బియ్యం లో రాళ్ళు
రచయిత్రి; పెయ్యేటి శ్రీదేవి
తొందర తొందరగా గుడిలోకి వచ్చాను.అప్పటికే అక్కడ మంటపము మీద దంపతులిద్దరూ కూర్చొని ఉన్నారు.ఆవిడ కొద్దిగా దిగులుగా అనిపించారు.ఆవిడ పక్కన కూర్చొని ఏమైందండీ అలా ఉన్నారు? అని అడిగాను.ఆవిడ ఏమీ మాట్లాడలేదు.ఇంతలో ఆయన "ఏముందమ్మా? దేశానికి స్వాతంతర్యం వచ్చింది కాని స్వేచ్చగా బతుకుదామంటే స్వాతంతర్యం లేదు.ఏది కొనాలన్నా ధరలు ఆకాశాన్ని అటుతున్నాయి.పోనీ సొంతంగా ఇల్లుందని ఉందామా అనుకుంటే పన్ను! పన్ను! పన్ను! ఇంటికి పన్ను.అద్దెకిచ్చినట్లు తెలిస్తే మరికాస్త పంచుతారు.కరెంటుకు పన్ను! కూర్చున్నా పన్నే! నిలుచున్నా పన్నే! కనీసావసరాలు కూడా తీరవు.అన్ని కష్టాలూ మధ్య తరగతి వారికే.చివరకు తినే బియ్యలో కూడా రాళ్ళే! ఎంత ఏరినా కనపడవు.బియ్యంలో కల్తీ, పాలల్లో కల్తీ,నేతిలో కల్తీ.ఆఖరికి మందుల్లో కూడా కల్తీయే! పేపర్ నిండా దారుణాలే! బ్రతుకే కష్టమైపోతోంది అన్నీ సమస్యలే! "అని,
ఇటురామ్మా అంటూ లోపలికి తీసుకెళ్ళారు.అక్కడ శివలింగం ముందు ఓం అని పెద్దగా వ్రాసి ఉంది.దాని ముందు ఏడెనిమిదేళ్ళ పిల్లలు కూర్చొని ఓంకారనాదాన్ని పఠిస్తున్నారు."చూడమ్మా పసిపిల్లలు ఎంత చక్కగా చదువుతున్నారో! పిల్లల కు మనము ఏది నేర్పిస్తే అది నేర్చుకుంటారు.కాని మనమేమి నేర్పిస్తున్నాము ? ఈనాటి చదువులు ఎలా ఉన్నాయి? మనము చూసే టి.వి లు , సినిమా షోలు వాళ్ళను ఎటు నడిపిస్టున్నాయి?" ఇవన్నీ తలచుకొని బాధపడుతోంది అన్నారు. అవునాండి అంటూ ఆవిడవైపు తిరిగాను.చక్కగా పెద్దబొట్టుతో, అంచుచీరతో ఉన్న ఆవిడ బదులు, మొహాన బొట్టులేకుండా, జుట్టు విరబోసుకొని స్టైల్ గా ఉన్న అమ్మాయి, ఓ అబ్బాయి కనిపించారు.అరే అదేమిటీ వాళ్ళిద్దరేమయ్యారు ? వీళ్ళేవరు ? ఈ మధ్య కథలు రచయతల పేర్లు లేకుడా రాసినట్లు మనుషులను కూడా మార్చేస్తున్నారా అని ఉలిక్కి పడ్డాను.వెంటనే కళ్ళు తెరిచి చూస్తే నా దిండు పక్కన "బియ్యం లో రాళ్ళు " పుస్తకము,నా కళ్ళజోడు కనిపించాయి :) అంతకు ముందే పెయ్యేటి శ్రీదేవి గారు వ్రాసి పంపింది చదివి,పడుకున్నాను.అందుకే ఇలా కల వచ్చినట్లుంది . కలలో వారు చెప్పినట్లు , పుస్తకము గురించి శ్రీదేవిగారే ఏమంటారో విందాము . . . . .
నమస్కారమండి శ్రీదేవి గారు
మీ 'బియ్యంలో రాళ్ళు ' చదివానండి.కథలన్నీ చాలా బాగున్నాయి.ముఖ్యం గా "బియ్యం లో రాళ్ళు"కథ. అందులో ఈనాటి పర్స్తితులను చక్కగా చెప్పారు.మీరు ఏ ఒక్క విషయాన్నీ వదల కుండా కులంకషంగా అన్నిటి గురించి వివరించారు.అవి చదివాక మిమ్మలిని కొన్ని ప్రశ్నలడగాలనిపించింది.
