pratilipi-logo ప్రతిలిపి
తెలుగు
వారణాసి నాగలక్ష్మి
16 జనవరి 2018

వేకువ పాట

రచయిత్రి; వారణాసి నాగలక్ష్మి

" తొలి సంధ్య వేళలో తొలి పొద్దు పొడుపులో తెలవారే తూరుపులో వినిపించే రాగం భూపాలం, ఎగిరొచ్చే కెరటం సింధూరం " "వేకువ పాట " కథాసంపుటి తీయగానే నా మదిలో మెదిలిన పాట ఇది. సదా పెదవులపై నర్తించే చిరునవ్వు, చూడగానే ఆప్యాయముగా పలకరించే స్నేహశీలి "వారణాసి నాగలక్ష్మి" ని తలుచుకుంటూ పుస్తకము తెరిచాను.ఆమె లాగే కథలన్నీ చాలా మృదువుగా పలకరించాయి. ఎక్కడా ఆగ కుండా ఏకబిగిన కథలన్నీ చదివేసాను.కథలన్నిటిలోనూ సున్నితముగా సమకాలీన సమస్యలను సృజించారు.అలా అని ఆ సమస్యల గురించి , వాటి పరిష్కారం ఎలా అనీ సుదీర్ఘమైన చర్చలు లేవు.ఎయిడ్స్ గురించి శుభరాత్రి లో, పుట్టింటి గురించి , అత్తకోడళ్ళ మధ్య ఏర్పడాల్సిన అనుబంధం గురించి, మామ్మ , తాతల తో మనవల అనుభంధం గురించి , ఈ కాలము లో ఎక్కువ అవుతున్న ఎల్క్ట్రానిక్స్ వాడకము గురించి ,డ్రగ్స్ గురించి ఇలా ఒకటేమిటి అన్ని సమస్యలనూ సున్నితముగా కథలల్లో ,కథగా కలిపి అలవోకగా చెప్పేసారు. అమ్మానాన్న ఓ అబ్బాయి లోని సమస్యను కొత్త కోణము లో చూపించారు.ఏ కథ కు ఆ కథే ప్రత్యేకము గా ఉంది. సున్నితమైన శైలి ,ఏ ఆర్భాటమూ లేని తీరు ,కుటంబ నేపధ్యము లో సాగిన కథలు ఆహ్లాదముగా ఉండి , చదివిస్తాయి.

ఇంత మంచి కథలను అందించిన సకలకళాశోభితురాలు వారణాసి నాగలక్ష్మి గారిని కూడా పలకరిద్దామా :)

వారణాశి నాగలక్ష్మి గారు నమస్కారమండి.

మీ "వేకువపాట" చదివానండి.అందులోని కథలు నాకు చాలా నచ్చాయి. చాలా రోజుల తరువాత ఏకబిగిన , వదలకుండా చదివింది మీ పుస్తకమేనండి. ఈ నెల విహంగ అంతర్జాలమాస పత్రిక లో మీ వేకువపాటను పరిచయము చేద్దామనుకుంటున్నాను. పుస్తక పరిచయము తోపాటు మిమ్మలినీ పరిచయము చేయాలని మీ తలుపుతట్టాను.

నమస్కారం మాల గారు!

1. మీ కథలన్నీ ఏదో ఒక సమస్యను తీసుకొని రాసారు. అంటే మీరు సమాజాన్ని అంత నిశితంగా పరిశీలిస్తారని అనుకుంటున్నాను. ఏదైనా సమస్య కనిపించగానే దాని గురించి కథ రాయాలి అని అనిపిస్తుందా? లేక కథ రాయాలనుకున్నపుడు ఏదైనా సమస్య తీసుకొని రాద్దాము అనుకుంటారా?

జ. అవును. నాలో ఒక భాగం ఎప్పుడూ సమాజాన్ని పరిశీలిస్తూ ఉంటుంది. సమస్యలు ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా మనుషుల స్పందనలో మార్పువల్ల పరిష్కారం కాగల సమస్యలు నా దృష్టికి వచ్చినపుడు, కథగా రాయమని అవి నా వెంటపడతాయి. ఆ కథని రాశాక గాని నాకు స్థిమితం చిక్కదు. కథ రాయాలి కనుక ఒక ఇతివృత్తాన్ని ఎన్నుకున్న సందర్భాలు తక్కువ. అందుకే చాలా తక్కువ కథలు రాశాను.

