ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాపకురాలిగా పదవీ విరమణ చేసిన శీలా సుభద్రాదేవి గారు మంచి రచయిత్రి ,కవియిత్రి.ఉపాద్యాపకురాలిగా పనిచేసినందువలననేమో సమస్యలను పలుకోణం లలో సునిశిసతం గా పరిశీలించి కథలుగా, కవితలుగా మలిచారు."ఒక చిన్న స్పందన,చిన్న సూది మొనంత గాయం,ఒకింత గుండె తడి ఏదైతేనేం కదలిక ఉంటే మనసులోనూ , మస్తిష్కం లోనూ ఒక ఆలోచన మొలకెత్తేలా చేయగలుగుతుంది.ఆవిధంగా కైతలెక్కువగా రాయగలిగాను." అంటున్న శీలా సుభద్రాదేవిగారి గురించి, వారి సాహితీ ప్రష్ఠానం గురించి వారి మాటలల్లోనే తెలుసుకుందాము.
1.నమస్కారమండి. ముందుగా మీ గురించి చెప్పగలరా అంటే మీ బాల్యం,చదువు, ఉద్యోగం వగైరా.
1) నాది అందమైన బాల్యం కాదండీ.చిన్నతనం లోని మధుర జ్ఞాపకాలేవీ నాకులేవు.నాకు ఊహ తెలిసే సరికే మా నాన్న గారు జబ్బుతో ఉన్నారు.అమ్మ వంటి మీద నగలు తో సహా కరిగి పోయాయి,నా పదో ఏట ఆయన చనిపోయారు.నలుగురు పిల్లలతో అమ్మ తీవ్ర ఆర్ధిక సంక్షోభం తో బతుకు పోరాటం మొదలు పెట్టింది.నా చదువు కూడా ఆగిపోయింది. అప్పటికి చదువు కుంటున్న పెద్ద అన్నయ్య కి టీచర్ ఉద్యోగంవచ్చాక తిరిగి చేరాను. ఎనిమిదవ తరగతి అయ్యాక మళ్ళా కుటుంబ పరిస్తితుల వలన మరోసారి నా చదువు ఆగిపోయింది,నేను మా పెద్ద అక్కయ్య ఇంటికి చేరాను.
అక్కయ్య అప్పటికే కథ విరివిగా రాస్తుండేది.వాళ్ళింట్లో మంచి గ్రంధాలయం ఉండేది.పాఠశాల చదువు లేదనే బాథ మనసును గుచ్చుతోన్నా పుస్తకాలె నా నేస్తాలూ,గురువులూ అయ్యయి.
అనంతరం ఒక ఏడాది తర్వాత తిరిగి విజయనగరం కి వెళ్ళి బళ్ళొ చేరాను.విజయనగరం మహిళా కళాశాల లో బియస్సీ వరకూ చదువు కొనసాగింది.
ఆ రోజుల్లోనే మేనత్తకొడుకు కవి ,రచయిత,చిత్రకారుడూ ఐన శీలావీర్రాజు తొ దేవి పేరు తో సాహిత్య పరం ఐన ఆసక్తితో కలం స్నేహం కొన్నాళ్ళు నడిచింది.తర్వాత మా ఇష్తప్రకారం,పెద్దల అంగీకారం తో బహుభాషాకోవిదుడు రోణాంకి అప్పలస్వామి గారి అధ్వర్యం లో సభావివాహం జరిగింది.
బియస్సీ పూర్తి చేసుకున్నాక హైదరాబాద్ లొ అడుగుపెట్టాను.చిన్నప్పుడు ఎదుర్కొన్న చదువు కు వచ్చిన అవరోధాల వలన నాకు ఉన్నత చదువులు చదవాలనీ,ఉద్యోగం చేసి ఆర్ధికస్వావలంబన సాధించాలనే కోరిక తొలిచేసింది.కుటుంబ ఒత్తిళ్ళలో వెంటనే కుదరక పోయిన తర్వాత్తర్వాత ఎమ్మేతెలుగు,ఎమ్మెస్సీ గణితం పట్టలతోబాటూ బీయిడీ చేసి ఉన్నత పాఠసాలలో ఉపాధ్యయిని గా చేరి పాతికేళ్ళ సర్వీసుచేసి ప్రధానోపాధ్యాయినిగా పదవీ విరమణ చేసాను.