1.ముందుగా మీ గురించి,మీ కుటుంబ నేపధ్యం గురించి చెబుతారా ?
నా గురించి అంటే............
మాది నరసాపురం. పుట్టింది, పెరిగింది, చదువు, వివాహం, అన్నీ నరసాపురం లోనే. స్వంత మేనమామతోనే వివాహం జరిగింది. వారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో ఆఫీసరు గా చేసి రిటైరయారు. మాకు ఇద్దరు అమ్మాయిలు. పెద్ద అమ్మాయి ఆస్ట్రేలియాలో వుంటుంది. ఆమె అక్కడి తెలుగు రేడియో కేంద్రంలో సర్టిఫైడ్ అనౌన్సర్. ఒక వైపు ఉద్యోగం చేసుకుంటూనే తెలుగు భాషాభివృధ్ధికై విశేషమైన కృషి చేస్తోంది. నావి చాలా కథలు టోరీ రేడియోలోను, (తెలుగువన్.కామ్), ఆస్ట్రేలియా లోని తెలుగు ఎఫ్.ఎమ్. రేడియో ఛానెల్స్ లోను, అమెరికా నుంచి, కొన్ని కథలు గాను, కొన్ని నాటికలు గాను ప్రసారమయ్యాయి. అలాగే నా కథలు, వ్యాసాలు ఆస్ట్రేలియా లోని తెలుగు మేగజీన్స్ లో కూడా ప్రచురితమయ్యాయి. ఇక్కడ అన్ని దినపత్రికలు, వారపత్రికలు, మాస పత్రికలలోనూ నా కథలు, వ్యాసాలు ప్రచురితమయ్యాయి, అవుతున్నాయి. నేను డైలాగ్స్ తో కథలు వ్రాస్తానని అందువలన నాటికలుగా ప్రసారం చేయడానికి వీలుగా వుంటాయని అంటారు. ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు, అక్కడ తెలుగువారి ఆహ్వానం మీద రేడియోలో నా కథలు కొన్ని సమర్పించాను. అలాగే అక్కడి వారు కోరిన మీదట వారు రేడియోలో సమర్పించడం కోసం వారికి కథలు రాసి ఇచ్చాను. అక్కడి రేడియోలో నేను ప్రసారం చేసిన 'ప్రశాంతి' అన్న నా కథను యథాతథంగా అక్కడ ఉంటున్న ఒక పెద్దమనిషి కాపీ చేసి, మెల్ బోర్న్ నుంచి వస్తున్న ఒక పత్రికలో ప్రచురించడం జరిగింది. మా అమ్మాయి ఆ పత్రిక వారికి నోటీసు ఇస్తే వారు దరిమిలా నాకు క్షమార్పణలు చెప్పుకోవడం జరిగింది. ఇక మా రెండవ అమ్మాయి అమెరికాలో వుంటుంది. ఆమె అక్కడ సిలికానాంధ్ర వారి మనబడి లోను, గురుకులం లోను స్వచ్ఛంద సేవలు అందిస్తూ తెలుగు భాషాభివృధ్ధికి ఇతోధికమైన సేవలందిస్తున్నది. నాకు పాటలు పాడడం, పాటలకు వరసలు కట్టడం హాబీ. నేను వ్రాసిన నాతో కోయిల అన్న పాట ఆంధ్రప్రభ లో ప్రచురితమయింది. ఆ పాటకు వరస కట్టి నేను పాడాను. మా వారు రాసిన ఎన్నో పాటలకి, బోయి భీమన్న గారి గేయాలకు, కృష్ణశాస్త్రి గారి గేయాలకు బాణీలు కట్టి పాడుతూ వుంటాను. మా వారు కూడా పాటలు రాస్తారు, వరసలు కడతారు. వారు కూడా కథలు, నాటకాలు రాశారు. వారు రాసిన పాటలు ఆకాశవాణి నుంచి కూడా ప్రసారమయ్యాయి. వారి నాటకానికి ఆంధ్రప్రదేశ్ సంగీతనాటక అకాడమీ వారు నిర్వహించిన జాతీయ స్థాయి నాటక పరిషత్తులో ఉత్తమ రచన బహుమతి వచ్చింది. వారికి అనేక పరిషత్తులలో అనేక బహుమతులు వచ్చాయి. వారు నటులు, దర్శకులు, రచయిత, గాయకులు, కవి. కొన్ని టి.వి.సీరియల్సు లో కూడా నటించారు. రేడియో నాటకాలలో కూడా నటించారు.