2. మీ కథలు చదివి మీరు కౌన్సిలింగ్ చేస్తారా అని అనుకున్నాను. మీ చుట్టుపక్కల కాని, మీ కుటుంబంలో కాని, మీకు తెలిసినవారిలో కాని ఏదైనా సమస్య వచ్చింది అని మీకు తెలిస్తే దానిని పరిష్కరించేందుకు, వారికి సలహాలిచ్చేందుకు మీ అంతట మీరు ప్రయత్నం చేస్తారా ?

2. మా కుటుంబాల్లో సమస్యలు వచ్చినపుడు కొంతమంది వాళ్లంతట వాళ్లు వచ్చి అడిగిన సందర్భాలలో కౌన్సిలింగ్ చేయడం, అది చాలా బాగా పనిచేయడం, వాళ్లు నా పట్ల చాలా అభిమానం, ఆత్మీయత పెంచుకోవడం జరిగింది. కొన్నిసార్లు అవసరమైనపుడు సహాయం అందుకున్నవాళ్లు, అలా అందుకోవలసి వచ్చినందుకు చిన్నతనమో మరోటో కలిగి దూరమవడమూ జరిగింది. రెండిటినీ ఒక లాగే తీసుకోగల దృక్పథాన్ని పెంపొందించుకున్నాను. సాయం అవసరమైన చోట స్వచ్ఛందంగా సహాయపడే మనస్తత్వం నాది. అయితే అడగకుండా ఇచ్చే సలహాకి, చేసే సహాయానికి విలువ ఉండదని అనుభవంద్వారా తెలుసుకున్నాను. ఇప్పుడైతే నా అంతట నేను కల్పించుకుని సలహాలు ఇవ్వను, కుటుంబ సభ్యులైతే తప్ప. తెలిసి తెలిసి నిర్లక్ష్యం చెయ్యలేని పరిస్థితిలో అడగకపోయినా సాయం చేసినపుడు, కృతజ్ఞత నిండిన ఒక చూపుని కూడా ఆశించను. సామాజిక సేవ విషయం వేరు.

3. మీ నాయిక రెండు మూడు కథల్లో తన భర్తకు సంగీత సాహిత్యాల్లో అభిరుచి ఉంటే బాగుంటుంది అనుకుంటుంది. అంటే మీకు వాటిల్లో అభిరుచి ఉన్నదని అనుకుంటున్నాను. ఆ అభిరుచి మీకు ఎలా వచ్చింది ?