2.మీ సాహితీ ప్రస్థానం ఎలా మొదలయ్యింది?
2)నేను బాగా చిన్నగా ఉన్నప్పుడే మా పెద్దక్కయ్య పి.సరళాదేవి కి వివాహం జరిగింది.ఆమె తెలుగు స్వతంత్రలో విరివిగా రచనలు చేసేది.మలతీచందూర్,పి.శ్రీదేవి,రామలక్ష్మిల సమకాలీనురాలు.డా.శ్రీదేవి క్కకు మంచి మిత్రురాలు.నేను చిన్నప్పుడు కొంతకాల అక్క ఇంట్లో ఉన్నప్పుడు బడికి వెళ్ళకపోవటం వలన అక్క ఇంట్లో ని గ్రంథాలయం లో శ్రీపాద,చలం,కొడవటిగంటి కుటుంబరావు వంటి ప్రముఖుల రచనలేకాక అనేక అనువాద గ్రంథాలు కూడా చదివాను.నేను రచయిత్రీగా మారటానికి దోహదం చేసింది అక్క వాళ్ళింట్ళొ ఉన్న సమయమే అనుకుంటాను.
మా పెద్దన్నయ్య కొడవంటి లీలామోహనరావు భారతిలో వ్యాసాలు రాసేవాడు.నా కవితలుకూడా ఆంగ్లం లోకి అనువదించాడు. మా చిన్నన్నయ్య కొడవంటి కాశీ పతిరావు.కూడా కథకుడూ.1965 నుండీ 85 లవరకు అన్ని పత్రికలలో విస్తృతం గా కథలు రాసాడు. చదువుకోకుండా కథలు రాస్తున్నానని మందలిస్థారని నేను కథలూ కవితలు రాసినా పుస్తకాల అడుగున పడేసేదాన్ని.
1970 లో నా మొదటి కథ ప్రచురితమైంది.వివాహనంతరం డిగ్రీ పూర్తిచేసాక 72 లో హైదరాబాద్ లో అడుగు పెట్టాను.వీర్రజు గారితో ముఖచిత్రాలు వేయించుకోటానికి కవులెందరో రావటం ఇంట్లో ఎక్కువగా కవితసంపుటాలు ఉండటం ,ఇంట్లో తరుచు కుందుర్తి గారి అధ్వర్యం లో కవితగోస్ఠులు జరగటం తో నాకు కవిత్వరచన పట్ల ఆసక్తి పెరిగింది.
నేను ఆ గోష్టులలో పాల్గొనకపోయినా వినేదాన్ని నా కవితలు చదివిన వాళ్ళు బాగున్నాయనటం తో కవిత్వ పైనే దృష్టి పెట్టాను.తొమ్మిది కవితాసంపుటాలు,మూడు కథలసంపుటాలు,నా పుస్తకలపై వచ్చిన సమీక్షలసంకలనం ,ఒక నవలిక,కేంద్ర సాహిత్య అకాడెమి భారతీయ సాహిత్యనిర్మతల పేరిట ప్రచురించిన డా.పి.శ్రీదేవి మోనోగ్రాఫ్, నా దీర్ఘకావ్యం యుద్ధం ఒక గుండెకొత గ్రంధానికి డా.భార్గవీరావు,డా,జయలక్షిగర్లు చేసిన ఆంగ్లానువాదం,నిర్మలానంద వాత్సాయన్ చేసిన హిందీ అనువాదం ఇంతవరకూ ప్రచురితమైన నా పుస్తకాలు. ఇవికాక కొన్ని సామాజిక వ్యాసాలు,సాహిత్యవ్యాసాలు పుస్తకరూపం లో రావాల్సి ఉంది.నా కవితలూ,కథలూ ఆంగ్ల,హిందీ,తమిళ్,కన్నడ,మైథిలీ భాషలలో అనువదింపబది ఆయా భాషపత్రికలలో ప్రచురితమయ్యాయి.
