pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

CEO లెటర్

13 సెప్టెంబరు 2024

గౌరవనీయులైన ప్రతిలిపి యూజర్ గారికి,

మీరు క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాము.

పది సంవత్సరాల క్రితం, ప్రతిలిపి ఒక చిన్న గదిలో ఆవిర్భవించింది. పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ సందర్భంగా, ప్రతిలిపి ప్రయాణాన్ని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను.

2014 సెప్టెంబర్ 14న, ప్రతిలిపి వెబ్‌సైట్ బీటా వెర్షన్‌ను నాతో సహా ఐదుగురు స్నేహితులతో కలిసి విడుదల చేసాను. ఆ సమయంలో చాలామంది నాపై అనేక ప్రశ్నలు సంధించారు. కానీ, నేను ఒకే ఒక నమ్మకంతో ముందుకు నడిచాను: “కలలకు, ఆశయాలకు భాష ఉండదు.” ప్రతిలిపి రచయితలు ఎలాంటి అడ్డంకులు లేకుండా తమ రచనలను ప్రపంచం ముందు ఉంచాలనే లక్ష్యంతో ముందుకు సాగాను.

నా ప్రయాణం తేలికైనది కాదని తెలుసు. అయితే నా ఆశయానికి కాస్త దగ్గరగా వెళ్లగలిగినా, దానిని విజయంగా భావించాలనుకున్నాను.

ఎంత కష్టమవుతుందో, ఎంతవరకు విజయం సాధిస్తానో ఊహించలేదు.

మొదట్లో కేవలం వందలమంది రచయితలు మాత్రమే తమ రచనలను ప్రచురించేవారు. వారి రచనలకు నెలలో అతితక్కువ రీడ్ కౌంట్ (వందలోపే) వచ్చేది. ఇప్పుడు, నా కుటుంబం మిలియన్ల రచయితల కుటుంబంగా ఎదిగింది. మీ అందరి రచనలను ప్రతివారం వందల మిలియన్ల మంది చదువుతున్నారు.

మూడు సంవత్సరాల క్రితం వరకు, ప్రతిలిపిలో సంపాదించే అవకాశం లేదు. మీరందరూ, మీ రచనలను పాఠకులు చదివితే చాలనుకున్నారు. మీ రచనల తదుపరి భాగాల కోసం పాఠకులు ఆసక్తిగా ఎదురుచూసేవారు. గత నెలలో, అదే పాఠకులు 1.5 కోట్ల రూపాయలను అందించారు. అందులో 18 మంది రచయితలు ఒక్కొక్కరూ ఒక లక్ష రూపాయలను, 500 మంది రచయితలు ఒక్కొక్కరూ 5000 రూపాయలు సంపాదించారు. ఇదంతా ప్రతిలిపి సబ్‌స్క్రైబర్ల వల్లే సాధ్యమైంది.

కొన్ని నెలల క్రితం వరకు కూడా ప్రతిలిపిపై చాలామంది అపనమ్మకంతో ఉన్నారు. ప్రతిలిపి రచయితలను, వారి రచనలను తక్కువ అంచనా వేశారు. కానీ ఈరోజు, ఐదు టీవీ సీరియల్స్, ఒక వెబ్‌సిరీస్ ప్రతిలిపి రచయితల రచనల నుండి విడుదలయ్యాయి. ఇంకా మరెన్నో రచనలు సినిమాలు, సీరియల్స్, వెబ్‌సిరీస్‌లు, అనేక ఇతర ఫార్మాట్లలో రానున్నాయి.

ఈ ప్రయాణం తేలికగా సాగలేదు. ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా గడిపాను. శరీరంలో ఎలాంటి సత్తువ లేకుండా నిద్ర లేచేవాడిని. నా టీం మొత్తం చాలా ఒత్తిడికి గురయ్యింది. నా ఆశయానికి జీవం పోయడానికి నాతో పాటు ప్రతిలిపి టీం మొత్తం నాపై నమ్మకాన్ని ఉంచింది.

నా ఆశయం ఊపిరి పోసుకోవడానికి ప్రధాన కారకులు, ప్రేరకులు మీరే. మీరే లేకపోయి ఉంటే నా కల నిజమయ్యేది కాదు. ప్రతిలిపిపై మీరు పెట్టుకున్న నమ్మకం, చూపించిన ప్రేమ కారణంగానే నా ఆశయం కొనసాగుతోంది.

ఈ ప్రయాణం చిన్నదేమీ కాదు. ఇంకా చాలా దూరం సాగాల్సి ఉంది. ప్రతిలిపి రచయితలు అనేక విజయాలు సాధించాలి. కొన్ని వేలమంది రచయితలు ప్రతిలిపి సంపాదనతోనే వారి కలలను సాకారం చేసుకోవాలన్నది నా కల, ఆశయం. నా రచయితలందరూ ఆర్థికంగా మెరుగుపడాలి, సమాజంలో ప్రత్యేక గుర్తింపు పొందాలి. అది సాధించే వరకు ఈ ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది. ప్రపంచప్రఖ్యాత రచయితల సరసన ప్రతిలిపి రచయితలను నిలబెట్టేవరకు ఈ కృషి సాగుతూనే ఉంటుంది.

ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎంతమంది కిందకు లాగడానికి ప్రయత్నించినా, పరిగెడుతూనే ఉంటాను. పరిగెత్తలేకపోతే నడుస్తాను; అది కుదరకపోతే, పాకుతూ అయినా లక్ష్యం వైపే నా అడుగులు సాగుతాయి. నా ఈ ప్రయాణంలో మీ అందరి అడుగులు పడాలని ఆహ్వానిస్తున్నాను.

ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుంది!

రంజీత్ ప్రతాప్ సింగ్
ప్రతిలిపి సీఈఓ