3. సంగీతంలో అభిరుచి అత్యంత సహజమైనది. దాన్ని కోల్పోవడమే అసహజమని నేననుకుంటాను. ప్రణవనాదం నుంచే సృష్టి జనించింది కదా. శిశుర్వేత్తి పశుర్వేత్తి అన్న నానుడి విన్నదే. పొలాల మధ్య పెరిగిన నాకు ప్రకృతి అంతటా సంగీతమే వినిపిస్తుంది. అయితే అది శాస్త్రీయ సంగీతం కాదు. శబ్ద ప్రధానమైనది, భావ ప్రధానమైనది. ఇక సాహిత్యంలో అభిరుచి మాత్రం చుట్టుపక్కల ఎవరూ లేని వనవాసం వల్ల వచ్చిందనుకుంటున్నాను. నాన్నగారు రైతు. పొలాల మధ్య ఒంటరి ఇంట్లో కేవలం మా కుటుంబం ఒక్కటే నివాసముండేది - మా తాతగారు, మామ్మ, అమ్మ, నాన్నగారూ, పిల్లలం నలుగురం అంతే. మూడు వైపులా రెండు కిలోమీటర్ల దూరంలో చిన్న పల్లెలు, ఆరు కిలోమీటర్ల దూరంలో నూజివీడు అనే టౌన్ ఉండేవి. ఎటు చూసినా పొలాలూ, అడవీ. వేసవిలో మాత్రం బంధువులు ముప్ఫైమందిదాకా మాతోటకి వచ్చేవారు- పెద్దలూ పిల్లలూ, సెలవులు గడపడం కోసం. మా అమ్మ కోసం ఒక వారపత్రిక, ఒక మాస పత్రిక, మా కోసం చందమామ- పోస్ట్ లో తెప్పించేవారు నాన్నగారు. అమ్మ తీరిక చిక్కని పనుల్లో ఉన్నా పుస్తకం కోసం తహ తహ లాడడం చూసి అందులో ఏదో ఆసక్తికరమైనది ఉండి ఉండాలనుకుని, అదేమిటో తెలుసుకోవాలని పుస్తకపఠనం మొదలుపెట్టాను. ఇంట్లో ఏ పుస్తకం కనిపిస్తే అది చదివేసేదాన్ని. ఇప్పట్లా టీవీ, కంప్యూటర్ లేకపోవడంవల్ల పుస్తకమే నేస్తమయింది. అలా చదువుతూ ఉన్నపుడే నాకూ రాయాలన్న కోరిక కలిగి, పాటలూ కథలూ రాయడం మొదలుపెట్టాను. ‘మా తాతగారికి ఉందొక తోట- ఆ తోట గురించి రాయనా ఒక పాట?’ అంటూ ఎనిమిదేళ్ల వయసులో ఒక పాట రాశాను. అది చదివి ఇంట్లో అంతా నవ్వుకున్నారు. మెరక పొలాల వ్యవసాయంవల్ల ఎన్నో ఆర్ధిక ఇబ్బందులుండేవి. అయినా, చుట్టూ ప్రకృతి సౌందర్యం వల్ల మనసెపుడూ ఆనందంగా ఉండేది. ’ఇదే ఇదేలే నాకు చాలును-దీన్ని మించి నేనేమి కోరను- ఈ ప్రకృతిలో నేనొక్క భాగము- దీన్ని మించి నేనేమి కోరను’ అన్న పాట పదమూడేళ్లపుడు రాశాను. నాన్నగారు పిల్లలందర్నీరోజూ డైరీ రాయమనేవారు. మిగిలిన ముగ్గురూ రాయకపోయినా నేను మాత్రం క్రమం తప్పకుండా రాసేదాన్ని. అందువల్ల కథలు రాయడం తేలికయిందనుకుంటాను. ఇదేకాక, బడినించీ రెండుసార్లు విహార యాత్రలకి వెళ్లాం. అపుడు చూసినవన్నీ వివరంగా ఒక పుస్తకంలో రాయడం, వెనక్కి వచ్చాక విహారయాత్ర వివరాలన్నీ మాట్లాడమని హెడ్ మాష్టరు పి. ఎస్.మూర్తిగారు అడగడం, అలా మాట్లాడ్డానికి ఆ పుస్తకాలు ఉపయోగపడడం, అప్పటి నా ఉపన్యాసానికి మంచి స్పందన లభించడం- వీటన్నిటివల్ల కూడా ఇంకా రాయాలనే కోరిక పెరిగింది.

4. మీకు రచనలల్లోనే కాకుండా ఇంకా వేరే కళల్లో కూడా ప్రవేశముందా? ఎక్కడైనా నేర్చుకున్నారా? లేక మీకు స్వతహా వచ్చాయా?

జ. నాకు జ్ఞానం వచ్చేసరికే చిత్రలేఖనంలో అభిరుచి ఏర్పడింది. ఎప్పుడూ బొమ్మలు గీస్తూ ఉండేదాన్ని. ఇంట్లో నేలమీద కూర్చుని భోజనాలు చేసేవాళ్లం. వడ్డన ఆలస్యమైతే ఎడమచేతి చూపుడు వేలు నీటిలో ముంచి, ముదురు గచ్చకాయ రంగులో ఉన్న సిమెంటు గచ్చు మీద రకరకాల బొమ్మలు వేస్తూ ఉండేదాన్ని. చిత్రకళలో పోటీలున్నపుడు బడిలో ఎప్పుడూ నాదే ప్రథమ స్థానం. నవరంగ్ చిత్రకళా నికేతన్ వారు నిర్వహించిన జాతీయస్థాయి పోటీల్లో బహుమతి లభించింది. తర్వాత కళాశాలలోనూ, సెంట్రల్ యూనివర్సిటీలోనూ కూడా నా చిత్రాలకి ప్రథమ బహుమతులు లభించాయి. అలాగే అంతర్జాతీయంగా కూడా ఒక పోటీలో నా చిత్రం ఎంపికై, లండన్లోని ‘Royal College of Arts’ లో ప్రదర్శించబడింది. చిత్రలేఖనం ఎక్కడా నేర్చుకోలేదు గాని కిందటేడు భాగ్యనగరంలోనే మసాబ్ టాంక్ దగ్గరున్న జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనార్ట్స్ విశ్వ విద్యాలయం( JNAFAU)లో సరదాకొద్దీ ఒక సర్టిఫికెట్ కోర్స్ చేశాను. మా ఊరు నూజివీడు వీణలకి ప్రసిద్ధి. చూపులకి వీణ ఎంతో అందంగా ఉంటుంది. అలా దాని రూపం మీద ఇష్టం కొద్దీ కొంతా, ఆ నాదమాధుర్యానికి ఆకర్షితురాలనై కొంతా వీణ కళాశాలలో చేరి రెండేళ్ల పాటు నేర్చుకున్నాను. అందువల్ల శాస్త్రీయ సంగీతంలో ప్రావీణ్యత రాలేదు కాని, పరిచయం కలిగింది. కుట్టుపనిలో కూడా ఆసక్తి ఉండేది. నా బట్టలన్నీ నేనే కుట్టుకునేదాన్ని. పిల్లలు పుట్టాక పాప గౌన్లూ, పరికిణీలూ, మా అబ్బాయి షర్టులూ పాంట్లతో సహా అన్నీ కుట్టేదాన్ని. వాటికి తగిన ఎంబ్రాయిడరీ చేసేదాన్ని. పిల్లలు పెద్దవాళ్లయేవరకు వాళ్ల సంరక్షణ, శిక్షణే నా జీవితం అన్నట్టు గడిపానంటే అతిశయోక్తి కాదు. అందువల్ల ఆ సమయంలో నా రచనా వ్యాసంగం దాదాపు ఆగిపోయిందనే చెప్పాలి.

