pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

పొట్టి శ్రీరాములుగారి వర్ధంతి

13 డిసెంబరు 2016

 

ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరాహారదీక్ష చేసి,ప్రాణాలర్పించి,అమరజీవి యైన మహాపురుషుడు,పొట్టి శ్రీరాములు,గారి వర్ధంతి నేడు ఆయనను స్మరించుకుంటు తన గురించి కొన్ని విషయాలు ప్రతిలిపి 
పాఠకుల కొరకు..!!

భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడైనవాడు.మహాత్మా గాంధీ బోధించిన సత్యము,అహింస,హరిజనోద్ధరణ అనే ఆశయాలకొరకు జీవితాంతం కృషిచేసిన మహనీయుడు.పొట్టి శ్రీరాములు గారు 1901 మార్చి 16న మద్రాసు,జార్జిటౌను, అణ్ణాపిళ్ళె వీధిలోని 165వ నంబరు ఇంటిలో గురవయ్య,మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించాడు.వారి పూర్వీకులది ప్రస్తుత శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లోని పడమటిపాలెం గ్రామం.ఇరవై యేళ్ళ వరకు శ్రీరాములు విద్యాభ్యాసం మద్రాసు లోనే జరిగింది.తరువాత బొంబాయిలో శానిటరీ ఇంజనీరింగు చదివాడు.తరువాత "గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వే"లో చేరి దాదాపు నాలుగేళ్ళు అక్కడ ఉద్యోగం చేసారు.

1928లో వారికి కలిగిన బిడ్డ చనిపోయాడు. తరువాత కొద్ది రోజులకే అతని భార్య కూడా చనిపోయింది.25 యేండ్ల వయసు కలిగిన శ్రీరాములు జీవిత సుఖాలపై విరక్తి చెంది ఉద్యోగానికి రాజీనామా చేసాడు.ఆస్తిపాస్తులను తల్లికి, అన్నదమ్ములకు పంచిపెట్టి, గాంధీజీ అనుయాయిగా సబర్మతి ఆశ్రమం చేరారు.స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నాడు.

పొట్టి శ్రీరాములు 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుశిక్ష అనుభవించాడు.తర్వాత మళ్ళీ 1941-42 సంవత్సరాల్లో సత్యాగ్రహాలు,క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొనడం వల్ల మూడుసార్లు జైలుశిక్ష అనుభవించాడు. 1985లో ప్రచురింప బడిన ఆంధ్ర ఉద్యమం కమిటీ అధ్యయనంలో పొట్టి శ్రీరాములు - మహాత్మా గాంధీల మధ్య అనుబంధం గురించి ఇలా వ్రాయబడింది.

"సబర్మతి ఆశ్రమంలో శ్రీరాములు సేవ చరిత్రాత్మకమైనది. ప్రేమ,వినయం,సేవ,నిస్వార్ధత లు మూర్తీభవించిన స్వరూపమే శ్రీరాములు.అతని గరువు ప్రపంచానికే గురువు,సత్యాన్ని అహింసను ఆరాధించే ప్రేమమూర్తి.

గాంధీజీకి శ్రీరాములు అంటే ప్రత్యేకమైన అభిమానంతో పాటు అతని మంకుతనం మీద కాస్త చిరాకు కూడా ఉండేవి. శ్రీరాములు వంటి కార్యదీక్షాపరులు పదిమంది ఉంటే ఒక్క సంవత్సరంలోనే స్వతంత్రం సాధించవచ్చునని గాంధీజీ అనేవారు.1946 నవంబరు 25న ఈ గాంధీ శిష్యుడు మద్రాసు ప్రొవిన్సులోని అన్ని దేవాలయాలలోనూ హరిజనులకు ప్రవేశం కల్పించాలని ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించారు.కొద్ది రోజుల్లోనే స్వతంత్రం రావచ్చునన్న ఆశాభావంతో కాంగ్రెసు నాయకులు,సభ్యులందరి దృష్టీ ఆ స్వాతంత్ర్యోద్యమంపైనే ఉంది.కనుక శ్రీరాములు దీక్షను మానుకోవాలని వారు సూచించినా అతను వినకపోయేసరికి ఇక వారు గాంధీని ఆశ్రయించారు.