2. మీరేమొ చక్కగా పెద్దబొట్టుతో అచ్చమైన గృహిణి, ఇంటికి ఎవరొచ్చినా ఆదరించే అన్నపూర్ణలా ఉన్నారు.మీ రచనలేమో నవీనకాలపు సమస్యలను కూడా సృజించాయి. అసలు మీకు వ్రాయాలని ఎందుకనిపించింది?
2. చీరకట్టు, బొట్టు, గాజులు ఒకప్పటి మన అందమైన సంప్రదాయాలు. ఆ సంప్రదాయాల్లోంచి వచ్చిన వాళ్ళమే మనమందరం. అందుకే మనకి ఆనాటి సంస్కృతి, సంప్రదాయాలు తెలుసు. (ఈ విషయం మీద నేటి కొత్త తరహా ఫేషన్ల గురించి ఫేషన్ - ఫేషన్ అన్న కథ రాశాను.) అందుకే ఆ సంప్రదాయం లోనే వుండటానికిష్ట పడతాను. ఈనాటి ఆధునిక కాలపు సమస్యలూ తెలుసు. ఒకప్పుడు రోజులు ఎంత బాగుండేవో, ఇప్పుడు సాంకేతిక పరంగా ఎంత అభివృధ్ధి చెందినా, ఎన్నో సమస్యలతో మనం నలిగిపోతున్నాము. ఆనాటి రోజులు, ఈనాటి రోజులు, మార్పులు, మంచి చెడ్డలు మనకు తెలుసు.
(అసలీ ప్రశ్నకి సమాధానం 'స్టిక్కర్స్ నోము' కథలో పార్వతమ్మగారి చేత చెప్పించాను కూడా.) ఈనాడు దేశంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, కల్తీవ్యాపారాలు, మోసాలు, అత్యాచారాలు, హత్యలు, దోపిడీలు, దొంగతనాలు, వీటికి తీవ్ర మనస్తాపం చెంది, అవే నా కథావస్తువులుగా చేసుకుని, జరుగుతున్న యదార్థ సంఘటనల్నే కథలుగా రాసాను. 'బియ్యంలో రాళ్ళు' కథలో జరిగిన సంఘటనల్ని పెట్టాను. హైదారాబాద్ వచ్చిన కొత్తలో అమ్మాయిలు రోడ్డు మీద వెళ్తూంటే స్కూటర్ల మీద వచ్చే రౌడీ కుర్రాళ్ళు అమ్మాయిల్ని కొట్టడం, చైన్లు లాగడం చూసి తీవ్ర ఆవేదనతో 'పరదామాటున' కథ వ్రాసాను. ఇప్పుడు అమ్మాయిలపై అత్యాచారాలు చేయడం, వారిని చంపేయడం చాలా ఎక్కువగా వుంది. మన దేశంలో కఠిన శిక్షలు వెయ్యరు. ప్రభుత్వాలు పట్టించుకోవు. సమాజంలో మార్పు తేవాలని ఎవ్వరూ అనుకోరు.
3.ఏదైనా కథ వ్రాసాక మీకెలా అనిపిస్తుంది?అంటే చెప్పదలుచుకున్నది పూర్తిగా చెప్పాను అని సంతృప్తా?లేక ఇంకా చెప్పాల్సింది అనే అసంతృప్తా?
3. ఏ కథ రాసినా ప్రతి చిన్న వాక్యం రాసేటప్పుడు చాలా శ్రధ్ధ తీసుకుంటాను. ఓపెనింగ్ నుంచి ఎండింగ్ వరకు, కథ మధ్య భాగంతో సహా చాలా అద్భుతంగా వుండాలని, పెర్ ఫెక్ట్ గా వుండాలని అనుకునే కొన్ని కొన్ని నా స్వంతమైన కొత్తరకం సంభాషణలు చేర్చి కథ రాస్తాను. నేను చెప్పదల్చుకునే విషయాన్ని కథల ద్వారా పాఠకుల మనసులలోకి సరైన మార్గంలో వెళ్ళేలా, వారికి సరిగ్గా అర్థమయ్యేలా కథ రాయాలని ప్రయత్నిస్తాను. కథ రాయడంలో అసంతృప్తి ఏమాత్రం లేదు.
4.ఇప్పటి వరకు మీరు వ్రాసినదానిలో మీకేది నచ్చింది? ఎందుకు?
ఇప్పటివరకు రాసిన కథలన్నీ నాకు చాలా చాలా నచ్చినవే. 'బియ్యంలో రాళ్ళు' ఇష్టమైన కథ. అందులో రాధ పాత్రంటే చాలా ఇష్టం. 'ఎటు పోతోందీ దేశం?' కూడా. వాటిలోవన్నీ చాలామట్టుకు జరిగిన సంఘటనలే. చాలా బాగా రాసాను కూడా.
5.మీరు చాలా ఇష్టంగా,కష్టపడి రాసింది పూర్తయ్యాక అసంతృప్తిని మిగిల్చింది ఏదైనా ఉందా?
అన్నీ ఇష్టపడి రాసిన కథలే. చాలా కష్టపడి రాసిన కథ 'సునామీ'. సింగపూర్ నించి ఒక కుటుంబం చెన్నై వచ్చి సునామీలో కొట్టుకుపోయారన్న వార్త పేపర్లో చదివి ఆ కథ రాసాను. ట్రాజెడీ కాకుండా ఆ కథ సుఖాంతం చెయ్యడానికి చాలా ప్రయత్నం చేసి రాసాను. 'బాస్' అనే సినిమా సునామీ మీద తీసారు. ఆ సినిమా ముగింపు బాగా లేదనిపించింది. నాకు ఏ కథా అసంతృప్తి మిగల్చలేదు. వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కందిపప్పు ధర అమాంతం వందరూపాయలకు పెరిగింది. అప్పుడు కందిపప్పు అన్న కథ రాసాను. ఒక సారి ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు, ఇంటర్నెట్ లో మా టి.వి.లో పాడాలని వుంది కార్యక్రమం చూశాను. అప్పటికి అక్కడ టి.వి.ల్లో తెలుగు ప్రోగ్రాంలు రావటల్లేదు. ఆఖరున బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పిన మాటలు విని 'ఎవరేమనుకుంటారో' అన్న కథ రాసాను. నటనాలయం అన్న కథకు ప్రేరణ మహేష్ బాబు నమ్రతను వివాహమాడడం. సినిమా హీరో, హీరోయిన్ల తెర వెనక జీవితాలు, షూటింగులు అన్నీ ప్రస్తుతిస్తూ ఆ కథ రాసాను. పిన్నీసు అన్న కథ చదివి ఎంతోమంది వారు కూడా వారి ఇళ్ళల్లో పెళ్ళిళ్ళలో పిన్నీసులు పళ్ళెంలో పెట్టి అందరికీ అందుబాటులో ఉంచుతామంటూ ఉత్తరాలు రాసారు. స్టిక్కర్స్ నోము చదివి ఒకావిడ అన్నారు, 'మీరు చెప్పినవి నిజంగా జరుగుతున్నాయి. కాశ్మీరులో వైష్ణవీదేవి ఆలయంలో నిజంగా స్టిక్కర్స్ తోనే అమ్మవారికి పూజ చేస్తారు.' అన్నారు. గంగాజలం అన్న కథలో మనిషికి మతం కన్న మానవత్వం ముఖ్యం అన్న సందేశాన్నిస్తూ రాసాను. రాజకీయనాయకులు ఎన్నికల ప్రచారాలకు సినిమావాళ్ళను వాడుకోవడం గురించి పిలిచితే పలుకుతావట అన్న కథ రాశాను. ఇందిరాగాంధీ గారు చనిపోవడానికి ముందురోజు ఆవిడ ఒరిస్సా రాష్ట్రం వెళ్ళారు. అక్కడున్న జనం మీదకు పూలదండలు విసిరారు. అది టి.వి.లో చూశాను. చాలా సంవత్సరాల తర్వాత ఆ సంఘటన మీద తీవ్రంగా ఆలోచించి ఆవిడ విసిరిన పూలదండ మీద కథ రాయాలనిపించి, 'ఇందిరమ్మ' అన్న కథ రాశాను.ఇలా నా కథలన్నీ సమాజంలో నిజంగా జరిగిన, జరుగుతున్న సంఘటనలను ఆధారంగా తీసుకుని రాసినవే. దేవుడున్నాడా, లేడా అన్న అంశం మీద 'దేవుడు' అన్న వ్యాసం ఈనాడు దినపత్రిక అంతర్యామి శీర్షికలో వచ్చింది. ఒకసారి ఆకాశం నించి ఉల్కలు రాలతాయి అని శాస్త్రజ్జులు చెప్పగా అందరూ మేడలమీదకి వెళ్ళి రాత్రంతా జాగారం వుండి చూసారు. కానీ ఉల్కలు పడలేదు. అది ఆధారంగా తీసుకుని కృష్ణసాక్షాత్కారం అన్న కథ రాసాను.
6.మీరు కథలేనా , నవలలు ఏమీ రాయలేదా?
నేను కథలే రాస్తున్నాను. సామాజిక సమస్యల్ని కథావస్తువులుగా చేసుకుని కథలు రాయడం, పరిష్కారం కూడా చూపడం ఒక్క కథల ద్వారానే సాధ్యం. అందుకే కథలు రాయడం ఒక సామాజిక బాధ్యత, సమాజసేవ కింద భావిస్తాను. కొంతమంది నవలలు రాయమన్నారు కాని ........ నవల ప్రారంభించి ముగించేదాకా చాలా సమయం పడుతుంది. సమయం, ఆరోగ్యం, మానసిక శాంతి, అన్నీ బాగుండాలి. జీవితం చాలా చిన్నది.
7.మీ అమ్మగారు,బామ్మగారు కూడా రచనలు చేసారన్నారు, చాలా గొప్ప విషయము.మీ రచనల మీద వారి ప్రభావము ఉందంటారా?
అవును. మా అమ్మగారు చాలా ఆధ్యాత్మిక కీర్తనలు రాసారు. ఆవిడ మంచి వేదాంతి. వేదాంతపరమైన ఉపన్యాసాలు చాలా బాగా చెప్పేవారు. ఆవిడ బామ్మగారు, అంటే మావారి బామ్మగారు కూడా, తాళపత్రాల మీద అంతరార్థ రామాయణం, అంతరార్థ గజేంద్రమోక్షం రాసారు. అవన్నీ మా అమ్మగారు చాలా కష్టపడి పుస్తకాలుగా ప్రింటు వేయించారు. వాటికి ముఖచిత్రాలు శ్రీ బాపు గారే వేసారు.
ఇకపోతే వారి పధ్ధతులు, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక ఆలోచనలు, కొన్ని వుంటే వుండచ్చు గాని, కథల్లో మాత్రం వారి రచనల ప్రభావం ఏమాత్రం లేదు. ఎవరికన్యాయం జరిగినా, స్త్రీలపై ఎన్నో దారుణాలు జరుగుతూంటే సహించలేని మనస్తత్వం నాది. ప్రతిదీ న్యాయబధ్ధంగా వుండాలనుకుంటాను. అందుకే సామాజిక సమస్యలే నా కథావస్తువులు. అదేగాక పిన్నీసు, ట్యూబ్ లైట్, అష్టలక్ష్మి కుబేర యంత్రం, బూజులకర్ర, నీమొహం, జాంపండూ!, వక్కపలుకు, ఇలా ఎన్నో కామెడీ కథలు కూడా రాసాను.
8. మీరు కథలల్లో సమస్యల గురించి చెప్పారు కాని ఎక్కడా చిన్న పరిష్కారము చెప్పలేదే :)
8. రుద్రాక్ష, నా చేతివంట - అందమైన చిట్కాలు, నటనాలయం, ఇలా కొన్ని కొన్ని కథల్లో పరిష్కారాలు వున్నాయే? చాలామంది అన్నారు కూడా, మీ కథల్లో పరిష్కార మార్గాలుంటాయని. కొన్ని పరిష్కారాలు చెప్పటం అంటే, ఈ సమాజం అందరి బాధ్యత. ప్రపంచదేశాలన్నింటిలో మన భారతదేశం చాలా గొప్ప ఆధ్యాత్మికత ఉన్న దేశం. యాగభూమి, యోగభూమి.