5. మీకు వచ్చిన విద్యలు మీరు ఎవరికైనా నేర్పించారా ?

జ. పిల్లలు ఎనిమిదో తరగతికి వచ్చేదాకా వాళ్లకి చదువు చెపుతూ చుట్టుపక్కల పిల్లలకీ ఉచితంగా పాఠాలు చెప్పేదాన్ని. సెలవుల్లో పిల్లలు సరిగా మాట వినరు. అందువల్ల వాళ్లతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాను. సెలవులున్నన్నాళ్లూ రోజూ పన్నెండు దాకా చదువుకోవాలి. అలా అయితే తర్వాత ఎంతసేపు ఆడుకున్నా నేను వాళ్ల జోలికి రాను అని ☺. వాళ్ల స్నేహితులు కూడా వస్తూ ఉండడంతో పిల్లలు ఎక్కువ గొడవ చెయ్యకుండా చదువుకి వచ్చేవారు. చదువు అంటే క్లాసు పుస్తకాలే కాదు. ఏదో ఒక సబ్జక్టు లేదా భాష గురించి తెలుసుకోవడం, నేర్చుకోవడం. ఒకళ్ల పట్ల ఒకళ్ళకున్న అభిప్రాయాలు, వాళ్ల దృష్టిలో పక్కవాళ్లకున్న సద్గుణాలు, దుర్గుణాలు రాయమనేదాన్ని. చివరికి అవి చదివి వినిపించేదాన్ని. పిల్లలు కదా, విని కొద్దో గొప్పో మారడానికీ, తమకున్నమంచి అలవాట్లని నిలుపుకోవడానికీ, అంతా మెచ్చుకున్న సద్గుణాలని అలవాటు చేసుకోవడానికీ ప్రయత్నించేవారు. అలాగే విష్ణు సహస్రం, ఇంకా కొన్ని శ్లోకాలు పిల్లలందరికీ కలిపి నేర్పించేదాన్ని. అందువల్ల అందరికీ ఉచ్ఛారణ మెరుగుపడింది. మా ఇంట్లో పనిమనిషి పిల్లలకీ, చుట్టుపక్కలవాళ్ల డ్రైవర్లకీ కూడా తెలుగు, లెక్కలూ చెప్పేదాన్ని. ఇక చిత్రలేఖనం ఎప్పుడూ నేర్పిస్తూనే ఉన్నాను. యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు కూడా, కాంపస్ లో ఉన్న ఒక ప్రొఫెసర్ గారి పిల్లలకి నేర్పేదాన్ని. గత ఆరేళ్లుగా ‘రంగ్-రేఖ’ పేర ఇంకొంచెం క్రమపద్ధతిలో చిత్రలేఖనం తరగతులు నిర్వహిస్తున్నాను.

6. మీరు కథలు మటుకే రాసారా? నవలలు, కవితలు ఇంకే ప్రక్రియలోనైనా రచనలు చేసారా?