నా కథ ఒకటి మహారాష్త్ర ప్రభుత్వ పాఠశాల లలొ ఏడవ తరగతి ద్వితీయభాష తెలుగువాచకం లో చేర్చబడినది.అంబేద్కర్ విశ్వవిద్యాలయం డిగ్రీ విద్యార్ధులకు తెలుగు సిలబస్ లో నా కవిత చేర్చారు. నా రచనలపై మధురై కామరాజ్ విశ్వవిద్యలయం లొ రెండు ఎంఫిల్,నాగార్జున విశ్వవిద్యలయం లో పీహెచ్ డి పరిశోధనలు జరిగాయి.
3.ఏదైనా రచన ఎలా ఉండాలంటారు?
3.)ఒకనాటిగురజాడ,ఒకచలం,ఒకశ్రీశ్రీ,కొ.కు ఇలా చెప్పుకుంటూ పోతే మరెందరో పాఠకుల్ని ఆలోచింపచేసినవారే.వాళ్ల ప్రభావానికి లోనై నాలాంటివారెందరో సాహిత్యరంగం లోకి వచ్చాము.కథా,కవిత ఏదైనా చదివినతర్వాత పాఠకుడిని కొంతకాలమైనా వెంటాడాలి.గుండెతలుపు తట్టి రచనలో మమేకం చేయాలి.ఆ రచనల వలన సమాజం మారినా మారకపోయినాఆ అంశం పట్ల అవగాహన కల్పించి ఆలోచింపచేయాలి.మళ్లా ఎప్పుడు ఆటువంటి దృశ్యమో సంఘటనో ఎదురైనప్పుడు ఆ రచనలతో ముందుకు పాఠకుడికి గుర్తు రావాలి.సామాజిక ప్రయోజనం ఉన్నా లేకున్నా ఆదర్శాల్ని వల్లించకపోయినా పర్వాలేదు.కానీ జనానికి చెరుపు చేయకూడ దు.కొంతమందినైనా ఆలోచింపజేయగలిగేదే మంచి రచన అని నా అభిప్రాయం.
4.కథైనా, కవితైనా సామాజిక సృహ తప్పనిసరిగా ఉండాలంటారా?ఏదైనా సమస్య లేకుండా రచన ఉండకూడదా?
4)కథలు రాయాలంటే ఒక సమస్య ఉండి తీరాలా అన్నారు.కథైనా,కవితైనాసామాజిక సమస్య ఉండి తీరాల్సిందే.సామాజిక స్పృహ అనగానే బడుగు బలహీన వర్గాల బాధలూ కన్నీళ్ళూ గురించే అని చాలా మంది అపోహ,మనందరం సమాజం లో బాగమే కదా?ప్రేమా,పెళ్లి,శృంగారం కథల్లో రాసినా వాటిని సాకారం చేసుకునేందుకు పడే తాపత్రయం కూడా సమస్యే.సమస్య లేకుండా కథ అంటె ఒక విషయం చెప్పటం మాత్రమే .అటువంటివి కాలక్షేపం కథలు ఔతాయి.చదివిన వెంటనే మర్చిపొతాం.ఒక సమస్యనో,ఒకవిషయాన్నో పరిష్కరించే దిశలొ చెప్పేదే కథనం ఔతుంది. ఒక సమస్య కులమత వర్గ విభేధాలను బట్టి వివిధ రూపాలుగ రుపాంతరం చెందుతుంది,అందరికి ఒకేలా ఉండదు.అందుచేత అన్ని సాహిత్యం లోకి రావల్సిన అవసరం ఉంది.మన నిత్య జీవితం లో చుట్టూ సమాజం లో ఎన్నెన్నో సమస్యల గురించి వింటుంటాం చూస్తాం .అవి కౌటుంబికమైనవైనా, సామాజికమైనవైన మన సమకాలీన పరిష్తితుల్ని పాఠకుడికి అవగాహన కల్పించే దిశలో రాయాల్సిన అవసరం ఉంది.ఐతే అది ఎటువంటి అంశం దాన్ని ఎలా ప్రజంట్ చేస్తున్నామూ ఆలొచించవలసినదేనా,అనాలోచితం గా పక్క దారి పట్టించేదా అనేది మాత్రం రచయిత కవుల విజ్ఞత కు సంబంధించినది.