ఖండ ఖండాంతరాలలో ఖ్యాతి గొన్న భరతఖండమిది
జగజగాల చరితపుటలలో పసిడివన్నెనొంది యున్నది
ఈ ధరణి పుణ్యచారిణి, గీతార్థ సారా బోధిని
ఇచ్చోట జన్మనొందుట ఇది యెంతో పుణ్యఫలమట ||
తలిదండ్రులకు, గురువులకు, దైవానికి నమస్కారం చేస్తాం. అతిథులను, అభ్యాగతులను ఆదరిస్తాం. ఎన్నో యాగాలు, యజ్జాలు, పూజలు, దానధర్మాలు, ఎన్నో పుణ్యకార్యాలు చేసే భారతదేశం మనది. ప్రపంచదేశాలకి నుదుట సింధూరం వంటిది మన దేశం. ఈ భారతదేశంలో జన్మించడం పూర్వజన్మ పుణ్యఫలం. స్త్రీలను దేవతలుగా పూజించే ఈ దేశం ఈనాడు అవినీతిమయం, అక్రమాలనిలయంగా మారుతుంటే ఎవ్వరూ ఏమీ చెయ్యలేకపోతున్నారు.
ఈ దేశంలో ఎన్నో అరాచకాలు తగ్గాలంటే ముగ్గురి చేతుల్లో వుంది. ప్రభుత్వయంత్రాంగం, పోలీసు యంత్రాంగం, టి.వి.లు, సినిమాలు. నేరస్తులకి కఠిన శిక్షలు వెయ్యాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ప్రభుత్వం చెప్పు చేతల్లోనే పోలీసు యంత్రాంగమూ వుంటుంది. అందుకని పోలీసు యంత్రాంగం కూడా దేశంలో అన్యాయాలు, అక్రమాలు, అత్యాచారాలు జరగకుండా చూడాలి. ఇక టి.వి.లు, సినిమాల నుంచే మంచి చెడులు నేర్చుకునేది. ఫేషన్ పేరుతో అసభ్య వస్త్రధారణ చేసేది సినిమాల్లో నటీమణులు, టి.వి.ల్లో యాంకర్లు. వాళ్ళు డబ్బుకోసం నటించినా, ఎలాంటి వస్త్రధారణ చేసినా, ఆ ప్రభావం కాలేజి అమ్మాయిల మీద, ఇంకా ఎందరో స్త్రీల మీద పడుతోంది. వాళ్ళు మారాలి. అప్పుడే ఈ దేశం బాగుపడుతుంది. కథలలో పరిష్కారం అన్నారే, అదీ వీళ్ళవల్లే సాధ్యపడుతుందని చెప్పటానికే ఇదంతా చెప్పా. అది మన చేతుల్లో, రాతల్లో లేదు.
9."మీరు పాడతా తీయగా " టి.వి ప్రొగ్రాం గురించి రెండుమూడు చోట్ల చెప్పారు. పైగా ఇంతకు ముందు ప్రశ్న,జవాబు లో "ఈ దేశంలో ఎన్నో అరాచకాలు తగ్గాలంటే ముగ్గురి చేతుల్లో వుంది. ప్రభుత్వయంత్రాంగం, పోలీసు యంత్రాంగం, టి.వి.లు, సినిమాలు" అనారు,అంటే , అవి ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు?
పాడుతా తీయగా అని వదిలేసారు అంటే .....
అందరికీ తెలిసున్నదే. ఇప్పుడొచ్చే సీరియల్సు గాని, జబర్దస్త్ ప్రోగ్రాంలు గాని హాస్యం పేరుతో అపహాస్యం చేస్తున్నారు. హాస్యమంటే వల్గర్ డైలాగులా? టి.వి. బాత్ రూమ్ గాను, బెడ్ రూమ్ గాను ఉపయోగించేస్తున్నారు. ఎన్నో లక్షలు పోసి కొనుక్కున్న టి.వి.లో హాల్లో అందరూ సరదాగా కూచుని మనకిష్టం లేని సీరియల్సు, వెకిలి నవ్వుల ప్రోగ్రాంలు చూడటానికా? సీరియల్స్ లో స్త్రీలు పట్టుచీరలు కట్టి, ఇన్ని నగలు దిగేసుకుని రాక్షసంగా నటిస్తున్నారు. హింసాత్మక సీరియల్సు చూసి సమాజంలోనూ ఆదేమాదిరిగా తయారై ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. నటించిన వాళ్ళు బాగానే వుంటారు. డబ్బులు బాగా సంపాదిస్తున్నారు. దానివల్ల సమాజం మీద చెడు ప్రభావం పడుతోంది. ఏమన్నా అంటే, టి.వి. కట్టేసుకోండి, చూడకండి అంటారు. లేక, మీరు చూస్తున్నారు, అందుకే మేము తీస్తున్నాము అంటారు. ఇప్పుడు చిన్నపిల్లల చేత కూడా పెద్దతరహా పాత్రలిచ్చి నటింపచేస్తున్నారు. ఇది ఆ చిన్నారులకంత అవసరమా? ఇలా వుంటే ముందర ముందర దేశం ఇంకా అధ్వాన్నస్థితికి చేరుతుంది కదా? వ్యాపార ప్రకటనల వల్ల టి.వి.లకి బోలెడు డబ్బులొస్తాయి. దీన్ని అరికట్టే ప్రయత్నాలు మధ్యతరగతి వాళ్ళు చేద్దామన్నా ఎవరి చేతుల్లోను లేదు. డబ్బులోస్తూంటే ఎన్ని అడ్డదారులైనా సరే తొక్కుతారు. సమాజ బాగోగులు ఎవరికీ పట్టవు.
గంజాయి వనంలో తులసి మొక్కలా ఒక్క పాడుతా తీయగా ప్రోగ్రాం మాత్రం బాగుంటుంది. భక్తి, శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానెల్స్ లో స్తోత్రాలు, ధర్మసందేహాలు, చాగంటి, సామవేదం వార్ల ప్రవచనాలు వస్తున్నాయి. కాని వాళ్ళ ప్రవచనాలైనా మనవంటి వాళ్ళు మాత్రమే వింటాం. అన్నివర్గాల వాళ్ళూ చూడరు. అందుకని వాళ్ళు చెప్పే మంచిమాటలు ఎంతమందికి చేరతాయి? ఎంతమంది మారతారు? అందుకే టి.వి.లో అన్ని ఛానెల్స్ మంచి కార్యక్రమాలను మాత్రమే ప్రసారం చెయ్యాలి. హింసను ప్రేరేపించే సీరియల్సు, సినిమాలు ప్రసారం చేయకూడదు. యాంకర్లు అసభ్య వస్త్రధారణ చేస్తున్నారు. వాటిని అరికట్టాలి. అన్నీ ఛానెల్స్ లో మంచి లలితగీతాలు, కర్ణాటక సంగీతం ప్రసారం చెయ్యాలి.
10.ఈ మధ్య వాట్స్ అప్ లల్లో కొంత మది రచనలు రచయత పేరు లేకుండా వస్తున్నాయి.మీదీ ఓ రచన వచ్చిందని విన్నట్లు గుర్తు.ఇది ఆపలేమా ?
10. వాట్సప్ లో కాదు, నా కథ ఆస్ట్రేలియాలో చౌర్యానికి గురయింది. అది పైన వివరించాను.
మీకు ధన్యవాదాలు మాల గారు. నమస్కారం.
శ్రీదేవిగారు చాలా ఓపికగా సమాధానాలు ఇచ్చారు.మీ కథల గురించి వివరించారు. కథలు వ్రాయటము అంటే టైం పాస్ కోసము కాదు ,దానికో అర్ధం ఉండాలి అన్నారు.అది రచయతల బాధ్యత అని చెప్పారు.నిజమేనండి.మీరు అంత నిబద్దతతో రాసారు కాబట్టే మీకథలు చదివి వదిలేయక ఆలోచించేట్లుగా ఉన్నాయి.మీరు మరిన్ని మంచి మంచి కథలు,సమాజానికి ఉపయోగపడేట్లుగా వ్రాయాలి అని కోరుకుంటున్నాను.మాకోసం మీ సమయాన్నీ వెచ్చించినందుకు ధన్యవాదాలండి.
శ్రీదేవిగారి ఇంటర్వ్యూ చదివాక వెంటనే "బియ్యం లో రాళ్ళు"చదవాలనిపిస్తొంది కదూ :) ఇంకెందుకు ఆలశ్యం కొనేసి చదివేయండి.అన్ని పుస్తకాల షాప్ లల్లోనూ దొరుకుతుంది.ధర180rs మాత్రమే.చదివి మీ అభిప్రాయం రచయిత్రికి తెలపటము మర్చిపోవద్దు.
పెయ్యేటి శ్రీదేవి గారి ఫోన్ నంబర్; 23042400.
మీ
మాల కుమార్