జ. కథలు, పాటలు, కవితలు అన్నీ కలగలుపుగా రాస్తూ ఉన్నాను. నా మొదటి పుస్తకం వంద పాటలున్న ‘వాన చినుకులు’ గ్రంథం. వ్యాసాలు కూడా యాభైదాకా రాశాను గాని, అవి ఏదైనా పత్రిక వాళ్లు అడిగితేనే రాశాను. ఆకాశవాణిలో టాక్స్, అయుర్వేదం మీద ఒక నాటిక కూడా AIR వారు అడిగితే రాయడం జరిగింది. మన ప్రధాని నరేంద్రమోడీగారి కవిత్వాన్ని ఆంగ్లం నుంచి తెలుగుకి మరో రచయిత్రితో కలిసి అనువదించాను. అలాగే ఇపుడు ఇంకో పుస్తకాన్నిఅనువాదం చేస్తున్నాను, ఆంగ్లం నుంచి తెలుగులోకి. నవల ఇంతవరకు రాయలేదు.

7. మీ రచనలల్లో మీకు చాలా ఇష్టమైనది ఏమిటి?

జ. ఏదో ఒక్కటి అంటే చెప్పలేను గాని ‘వారధి, ఆసరా, అమృతాన్ని సాధించు, చిన్నబోదా చిన్ని ప్రాణం, అమ్మా నాన్నా ఓ కాలేజీ అబ్బాయి’ ఇప్పటివరకూ రాసిన వాటిల్లో నాకు ఎక్కువ సంతృప్తినిచ్చినవి.

8. మీ రచనలకి వచ్చిన స్పందన ఎలాంటిది? దాని వల్ల మీకు ప్రోత్సాహం గాని, నిరుత్సాహం గాని కలిగిందా?

జ. మొట్టమొదట అచ్చయిన నాకథ ‘ఆరోజు మళ్లీ వస్తే’ పదిహేడేళ్ల వయసులో రాశాను. అపుడు ఇంటర్మీడియెట్ లో ఉన్నాను. దానికి యమ్వీయల్ గారి మెప్పు దొరకడంతో ఉత్సాహం కలిగింది. తర్వాత ‘ఆసరా’ కథ చదివి కారా మాష్టారు ఫోన్ చేయడం, ఎనభై మూడేళ్ల వయసులో నన్ను వెతుక్కుంటూ మా ఇంటికి రావడం మరిచిపోలేని జ్ఞాపకం. ‘ఆలంబన’ కథ చదివి ఒక ప్రముఖుడు ఒక అనాధని దత్తత తీసుకోవడం, ఇంటర్నెట్ సమస్యల మీద  వచ్చిన మొట్టమొదటి తెలుగుకథగా పేరుపొందిన ‘ఆసరా’ కథ(2005)ని చదివి, విజ్ఞాన్ సంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పాతూరి కోటేశ్వరరావుగారు, తమ విజ్ఞాన్ సంస్థలన్నిటిలో ఈ కథని చదవడం తప్పనిసరి చేస్తానని లేఖ రాయడం, ‘సరళీస్వరాలు’ కథ చదివి ఒక పెద్ద వ్యాపారవేత్త తన వ్యాపార విస్తరణ నిర్ణయాన్ని మార్చుకున్నానని ఫోన్ చేయడం, ‘వారధి’ కథ చదివి ఒక ప్రముఖ రచయిత్రి తను కూరుకుపోయిన నిరాశనించి బయటికి రావడం, ‘చిన్నబోదా చిన్నిప్రాణం’ చదివి ఒక యువతి అబార్షన్ ఆలోచన విరమించుకోవడం నాకు దొరికిన కొన్ని ప్రోత్సాహాలు.

9. మీరు మీ ఇంటినీ మీ అభిరుచులనూ ఎలా బాలెన్స్ చేస్తారు?

