దాశరథి కృష్ణమాచార్య 1925 జూలై 22న వరంగల్ జిల్లా గూడూరు గ్రామంలో జన్మించారు. బాల్యం ఖమ్మం జిల్లా మధిరలో గడిచింది. ఉర్దూలో మెట్రిక్యులేషను, భోపాల్ విశ్వవిద్యాలయం నుండి ఇంటర్మీడియెట్, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఆంగ్ల సాహిత్యంలో బియ్యే చదివారు. సంస్కృతం, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో అనర్గళంగా ప్రసంగించగల దిట్ట శ్రీ కృష్ణమాచార్య. చిన్నతనంలోనే అలవోకగా పద్యాలు రాసేవారు. తొలుత కమ్యూనిస్టు పార్టీలో క్రియాశీలకంగా పనిచేసినా, రెండో ప్రపంచయుద్ధం సమయంలో హైదరాబాదు సంస్థానంలో నిజాం అరాచకానికి వ్యతిరేకంగా పోారాడి ఉద్యమంలో తనదైన పాత్ర పోషించారు. ఉపాధ్యాయునిగా కూడా పనిచేశారు. కథలు, నాటికలు, కవితలు రాసిన ఆయన తర్వాత సినిమాలకు పాటలు కూడా రాశారు.
“రైతుదే తెలంగాణము రైతుదే.ముసలి నక్కకు రాచరికంబు దక్కునే అని ఎలుగెత్తి చాటిన దాశరథి -దగాకోరు బటాచోరు రజాకారు పోషకుడవు, దిగిపొమ్మని జగత్తంత నగారాలు కొడుతున్నది, దిగిపోవోయ్, తెగిపోవోయ్” అని నిజామును బహిరంగంగానే గద్దించాడు
ఆంధ్రమహాసభలో చురుకైన పాత్ర పోషించి నిజాం ప్రభుత్వం చేత జైలు శిక్ష కూడా అనుభవించారు కృష్ణమాచార్య. ఆ జైలులో పళ్ళు తోముకోవడానికిచ్చే బొగ్గుతో జైలు గోడల మీద కవితలు రాసి లాఠీ దెబ్బలు తిన్నాడు. ప్రజల్లో సాంస్కృతిక చైతన్యం కలిగించడమే ధ్యేయంగా ఆయన జీవితం గడిచింది. 1953లో తెలంగాణ రచయితల సంఘాన్ని స్థాపించిన ఘనత కూడా కృష్ణమాచార్యదే. మీర్జాగాలిబ్ ఉర్దూ గజళ్ళను తెలుగులోకి గాలిబ్ గీతాలు పేర అనువదించారు.
నిజాము అరాచకంపై దాశరథి చేసిన పోరాటానికి మచ్చుతునక ఆయన రాసిన ఈ కవిత
నిరంకుశ నిజాము పాలన గురించి..
ఓ నిజాము పిశాచమా, కానరాడు
నిన్ను బోలిన రాజు మాకెన్నడేని
తీగలను తెంపి అగ్నిలో దింపినావు
నా తెలంగాణ కోటి రతనాల వీణ
ఎముకల్ మసిచేసి పొలాలు దున్ని
భోషాణములన్ నవాబునకు
స్వర్ణము నింపిన రైతుదే
తెలంగాణము రైతుదే
ఆయన కలం నుండి జాలువారిన మరికొన్ని కవితలు
మా నిజాము రాజు/తరతరాల బూజు/పడతులమానాలు దోచి/ గుడగుడమని హుక్క త్రాగి/ జడియక కూర్చుండినావు/మడికట్టుక నిలిచినావు/ దగాకోరు బడాచోరు/ రజాకారు పోషకుడవు/ వూళ్ళకూళ్ళు అగ్గిపెట్టి/ తల్లిపిల్ల కడుపుకొట్టి/ నిక్కిన దుర్మార్గమంత/ నీ బాధ్యత నీ బాధ్యత/ ”కోటిన్నర” నోటివెంట/ పాటలుగా మాటలుగా/దిగిపొమ్మని, దిగిపొమ్మని/ ఇదే మాట అనేస్తాను/వద్దంటే గద్దె యెక్కి/పెద్దరికం చేస్తావా!/మూడుకోట్ల చేతులు నీ మేడను పడదోస్తాయి/ మేడను విడదీస్తాయి/నీకు నిలుచు హక్కులేదు/ నీ కింకా దిక్కులేదు …………..
నా తెలంగాణ కోటి రత్నాల వీణ
నా తెలంగాణ కోటి అందాల జాణ
నా తెలంగాణ వీర పరాక్రమ సేన
శ్రీ దాశరథి కలం నుండి జాలువారిన రచనలు
కవితా సంపుటాలు
అగ్నిధార
మహాంధ్రోదయం
రుద్రవీణ
మార్పు నా తీర్పు
ఆలోచనాలోచనాలు
ధ్వజమెత్తిన ప్రజ
కవితా పుష్పకం: ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం
తిమిరంతో సమరం: కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం