16 జనవరి 2018

గ్లేషియర్

రచన; డా ; మంథా భానుమతి

భానక్కా అని అందరు ఆప్యాయంగా పిలుచుకునే మంథా భానుమతి గారు, రసాయన శాస్త్రం లో డాక్టరేట్ తీసుకొని లెక్చరర్ గా పని చేసారు.  చాలా సంవత్సరాల క్రితమే కథలు రాసినా 2004  లో మొదటిసారిగా “ గ్లేషియర్ “ నవల వ్రాసారు. ఈ నవల కు 2006 లో రచన మాసపత్రిక నిర్వహించిన నర్సిపురం ఆదిలక్ష్మి విశ్లేషణాత్మక నవల ల పోటీలో  బహుమతి వచ్చింది.

 గ్లేషియర్  ఒక మధ్యతరగతి  గృహిణి కథ. రిటైరై భాద్యతలు తీరిన దంపతులు శాంత , కృష్ణ లు . చిన్నప్పుడు పంకజం టీచర్ , సముద్రం గురించి, తెల్లని మంచుకొండ గ్లేషియర్ గురించి చెప్పినప్పుడే అవి చూడాలనే కోరిక బలంగా ఏర్పడింది శాంత కు. పెళ్ళైన ముప్పై ఏళ్ల కు రిటైర్ అయ్యాక తీరిక గా , మంచు కొండలు దగ్గర నుంచి చూడాలని చన్ఢీ ఘర్, కులు మనాలి , సిమ్లా చుసివస్తారు. అమ్మ కోరిక తెలిసిన పిల్లలు క్రూజ్ లో అలాస్కా వెళ్ళే ఏర్పాటు చేస్తారు. ఆ క్రూజ్ లో జరిగిన విశేసాలే ఈ గ్లేషియర్ నవల. రచయిత్రి శాంత  తో పాటు మనలనీ ప్రయాణం చేయిస్తారు. క్రూజ్ లో కలిసే రకరకాల ప్రయాణికుల తో పరిచయం చేయిస్తారు.చివరి నిమిషం లో కెనడా వీసా కోసం టెన్షన్ ! శాంత స్విమింగ్ పూల్ లో పడి ఉక్కిరిబిక్కిరి ఐనప్పుడు భయం! ఉర్సులా పెళ్లి కోసం పడే ఆరాటం ! ఎప్పుడూ నవ్వుతూ చెంగ చెంగుమని తిరిగే టెర్రీ కి ప్రాబ్లంస్ ! అన్ని రసాలూ కలబోసిన నవల గ్లేషియర్ .  చదవటము పూర్తి చేసేసరికి మనకూ క్రూజ్ లో  అలాస్కా వెళ్ళాలి అనిపించెంత గా నవలలో లినమైపోతాము .

భానుమతి గారు మొత్తం పన్నెండు నవలలు, నలభై పైగా కథలు వ్రాసారు. నేత పని గురించి రాసినా, ధూమపానం గురించి  నవల రాసినా, అంతెందుకు ఎ నవల  రాసినా , దాని గురించి క్షుణం గా పరిశోదించి రాస్తారు. అలా అని తను పరిశోదించినదంతా  పాఠకులకు  చెప్పేయాలని ఆత్రుత పడరు . ఎంతవరకు అవసరమో అంతే కథలో మలిచేస్తారు. అందుకని బోర్ అనిపించదు. పాత్ర చిత్రికరణ అత్యంత సహజం గా ఉంటుంది.

ఇక గ్లేషియర్ గురించి , రచయిత్రి   అనుభవాల గురించీ   రచయిత్రి చెప్పేది విందాము .

నమస్కారమండి

నేను మీరు రాసిన కథలు, నవలలు చాలా వరకు చదివాను.నా అభిమాన రచయతలల్లో మీరు ఒకరు.నేను ప్రతినెలా విహంగ అంతర్జాల పత్రికలో ఒక పుస్తక సమీక్ష వ్రాస్తాను.ఈ మధ్య ఆ సమీక్షతో పాటు ఆ  రచయతను కూడా పరిచయము చేస్తున్నాను.ఈ నెల మీ నవల "గ్లేషియర్" పరిచయము చేస్తున్నాను.ఆ సంధర్భముగా మీకు అభ్యంతరము లేకపోతే ఓ చిన్న ఇంటర్వ్యూ ఇవ్వగలరా ప్లీజ్.

1.గ్లేషియర్ నవల ఒకరకముగా ట్రావెలాగ్ అనుకోవచ్చుకదూ.అందులోని వన్నీ మీ అనుభవాలేనా?. గ్లేషియర్ మీ మొదటి నవల కదా! మొదటి నవలైనా చాలా బాగా రాసారు ఆ నవల గురించి మీ అనుభవం మాతో పంచుకోగలరా?

చాలా నవలలు తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో చదివాను కానీ, రాయడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు. 2004 సం|| లో అలాస్కా క్రూజ్ తీసుకుని వెళ్లాము. అప్పుడు, కుతూహలం కొద్దీ, అందులో పనిచేసేవారితో, సహ ప్రయాణీకులతో పరిచయం పెంచుకుని, కొంత సమాచారం సేకరించాను. యాత్ర అయి ఇంటికి వచ్చాక, రచన మాస పత్రికలో విశ్లేషణాత్మక పోటీల గురించి ప్రకటన చూసి, చాలా సమయం(దాదాపు తొమ్మిది నెలలు) ఉందికదా.. ఎందుకు ప్రయత్నించకూడదూ అనిపించింది. చేతిలో సమాచారం ఉంది. కొందరి మైల్ ఐడిలున్నాయి. ఇంకేం.. అని మరింత సమాచారం సేకరించడానికి మొదలు పెట్టాను. ట్రావెలాగ్ లా ఉందంటారేమోనని అనుమానం కూడా వచ్చింది. జూల్స్ వెర్న్ నవలలు అలాగే ఉంటాయి కదాని రాయడం మొదలు పెట్టా. అందులో పాత్రలన్నింటి వెనుకా ఒక కథ.. క్రూజ్ నడిపే వారి సమస్యలు, కష్టాలు, లాభాలు, ఆనందాలు.. అన్నీ సమాకలనం చేసి రాసేశాను. చిత్తు ప్రతీ.. దాన్ని మళ్లీ ఫైర్ చెయ్యడం.. అదేం లేదు.. రాసుకుంటూ పోవడమే. కులూ, మనాలీ వెళ్లినప్పటి అనుభవాలు.. గ్లేషియర్ ఏర్పడడం, మనుషుల స్వభావాలని, పరిస్థితులని గ్లేషియర్ తో పోల్చడం.. ఈ రకంగా , ఒక ప్రణాలిక ప్రకారం రాయాలనుకున్నాను

అనుకున్నట్లుగానే నవల రాయడం అయింది. దాదాపు 8 నెలలు పట్టింది. అయాక రచన ఆఫీస్ కి వెళ్లి శాయిగారికి స్వయంగా అందజేశాను. ప్రైజ్ వస్తుందని అనుకోలేదు.. కానీ ప్రైజ్ రావాలనే కదా రాసింది! అందుకే, శాయిగారు ఒక రోజు రాత్రి ఫోన్ చేసి బహుమతి వచ్చిందని చెప్పగానే.. కాసేపు నోట మాట రాలేదు. శాయిగారికి ధన్యవాదాలు చెప్పాలని కూడా తోచలేదు.. తరువాత చెప్పాననుకోండి.

అంతకు ముందు పది సంవత్సరాల క్రితం ఐదారు కథలు ఆంధ్రప్రభ వార పత్రికలో రాసినా, నవలకి సాహసించడం అదే!

నవల రాయడం వేరు, కథలు రాయడం వేరు అని అప్పుడే తెలుసుకున్నాను. నవలలో ఏదైనా విస్తృతంగా రాయగలగాలి. అంత వివరణ ఇచ్చేటప్పుడు, పాఠకులకి విసుగు కలగ కూడదు. ఇదంతా గ్లేషియర్ రాసేప్పుడు తెలీ లేదనుకోండి.. తరువాత ఆ అనుభవం బాగా ఉపయోగ పడింది.

2.మీరు చారిత్రిక నవలలు కూడా రాసారు కదా అవి పాఠకులు ఎలా రిసీవ్ చేసుకున్నారు?

నేను రాసిన రెండు నవలలూ, తెలుగువన్.కామ్ లో వచ్చాయి. ఒక నవల, ఎర్రాప్రగడ ముఖ్య పాత్రగా, ఆ కాలంలోని రాజకీయ పరిస్థితులు విశ్లేషిస్తూ రాశాను. ఇంకొకటి, కళింగ గజపతుల కాలంలోని చరిత్ర, ఒక కల్పిత పాత్ర ద్వారా చెప్పడానికి ప్రయత్నించాను. ఇవి రెండూ వెబ్ పత్రికలో వచ్చాయి కనుక, నెట్ వాడ గలిగిన పాఠకులే చదివారు. ఒక ఫంక్షన్ కి వెళ్లినప్పుడు, ఒకావిడ నాదగ్గరగా వచ్చి, “అజ్ఞాత కులశీలస్య.. రాసింది మీరే కదా? నేను ప్రతీవారం దాని కోసం ఎదురు చూస్తానండీ” అన్నప్పుడు, చాలాసంతోషం కలిగింది. నవలలు వస్తున్నప్పుడు, స్పందన బాగా వచ్చింది. ఈ మధ్యన ప్రముఖ రచయిత్రి మైథిలీ అబ్బరాజుగారు, “మీరు చారిత్రిక నవలల మీదే దృష్టి సారించండి అన్నప్పుడు కూడా ఆనందం కలిగింది.

3. ఈ మధ్య పధ్యాలు కూడా రాస్తున్నారు.అలవోకగా శతకాలు కూడా రాసేస్తున్నారు.అవి రాయటములో మీ అనుభవము ఏమిటి? ఈ ప్రక్రియలన్నిటిలోనూ మీకు ఏది ఇష్టం? పద్యమా?నవలా?కథా?

అచ్చంగా తెలుగు బృందంలో చేరాక, కట్టుపల్లి ప్రసాద్ గారి పాఠాల వలన పద్య రచన మీద ఆసక్తి కలిగింది. రాస్తూ ఉంటే, అదొక ప్రత్యేక అనుభవంలాగ, తెలుగు భాషమీద మరింత పట్టుసాధించగలం అని  అనిపించింది. దానికి తోడు, అప్పుడప్పుడు వచ్చే బహుమతులు మరింత ప్రోత్సాహాన్ని కలిగించాయి.

ఛందో బద్ధమైన కవిత్వానికి చాలా పరిధిలుంటాయి.. అవన్నీ అధిగమిస్తూ కవితలు రాస్తుంటే.. ఒక్కో పద్యమూ అయ్యాక, ఏదో శిఖరం ఎక్కినంత ఆనందం కలుగుతుంది.

పద్య, నవల, కథా రచనల్లో దేనికి దానికే ప్రత్యేకత ఉంటుంది... దేని అందం దానిదే. నేను మూడూ ఆనందిస్తూ రాస్తాను.

4.మీరు నవల రాసే ముందు దాని గురించి చాలా పరిశోధన చేస్తారు,ఉదాహరణకి అగ్గిపెట్టెలో ఆరుగజాలు రాసినప్పుడు నేత పని వాళ్ళతో కలిసి దాదాపు ఆరునెలలు ఉన్నారని విన్నాను.అలాంటప్పుడు మీకే ఆటంకమూ రాలేదా?

పరిశోధన చేసే రాస్తాను..(అందరు నవలా రచయితలూ అంతే..) ఏదో ఒక టెక్నికల్ సబ్జక్ట్ తీసుకుని దాని చుట్టూ కథ నడిపిస్తాను కనుక తప్పదు. చాలా నవలలకి, లైబ్రరీ, గూగుల్ సరిపోతుంది. కొన్నింటికి ఫీల్డ్ వర్క్ కావాలి.

ముఖ్యంగా అగ్గిపెట్టెలో ఆరుగజాలు, మొదటి అడుగు (ఈ రెండూ ఆంధ్రభూమి వార పత్రికలో వచ్చిన ధారా వాహికలు) రాయడానికి తిరగ వలసి వచ్చింది. అక్కడ వాళ్లతో మాట్లాడ్డానికి అప్పుడప్పుడు వెళ్లాను, కానీ ఆరు నెలలు అక్కడే ఉండి పోలేదు. బెనారస్, నుంచీ సేలం వరకూ, దారిలో ఊళ్లు చూసుకుంటూ, మగ్గాల దగ్గరకి వెళ్లి తంతీలతో మాట్లాడే దాన్ని. అలాగే పొగాకు తోటలు, ఫాక్టరీల దగ్గరికీ, ఆక్షన్ ప్లాట్ ఫామ్ల వద్దకీ  వెళ్లాను. అన్ని చోట్లకీ రావుగారు వచ్చి మంచి సహకారం అందజేస్తారు. వాళ్లు వాడే పడికట్టు పదాలు నవలలో వాడగలిగాను అందుకనే.

అలాగే కృత్రిమంగా పళ్లు, కూరగాయలు పండించే విధానానికి వ్యతిరేకంగా “మాయపండు”, రసాయనిక ఎరువులు, పురుగుల మందుల వాడకాలకి వ్యతిరేకంగా  “జనని”, విద్యుత్ ఉత్పాదన మీద “మేఘంలేని మెరుపు”, టెర్రరిజంకి వ్యతిరేకంగా “అరుణోదయం”, మత్స్యకారుల జీవన విధానం మీద “ప్రేముడి”.. మొదలైన నవలలు రాశాను. ఇవే కాక మిగిలిన నవలలన్నింటికీ, ఇంచుమించుగా పరిశోధన చాలా చెయ్యవలసి వచ్చింది.

 

5. మీరు లెక్చరర్ గా పని చేసారు కదా , ఆ అనుభవము మీకు రచనలల్లో ఏమైనా ఉపయోగ పడిందా ?

ఎవరికైనా, ఏ రంగంలోని విజ్ఞానమైనా రచనలు చేసేటప్పుడు తప్పకుండా ఉపయోగపడుతుంది.

6.పాఠకులు సామాన్యం గా ఎలాంటి రచనలు ఇష్టపడతారు , కామెడీ నా, సీరియసా, ప్రేమ కథలా , హిస్టారికల్ నా ఎలాంటివని మీ అభిప్రాయం?

కామెడీ.. అందుకే పొత్తూరి విజయలక్ష్మిగారు చాలా పేరు పొందారు. అలాగే సోమరాజు సుశీలగారు. అందరూ అటువంటి కథలు రాయలేరు. ఎవరి శైలి వారిది.

7.ఈ మధ్య కామెడీ కథల కు కూడా పోటీ పెడుతున్నారు.నిజంగా ఆ కథలు నవ్వొస్తున్నాయా ?

కొన్ని..

8.పోటీల మాట వచ్చింది కాబట్టి, మీరూ యఫ్.బీ లో సరదాగా చిన్న చిన్న పోటీలు పెట్టారు.కొన్ని పోటీలకు జడ్జ్ గా కూడా వెళ్ళారు అని విన్నాను.పోటీల గురించి కొన్ని అనుమానాలు అడగొచ్చా ? నేను ఏ పోటీకీ నా కథలను పంపలేదు కాబట్టి నేను బహుమతి రాక అడుగుతున్నాను అనుకోకండి ప్లీజ్.పోటీలు ప్రకటించేముందు కొన్ని రూల్స్ చెపుతారు.బహుమతి ఇచ్చే ముందు అవి నిజంగా పాటిస్తున్నారా? కొన్ని వర్గాల కథలకు బహుమతులు ఇస్తారు.కొన్ని వర్గాల గురించి రాస్తే కాంట్రవర్షియల్ అవుతుంది అని ఇవ్వరు.కనీసం సాధారణప్రచురణకు కూడా తీసుకోరు.కొన్ని పత్రికలు పది బహుమతులు ప్రకటిస్తే అందులో దాదాపు ఎనిమిదిమంది విజేతల పేర్లు ఎప్పుడూ అవే ఉంటాయి.ఏదో ఒకటోరెండో కొత్తవాళ్ళ పేర్లు ఉంటాయి.కొన్ని సార్లు పోటీకి రానివి కూడా వాళ్ళకు నచ్చితే బహుమతి ఇచ్చేస్తారు.మరి అలాంటప్పుడు పోటీ పెట్టి రచయతలను బాధపెట్టటము కదా? అసలు నిజంగా పోటీ అవసరమా? వీటి మీద మీ అభిప్రాయం ఏమిటి?

పోటీల వల్ల నా మటుకు నాకు ఒక పెద్ద ఉపయోగం కనిపిస్తుంది.. ఒక నిర్ణీత సమయంలో మన రచన తీసుకుంటున్నారా లేదా అనేది తెలిసి పోతుంది. ఆ తరువాత ఒప్పుకోకపోతే, ఇంకొక పత్రికకి పంపవచ్చు.

ఇంక వారు చెప్పిన పరిధులకి, నియమాలకీ విలువ కొన్ని పత్రికల వారు ఇస్తారు. వారి పత్రికలు వారి ఇష్టం కదా!

ఇంక.. కథల ఎన్నిక.. నాకు తెలిసి, (నేను నిర్వహించిన పోటీలతో సహా..) న్యాయ నిర్ణేతలకి, రచయితల పేర్లు పంపరు. పరీక్ష పేపర్ల లాగ, కోడ్ వేసి పంపుతారు. ఆతరువాత, పత్రికల వాళ్లకి స్లేచ్ఛ ఉంటుంది.. అది వేరే సంగతి.

నవలలకి నాకు వచ్చిన బహుమతులన్నీ దాదాపు, నేనెవరో తెలియక మునుపే. పేరు ఆ బహుమతుల వల్లే వచ్చిందనేది నిర్వివాదాంశం.

మరి కొందరికే ఎప్పుడూ ఎందుకు వస్తుందనేది.. చెప్పలేం. న్యాయనిర్ణేతలకి వారి రచనలే నచ్చుతున్నాయా? లేక నిర్వాహకులకి నచ్చుతున్నాయా అనేది మనకి తెలియని అంశం. నేను నిర్వహించిన పోటీల్లో, న్యాయ నిర్ణేతలకే విలువ ఇచ్చాను. వారికి కథలెవరు రాశారనేది తెలియదు. అలాగే నేను నిర్ణేతగా ఉన్నవి కూడా!

ఏదేమైనా, నామటుకు నేను పోటీలకి వీలయినంత వరకూ రాస్తూనే ఉంటాను. తిరిగొచ్చినా సరే. అలాగే ఫలితాలని కూడా గౌరవిస్తాను.

9.ఈ మధ్య  తరుచుగా రచనలల్లో సామాజికసృహ ఉండాలి అని వింటున్నాను.అసలు సామాజికసృహ అంటే ఏమిటి?

ఇదివరకు ‘కులం’ అనే వారు.. ఇప్పుడు సామాజిక వర్గం అంటున్నారు. సామాజిక స్పృహ అంటే, కుల నిర్మూలన ప్రోత్సహించి, అందరికీ సమాన అవకాశాలు కల్పించే విధంగా సమాజాన్ని నడిపించడం అని నేను అనుకుంటున్నాను. ఇటువంటి అసమానతలు కథా వస్తువులుగా చాలా రచనలు వచ్చాయి. కొంతమంది రచయితలు దళితవాదులు, స్త్రీ వాదులు మొదలైన బృందాల కింద, సామాజిక స్పృహ కలిగించే రచనలు చేస్తున్నామంటారు. మరి కొందరు అటువంటి పేరు లేకుండానే రాస్తుంటారు. ఏదేమైనా రచయితలందరూ సమాజాన్ని సరైన మార్గంలో నడిపించే విధంగా కృషిచెయ్యాలి. అదే సామాజిక ప్పృహ.

10.ఈ మధ్య అంతర్జాలపత్రికలు ఎక్కువగా వస్తున్నాయికదా, వాటి గురించి మీ అభిప్రాయం ఏమిటి?

అచ్చు పత్రికలు చాలా తగ్గిపోయాయి. ఉన్న నాలుగైదు పత్రికల్లోను ఏ రచనైనా అచ్చవాలంటే అదొక హిమాలయ శిఖరం ఎక్కడంలా అవుతోంది. ఈ నేపధ్యంలో అంతర్జాల పత్రికలు చాలా ఆవిర్భవించాయి. ఈ పత్రికల వలన చాలా మందికి తమ భావాలు వ్యక్తీకరించడానికి వీలు కలుగుతోంది. ఈ పత్రికలలో వచ్చే రచనలని తక్కువగా అంచనా వెయ్యద్దు. ఎక్కువ మందికి తమ రచనలు వెలుగులోకి రావడానికి అవకాశం లభిస్తోంది. చాలా మంచి పరిణామం. కాగిత రహిత విప్లవంలా.. వాతావరణానికి కూడా మంచిదే. చెట్లు కొట్టనక్కర్లేదు. ఈ పత్రికలు కూడా అందరికీ అందుబాటులో ఉండే ధర నిర్ణయించి, రచయితలకీ, ఆ పత్రికలు వెలువడడానికి కృషిచేసే వాళ్లకీ ప్రతిఫలాన్నివ్వగలుగుతే బాగుంటుందని, మరింత ప్రోత్సాహం లభిస్తుందనీ నా అభిప్రాయం. ఇది పూర్తిగా నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

11.చాలామంది కొత్తరచయతలు వస్తున్నారు.వారి రచనల గురించి మీ అభిప్రాయం ఏమిటి?ఒక సీనియర్ రచయిత్రిగా మీరు వారికి ఏ సలహా ఇస్తారు?

ఆరంభంలో అందరం కొత్త రచయితలమే కదా. అందరి గురించీ ఒక్క మాటలో చెప్పమంటే కష్టమే. కొంతమంది, చాలా బాగా రాస్తున్నారు. వారు వారి గోడల మీద పెట్టిన రచనలక్కూడా అనూహ్యమైన స్పందన లభిస్తోంది.

అందరూ కూడా కృషి చేసి రాస్తున్నారు.. రాయడంలో! కొత్త రచయితలందరికీ నా సలహా.. బాగా చదవండి. ఎంత ఎక్కువ చదువుతే అంత బాగా రాయగలుగుతారు. పేరు పొందిన రచయితల రచనలు ఎందుకు బాగున్నాయో చూడండి. పాత రచనలు మాకర్ధం కావడం లేదనుకోవద్దు.. అర్ధంచేసుకోవడానికి కృషి చేయండి. ఇతిహాసాల దగ్గర్నుంచీ, ఆధునిక సాహిత్యంవరకూ. ఒక పుస్తకం చదివాకే ఒక రచన రాయాలనే నియమం పెట్టుకోండి. మీకే తెలుస్తుంది తేడా. ఇప్పటికీ నాకు అదే అనుభవం..

ఆధునిక జీవన విధానంలోని కష్టసుఖాలు వివరించేట్లు కథలు రాయండి. మీకు గుర్తున్నంత వరకూ 20 వ శతాబ్దంలోని జీవన విధానం నుంచి ఏ విధంగా మార్పు చెందిందో తెలపండి.

నలభై యాభై ఏళ్ల క్రితం అన్నీ యువతీ యువకుల జీవితాల మీద రచనలు వస్తే ఇప్పుడు ఎక్కువగా వృద్ధుల మీద, వృద్ధాప్యం మీద వస్తున్నాయి. ఎందుకు? యువత తెలుగు సాహిత్యం మీద మక్కువ చూపించడం లేదు. మీరు ఎదుర్కుంటున్న పరిస్థితుల గురించి రాయండి. మీ మనో భావాలు వ్యక్త పరచండి. మీ చుట్టూ ఉన్న యువతీ యువకులకి తెలుగు భాష మీద అభిరుచి పెంచండి.

12.ఇక చివరాఖరు ప్రశ్న.ఇది పూర్తిగా వ్యక్తిగతమైనది.నాకు తెలుసుకోవాలని చాలా ఉత్సుకత ఉన్నది.మిమ్మలిని నేను దాదాపు 30 సంవత్సరాల క్రితము మొదటిసారిగా చూసాను.ఆ రోజు ఎంత ఉత్సాహంగా ఉన్నారో, ఈ రోజూ అంతే ఉత్సాహం గా ఉల్లాసంగా ఉన్నారు.మీ పర్సనాలిటీలో కూడా తేడా లేదు.అలా ఎలా మానేజ్ చేస్తున్నారు? ప్లీజ్ ప్లీజ్ ఆ రహస్యం చెప్పరా?

మరీ.. ఇంతలా మొహమాట పెట్టేస్తే ఎలా మాలా? సరే.. ఇది పది మందికీ ఉపయోగ పడుతుందనుకుంటే చెప్తాను..

కొంత జనటిక్ ప్రభావం ఉన్నా.. చాలా వరకూ మన చేతిలోనే ఉంటుంది, మన ఆరోగ్యం కాపాడు కోవడం. ఆరోగ్యం బాగుంటే సహజంగా ఆకృతిలో కూడా దాని ప్రభావం ఉంటుంది. మనం మొదటి సారి కలిసింది 1985-86 ప్రాంతాలలో.. సరిగ్గా అప్పుడే నాకు చిన్న చిన్న వ్యాయామాల మీద నడక మీద అవగహన వచ్చింది. అంటే నలభై ఏళ్ల వయసులో. రోజూ కనీసం ఒక అరగంట గడిపే దాన్ని. ఆ తరువాత, 90 నుంచీ.. ఒక గంట నడక.. 93 నుంచీ అనుకుంటా, ఒక గంట యోగా చెయ్యడం ఆరంభించాను. అవి ఈ రోజు వరకూ కూడా కొనసాగిస్తున్నా. సమయం తగ్గిందనుకో.. వయసు పెరిగిన కొద్దీ ఎక్కువ చెయ్యలేక పోతున్నాను.

సరే.. ఇంక ఆహారం కూడా అప్పుడప్పుడు ఐస్క్రీమ్ లు, స్వీట్లు తిన్నా.. రోజు వారీ జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. నేను వారానికి ఒకటి రెండు సార్లు తప్ప వరి అన్నం తినను. ఇది వరకు పుల్కాలు తినేదాన్ని. ఈ మధ్యన నాలుగైదేళ్ల నుంచీ కొర్రలు, కినువా కలిపి వండి అదే అన్నం కింద తింటున్నాను. మన వంటికి ఏది పడుతుందో మనకి తెలుస్తుంది కదా! అవే తగు పాళ్లలో తింటాను. చిన్నప్పటి నుంచీ కూరలు తినడం చాలా ఇష్టం. బాగా తినేదాన్ని. పెద్దయ్యాక, సాలడ్ లు. రోజూ ఏదో ఒక పండు.

ఇంక.. అన్నింటి కంటే ముఖ్యం.. ఎప్పుడూ ఏదో ఒక వ్యాపకం కల్పించుకుని మనస్సుని, శరీరాన్ని తీరిక లేకుండా ఉంచుకోవడం, సంతోషంగా ఉండటానికి ప్రయత్నించడం.. స్నేహితులతో కాలం గడపడం, ఏదైనా తేలిగ్గా తీసుకోవడానికి ప్రయత్నించడం.. ఈ విధంగా సాగుతోంది. ప్రయత్నించడం అని ఎందుకంటున్నానంటే.. అప్పుడప్పుడు కష్టం, దుఃఖం, మనసు బాధ పడ్డం ఉంటుంది. మనం నియంత్రించలేం.(తప్పదు, మహా మునులక్కూడా).. కానీ, అది తాత్కాలికం, మళ్లీ మామూలు గా అవుతుంది అనుకుంటూ గడుపుతాను.

ఇదీ సంగతి.

మంథా భానుమతి.

ఇదంతా చదివాక గ్లేషియర్ నవల వెంటనే చదవాలి అనిపించటం సహజం .ఇంకెందుకు ఆలశ్యం కోనేయండి.ఇది అన్ని పుస్తకాల షాప్ లలొనూ దొరుకుతుంది. వేల 100rs మాత్రమే. చదివాక రచయిత్రి తో మాట్లాదాలనిపిస్తే , 040 23414363 కి ఫోన్ చేయండి.

                                                                                                                                                                                                                                                                                                                                                 మీ 

మాల కుమార్