ఎలాగో గాంధీ శ్రీరాములుకు నచ్చజెప్పి దీక్ష విరమింపజేశారు.అప్పుడు మహాత్మా గాంధీ టంగుటూరి ప్రకాశంకు ఇలా వ్రాశారు-"హమ్మయ్య. శ్రీరాములు దీక్ష నువ్వు చెప్పినట్లు విరమించుకోవడం నాకు సంతోషం.దీక్షను మానుకొన్నాక నాకు అతను టెలిగ్రామ్ పంపారు.అతను ఎంతో దీక్షాపరుడైన ఉద్యమకారుడైనా గాని కాస్త తిక్కమనిషి".1952లో శ్రీరాములు దీక్ష మాన్పించడానికి గాంధీజీ జీవించి లేడు. ఉన్నాగాని ఆంధ్రోద్యమంపై అతనికున్న దృఢత్వం అచంచలమైనది.

జీవితం చివరిదశలో నెల్లూరులో ఉంటు,హరిజనోద్ధరణకు కృషిచేసాడు.దీనిగురించిన నినాదాలను అట్టలకు రాసి, మెడకు వేలాడేసుకుని ప్రచారం చేసేవారు.కాళ్ళకు చెప్పులు,తలకు గొడుగు లేకుండా మండుటెండల్లో తిరుగుతూ ప్రచారం చేసే ఆయన్ను పిచ్చివాడనేవారు.ఆ పిచ్చివాడే ఆంధ్రుల చిరకాల స్వప్నమైన ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించేందుకు ప్రాణత్యాగానికి పూనుకుని,అమరజీవి అయ్యారు.

మద్రాసు రాజధానిగా వుండే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు మద్రాసులో 1952 అక్టోబర్ 19న బులుసు సాంబమూర్తి ఇంట్లో నిరాహారదీక్ష ప్రారంభించారు.చాలా మామూలుగా ప్రారంభమైన దీక్ష,క్రమంగా ప్రజల్లో అలజడి రేపింది.ఆంధ్ర కాంగ్రెసు కమిటీ మాత్రం దీక్షను సమర్ధించలేదు.ప్రజలు మాత్రం శ్రీరాములుకు మద్దతుగా సమ్మెలు, ప్రదర్శనలు జరిపారు.ప్రభుత్వం మాత్రం రాష్ట్రం ఏర్పాటు దిశగా విస్పష్ట ప్రకటన చెయ్యలేదు.చివరికి 1952 డిసెంబర్ 15 అర్ధరాత్రి పొట్టి శ్రీరాములు,తన ఆశయసాధనలో ప్రాణాలర్పించి అమరజీవి అయ్యాడు.

ఆగ్రహావేశులైన ప్రజలు హింసాత్మకచర్యలకు పాల్పడ్డారు.మద్రాసులో జరిగిన ఆయన శవయాత్రలో నినాదాలతో ప్రజలు ఆయన త్యాగ నిరతిని కొనియాడారు.తదుపరి జరిగిన పరిణామాలలో మద్రాసు నుండి విశాఖపట్నం వరకు ఆందోళనలు,హింస చెలరేగాయి.పోలీసు కాల్పుల్లో ప్రజలు మరణించారు.చివరికి డిసెంబర్ 19న ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుచేస్తూ ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ ప్రకటన చేసారు. 

డిసెంబర్ 15 శ్రీరాములు ఆత్మార్పణ రోజు!!ఉదయం నుంచే ఆయన స్పృహలో లేరు.కళ్లు తెరిచారు.అంతలోనే మూతలు పడపోయేవి.చేతులు కదిపేందుకు కూడా శక్తి లేదు.54 పౌనుల బరువు తగ్గారు.నాడి కదలిక,శ్వాస తీరుల్లో మార్పు వచ్చింది.16 గంటలపాటు మూత్రం స్తంభించింది.నోటిమాట కష్టమైంది.అప్పుడప్పుడు అపస్మారకంలోకి వెళ్లేవారు. సందర్శకులను నిలిపివేశారు.

సాయంత్రం వచ్చిన ప్రకృతి చికిత్సకులు వేగిరాజు కృష్ణమరాజు,ఆయన సతీమణులతో మాట్లాడలేకపోయినా... చిరునవ్వుతో స్వాగతం పలికారు.అప్పటి నుంచి క్రమంగా శరీరం చల్లబడిపోయింది.రాత్రి 11.23 గంటలకు పొట్టి శ్రీరాములు ఆంధ్రరాష్ట్రం కోసం తనను తాను బలిదానం చేసుకొన్నారు .