5.మనుచరిత్ర మొదలుగా చాలా వరకు ప్రేమ ఆధారముగా వచ్చినవే.ప్రేమకథలను పాఠకులు ఆదరిస్తున్నారు కూడా.వాటి గురించి మీ అభిప్రాయం ఏమిటి?
5)ప్రెమా,పెళ్లీ అపార్ధాలూ,అపోహలూ,అవరోధాలూ వీటన్నీటితో మొదటినుండీ చాలా కథలే వచ్చాయి.వస్తున్నాయి.ఐతే అవన్నీ మానవజీవితం లో ఒక పార్శ్వమే,అదే జీవితం కాదు.పుట్టినదగ్గర నుండీ ఎన్నో సమస్యలూ సంఘటనలూ ఎదుర్కోంటూనె ఉంటాము.వాటిని అధిగమించటం ఎలనొ తెలియజేయాలి.ఎన్ని చిక్కుముళ్ళు ఎదుర్కొన్నా వాటిని విప్పుకుని ముందుకు వెళ్ళగలిగే ఆత్మవిశ్వాసం,గుండె నిబ్బరం కలిగించాలి ఎటువంటి పరిస్తితివచ్చిన ఆత్మహత్య మాత్రమె పరిష్కారం గా ఏ రచయిత తన రచనలలొ దిశానిర్దెశం చేయకుడదు.ఆశావహదృక్పథన్ని సూచించె లా రచనలు ఉండాలి.అలా అని ఉపన్యాస ధోరణి లో కాదు.బలమైన వ్యక్తిత్వం గల పాత్రల ద్వారా సూచించాలి.
6.ఈ మధ్య కొన్ని పత్రికలల్లో శృంగార కథలు ప్రత్యేకం గా వేస్తున్నారు.ఇది ఎంత వరకు సబబు అంటారు?
6.శృంగార భావన మనసుకు గిలిగింతలు పెట్టేది వుండాలికానీ వాంచలు రేకెత్తించేదిగా ఉండకూడదు.వాంచల్ని రేకెత్తించేలా మొతాదును మించి రాసిన కథలకి ఫోర్న్ సైట్లకి తేడా ఏముంది. కుటుంబమంతా చూసే పత్రికలలొ శృంగార కథలకు నేను అంగీకరించను.సామాజిక బాధ్యత గల పత్రికాధిపతి ఐనా,రచయిత (త్రు) లు ఐనా వాటిని ప్రోత్సహించకుడదని నా అభిప్రాయం.శృంగారకథల్ని ప్రచురించే వారపత్రికలకు నేను దూరం.
7.మీరు కథలు, కవితలు రెండూ వ్రాసారుకదా, మీకు రెండింటిలో ఏ ప్రక్రియ అంటే ఇష్టము? మీ రచనలల్లో మీకు నచ్చిన దాని గురించి చెప్పగలరా ?
7). మా కుటుంబం లో కథకులే ఎక్కువగా ఉన్నారు.నేను సాహిత్యం లో అడుగు పెట్టింది కూడా కథా రచనతోనే.కాని వివాహానంతరం కవిత్వం ఎక్కువగా వినటం, చదవటం నన్ను ఎక్కువగా కవిత్వం వైపు దృష్ఠి పెట్టేలా చేసాయి.
కథ రాయాలంటే తగిన విషయం తో పాటు దాన్ని బలపరచే సంఘటనలు ,సంభాషణలతో కథన నిర్మాణం ఎంచుకోవటం ,అవన్నీ ఏక సూత్రం తో కూడిన అల్లిక తో ఎంచుకోవటం,అప్పుడు కథ రాయటం మొదలగు వాటికి నాకు కుదరలేదు.ఉమ్మడి కుటుంబం, ఆర్ధిక పరిస్థితులు,పిల్లలు, అనారోగ్యాలు ఇంకా అనేకానేక చికాకుల మధ్య కథ రాసేంత తీరికా,సమయం సమకూర్చుకోలేక రాయాలనుకున్న కథలెన్నో వెలిసిపోయాయి.అప్పటికీ చాలానే రాసాను.మూడు కథల సంపుటాలు వచ్చాయి.
ఇక కవితకైతే చిన్న కదిలిక,మనసును తాకే దృశ్యం,ఒక స్పందన చాలు.అంతేకాక తక్షణ స్పందనని బలంగా వ్యక్తీకరించాలంటే కవిత్వమే బాగుంటుంది.కథలకన్నా కవిత్వం లోనే నా అభిప్రాయాలు, ఆలోచనలు దృఢంగా చెప్పగలననుకుంటున్నాను.బహుశా అందువల్లే ఎక్కువగా కవిత్వం రాసాను.తొమ్మిది కవితాసంపుటాలు వెలువరించాను.అందులో రెండు ధీర్ఘకావ్యాలు.
నాకు నచ్చిన రచన చెప్పాలంటే, అమెరికాలో జంట టవర్లు కూలిపోయిన నేపథ్యం, తదనంతర అమెరికా ఆఫ్గన్ యుద్ద నేపథ్యం లో 'యుద్ధం ఒక గుండె కోత ' అనే ధీర్ఘకావ్యం రాసాను.యుద్ధం స్త్రీలను, తల్లులను ఎంత బాధపెడుతుందో ఆనాటి సంధర్భం,సంక్షోభం,పరిస్థితులు అవగాహన చేసుకొని, ఒక ఆర్తి తో ఆవేదనతో, ఆగ్రహంతో,ఆదేశం తో గుండెలోతుల్లోనుంచి ఒక మాతృహృదయంతో రాసిన రచన అది.దీని ఆంగ్లానువాదం " war a heart's ravege " పేరుతో,"యుద్ధ్ ఏక్ దిల్ కీ వ్యథ "పేరు తో హిందీలోను పుస్తక రూపంలో వచ్చాయి.
నేను ధీర్ఘ కావ్యం రాసిన నాటికి,కొంతమంది కవులు మాత్రమే ధీర్ఘ కావ్యాలు రాసారు.కాని కవియిత్రులల్లో మొట్టమొదటి ధీర్ఘ కావ్యం గా నేను రాసిన "యుద్దం ఒక గుండె కోత" అని కొంతమంది ప్రముఖులు ప్రశంసించారు.దీనిపై M.K యూనివర్సిటీ నుంచి భాగ్యలక్ష్మి అనే అమ్మాయి M.phil చేసింది.ఆ సంవత్సరం సోమసుందరంగారు ప్రతి ఏటా ధీర్ఘ కావ్య రచనకు ఇచ్చే కృష్ణశాస్రి పురస్కారాన్ని నాకు అందజేసారు.బహుశా ఈ కారణాల వల్ల కావచ్చు నాకు నచ్చిన నా రచన "యుద్దం ఒక గుండె కోత" ధీర్ఘ కావ్యం.
8.రచన కాకుండా ఇంకా మీకు ఏవైనా ఇతర కళలల్లో అభిరుచి ఉందా?
నేను కాలేజ్ లోచదివే రోజుల్లో విజయనగరం సంగీతకాలేజీలో రెండుమూడేళ్లు కర్ణాటకసంగీతం నేర్చుకున్నాను.కానీ నాకు శాస్త్రీయ సంగీతం కన్నా లలితసంగీతం అంటే ఆసక్తీ అభినివేశం ఉంది.వివాహానికీ ముందు బాపూ,వడ్దాదిపాపయ్య చిత్రాలను చూసి వేసేదాన్ని.తర్వాత సాహిత్యం లో పడి మానేశాను.హేండీక్రాప్ట్స్,ఎంబ్రైడరీ,పేబ్రిక్ పెయింట్స్ పట్లా ఆసక్తి ఉంది.
9.కొత్త రచయతలకు మీ సలహా ఏమిటి?
కొత్తరచయితలు సలహాలు అందుకునే పరిస్తితులు లేవనుకుంటాను.ఎందుకంటే ఇప్పటి యువతరం చాలావరకూ విద్యావంతులు.అనేకబాషాసాహిత్యం వారికి అందించేందుకు టెక్నాలజీ వారి అరచేతుల్లో ఉంది.
బహుసా అందుకే కొత్తతరం కవులూ,రచయితలూ తమ రచనలకు తీసుకునే అంశం లోనూ,రచనా నిర్మాణం లోనూ కొత్తవస్తు రూపాలతో కొత్తనిర్మాణ విథానంతో వైవిధ్యభరితంగా ఉంటున్నాయి.ఆర్ధికసామాజిక విధ్యంశాలూ,సంక్షోబాలూ,సంఘర్షణలూ యువతరం సమర్ధవంతంగారాస్తున్నారు.ఐతే కొత్తపుంతలు తొక్కించే ప్రయత్నంలో కథల్నీ కవితల్నీ పక్కదారి పట్తించకూడదనీ అస్పష్టతకు తావిచ్చేలా కాకుండా సామాన్యులకూ కూడాఅర్ధమయ్యేలా రాస్తే మరింతమందికి రచనల్తో చేరువకాగలరని ఉద్దేశ్యం.
10) నేడు సాహిత్యరంగం ఎలా ఉందంటారు?
10.రాసి,వాసి బట్టి చాలాబాగుంది.
ఎందుకంటే కవిత్వం రాసేవాళ్లు చాలాచాలా ఎక్కువయ్యారు.కథలూ,,నవలలుఎక్కువగానే వస్తున్నాయి.పూర్వంలాగే సాహిత్యం రెండుపాయలుగాపాపులర్ సాహిత్యం,సామాజికసాహిత్యంగానే సాగుతోంది.కుల,మత,వర్గ,ప్రాంతాలుగాసాహితీవేత్తలంతాగ్రూపులు,గ్రూపులుగా విడిపోయారనిపించుతోంది.ఏగ్రూపుకా గ్రూపు ప్రమోట్ చేసుకుంటోంది.ఒకగ్రూపువారి సాహిత్యం మరొక గ్రూపు చదవరు.ముఖ్యంగా సాహితీవిమర్శకులు తగ్గిపోయారు.అందుకు ప్రధానకారణం కొత్తగారాస్తున్నవారితో సహా ఎవరూ విమర్శని భరించలేకపోవటం.చాలామందితమవేతప్ప మరొకరి రచనలు చదవటం లేదు.ఒకపుస్తకం అచ్చు వేసుకోగానేసన్మానాలూ,సత్కారాలూ,పురస్కారాల వెనకపరిగెత్తే కీర్తికండుతి పెరిగిపోయింది.రాయటానికి ముందు మంచిచదువరులు కావాలి.సమకాలీన సాహిత్యంతో పాటూ ముందుతరాల రచనలు చదివిన తమ సృజనాత్మకతను పెంచుకోవాలని నా అభిప్రాయం.
మీ కథలు కొన్ని చదివాను నాకు చాలా నచ్చాయి. అన్నింటిలోకి కొంచం ఎక్కువగా "కంచె " కథ నచ్చింది.అందులోని నాగమణి వాళ్ళ అమ్మ పాత్ర నచ్చింది. ఒక దగాపడిన తల్లి,తన పిల్లలను ముఖ్యంగా ఆడపిల్లను సమాజపు కోరల నుంచి రక్షించేందుకు ఎంత కష్టపడుతుందో బాగా చూపించారు. మీ గురించి తెలుసుకోవటం చాలా సంతోషంగా ఉందండి.మీ విలువైన సమయాన్ని మాకోసం వెచ్చించినందుకు ధన్యవాదాలండి.