జ. చాలామందికి లాగే నాకూ మొదటి ప్రాధాన్యం కుటుంబమే. ముఖ్యంగా పిల్లలు ఇంటర్మీడియెట్ పూర్తయేవరకు నేను పూర్తిగా కుటుంబం కేంద్రంగానే ఆలోచించేదాన్ని. పిల్లల చదువు, అరోగ్యం, వ్యక్తిత్వ నిర్మాణం చుట్టూనే నా ఆలోచనలు తిరిగేవి. పాపకి కర్ణాటక సంగీతంలోనూ, లలిత సంగీతంలోనూ కొంత అభిరుచి కనపరచడంతో మూడేళ్ల వయసు నించే సంగీతం క్లాసులకి తీసుకెళ్లేదాన్ని. ఇవన్నీ అయ్యాక ఖాళీ సమయం దొరికితేనే పుస్తకాలు చదవడం, బొమ్మలేయడం, రాయడం చేసేదాన్ని. ఇప్పుడు పిల్లలిద్దరూ పెద్దవాళ్లయారు గనక నా అభిరుచులకి తగినంత సమయం దొరుకుతోంది. అయితే ఎప్పుడూ కూడా సమయాన్ని వృధా చెయ్యడం అలవాటులేదు. టీవీ సీరియల్సూ, ప్రోగ్రాములూ బాగాలేవని తిట్టుకుంటూ వాటినే చూసేవాళ్లని చూస్తే నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. నేననేది ఇంకేపనీ చెయ్యలేని వృద్ధుల విషయం కాదు. క్రమపద్ధతిలో పని చేసుకుంటూ పోతాను గనుక ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతాను.

10. అంతర్జాల పత్రికల గురించి మీ అభిప్రాయం ఏమిటి?

జ. సదభిప్రాయమే. పత్రికలు దొరకడంలేదనే బాధలేకుండా, ప్రపంచంలో ఏమూలనున్నవారికైనా ఎన్నో మంచి మంచి అంతర్జాల తెలుగు పత్రికలు అందుబాటులో ఉండడం హర్షదాయకమైన విషయం. రచయితలకి కూడా వాళ్ల రచనల ప్రచురణ తేలిగ్గా, త్వరగా జరిగిపోతోంది. వీటిని కొనుక్కోనక్కరలేదు. అలాగే రచయితలకి పారితోషికమూ ఉండదు. వీటిని ఒకే వ్యక్తో, ఒక చిన్న సమూహం ఉమ్మడిగానో, తమ పరిమితమైన తీరిక సమయాన్ని వెచ్చించి, నిర్వహిస్తూ ఉండడాన్ని చూస్తే వారి సాహిత్యాభిలాషకి నమస్కారం చెయ్యాలనిపిస్తుంది. అయితే ఒక విమర్శకూడా ఉంది, రచనల స్థాయి అన్నివేళలా అంత ఉన్నతంగా ఉండడం లేదని. అచ్చుపత్రికల్లో కూడా అన్నిరచనలూ గొప్పగా ఉండవు. అయితే అచ్చుపత్రిక నిర్వహణలో ఉన్న ఆర్ధికాంశం ఇక్కడ లేకపోవడం వల్ల, సంపాదకుల వ్యక్తిగతమైన ఎంపికకే పూర్తి ప్రాధాన్యత లభిస్తోందని చెప్పచ్చు. అశ్లీలతని అభ్యుదయ సాహిత్యంగా చలామణీ చేసిన సందర్భాలూ లేకపోలేదనుకోండి. కానీ అది అరుదు.

11. చివరగా ఒక వ్యక్తిగతమైన ప్రశ్న. మీ కుటుంబం గురించి చెప్పగలరా :)

జ. నా భర్త వి.ఎస్. శర్మగారు హెడ్ అండ్ నెక్ కాన్సర్ సర్జన్. ENT స్పెషలిస్ట్. బెంగుళూరులో కిద్వాయ్ కాన్సర్ అసుపత్రిలోనూ, ఎమ్మెస్ రామయ్యా ఆసుపత్రిలోనూ కొన్నేళ్లు పనిచేసి భాగ్యనగరానికి వచ్చారు. మెడిసిటీ వైద్య కళాశాలలో MBBS, MS విద్యార్ధులకి పాఠాలు చెపుతారు. సెంట్ థెరెసాలో వైద్యుడుగా పనిచేస్తున్నారు. పిల్లలిద్దరు. అబ్బాయి ప్రస్తుతం ISBలో MBA చేస్తున్నాడు. అమ్మాయి M.Arch. కోసం విదేశాలకి వెళ్లే ప్రయత్నంలో ఉంది.

మీ విలువైన సమయాన్ని నాకోసము కేటాయించినందుకు ధన్యవాదాలండి.

మంచి ప్రశ్నలు అడిగారు. మీకు నా అభినందనలు.   

 

ఈ పుస్తకము అన్ని పుస్తకాల షాప్స్ లల్లొ దొరుకుతుంది .ధర ; 150rs/

మీ 

మాల కుమార్