pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

విశ్వనాథ సత్యనారాయణ

29 ఆగస్టు 2017

విశ్వనాథ సత్యనారాయణ

                                                                                                                

విశ్వనాథ సత్యనారాయణ(సెప్టెంబర్ 10,1895 - అక్టోబరు 18,1976) "కవి సమ్రాట్" బిరుదాంకితుడు.తెలుగు సాహిత్యంలో తొలి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.20 వ శతాబ్దములోని ఆంధ్ర సాహిత్యమునకు,ప్రత్యేకించి సంప్రదాయ సాహిత్యమునకు పెద్ద దిక్కు.ఆయన చేపట్టని సాహిత్య ప్రక్రియ లేదు-కావ్యములు,కవితలు,నవలలు,నాటకములు, పద్యకావ్యములు,ప్రయోగములు,విమర్శలు,వ్యాసములు,కథలు,చరిత్రలు-ఆయన పాండిత్యము,ప్రతిభలు జగమెరిగినవి.ఆయన మాటలలోనే "నేను వ్రాసిన పద్యముల సంఖ్య,ప్రకటింపబడిన సంఖ్య,సుమారు ఇరువది వేలుండ వచ్చును. నేను చింపివేసినవి ఏబది వేలుండవచ్చును".ఆయన వ్రాసిన రచనలన్నీ కలిపితే లక్ష పుటలు ఉండవచ్చును.

బాల్యజీవితం :- 


విశ్వనాథ 1895,సెప్టెంబరు 10న కృష్ణా జిల్లా నందమూరు గ్రామం (నేటి ఉంగుటూరు మండలం)లో జన్మించారు. విశ్వనాథ సత్యనారాయణ తండ్రి శోభనాద్రి,తల్లి పార్వతి.ఆయనది తెలుగు వైదిక బ్రాహ్మణ కుటుంబం.శోభనాద్రి జీవితం చాలా వరకూ వైభవోపేతంగా సాగిన చివరి దశలో దాతృత్వ గుణం వల్ల దారుణమైన పేదరికాన్ని అనుభవించారు.విశ్వనాథ సత్యనారాయణ తన చిన్నతనంలో సుఖప్రదమైన జీవితాన్ని అనుభవించారు.ఆయన మాటల్లో చెప్పాల్సి వస్తే మరీ చిన్నతనంలో నేను యువరాజును.పుట్టుభోగిని.తర్వాత కష్టదశ.అనంతర కాలంలో శోభనాద్రి కేవలం అంగవస్త్రము,పంచె మాత్రమే సర్వ వస్త్రాలుగా మిగిలాకా కూడా దానాలిచ్చి దూసిన స్వర్ద్రువై మిగులు ధోవతినొక్కడు దాల్చిన స్థితిలో జీవించాల్సి వచ్చింది.

తండ్రి శోభనాద్రి మంచి భక్తుడు,ఆయన వారణాసి వెళ్ళి గంగానదిలో స్నానం చేయగా దొరికిన విశ్వేశ్వరస్వామి లింగాన్ని తీసుకువచ్చి స్వగ్రామమైన నందమూరులో ప్రతిష్ఠించి ఆలయం కట్టించారు.ఆయన ప్రభావం తమపై విపరీతంగా వుందని విశ్వనాథ సత్యనారాయణ అనేకమార్లు చెప్పుకున్నారు.విశ్వనాథ సత్యనారాయణలోని దాతృత్వము, భక్తి వంటి సుగుణాలు తండ్రి నుంచి వచ్చినవేనని చెప్పుకున్నారు.విశ్వనాథ సత్యనారాయణ బాల్యంలో ఆయన పుట్టిపెరిగిన గ్రామం,దానిలో దేశికవితా రీతులతో గానం చేసే భిక్షుక బృందాలూ,పురాణగాథలు నేర్చి ప్రవచించడంతో నిత్యమూ గడిపే స్వజనమూ ఆయన కవిత్వానికి పునాదులు వేశాయని చెప్పవచ్చు.

విద్యాభ్యాసం :-

విశ్వనాథ సత్యనారాయణ విద్యభ్యాసము ఎన్నో ఆటంకాల నడుమ సాగింది.ప్రాథమిక విద్యను నందమూరు, ఇందుపల్లి,మరియు పెదపాడు గ్రామాల్లో అభ్యసించారు.పై చదువు బందరు పట్టణంలో సాగింది.బందరు హైస్కూలులో చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి తెలుగు ఉపాధ్యాయునిగా లభించారు.చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి తిరుపతి వేంకట కవుల్లో ఒకరైన ప్రముఖ కవి,పండితుడు.ఆయన వద్ద బందరు పాఠశాలలో విద్యార్థులుగా చదువుకున్న వారు అనంతర కాలంలో మహా పండితులుగా,మహాకవులుగా ఆంధ్రదేశంలో సుప్రఖ్యాతి పొందడం విశేషం.వారిలో విశ్వనాథ సత్యనారాయణ అగ్రగణ్యులు.

చెళ్ళపిళ్ళ తమకు నిత్యం పాఠ్యప్రణాళిక ప్రకారం,సమయానికి వచ్చి పాఠాలు చెప్పినవారు కారనీ,ఐతే తమకు తోచిన సమకాలీన పండిత చర్చలు పిల్లలకు బోధిస్తూ శాఖాచంక్రమణంలో ఎన్నెన్నో భాషా సాహిత్య విశేషాలు వివరించి తుదకు గొప్ప పండితులుగా శిష్యులను తీర్చిదిద్దారని విశ్వనాథ వ్రాశారు.విశ్వనాథ సత్యనారాయణ కళాశాలలో చదువుతూండగా 1921లో మహాత్మాగాంధీ పిలుపుమేరకు సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొనేందుకు కళాశాలను వదిలివేశారు.తండ్రి చనిపోయి కుటుంబం దుస్థితిని అనుభవిస్తున్నా ఆయన ఈ సాహసం చేశారు.1921 నుంచి 1926 వరకూ బందరులోని ఆంధ్ర జాతీయ కళాశాలలో అధ్యాపకునిగా పనిచేశారు.మధ్యలో వదిలివేసిన బి.ఎ.ను తిరిగి 1926-27లో పూర్తిచేసి,బందరు హిందూ కళాశాలలో అధ్యాపకునిగా చేరారు.

ఉద్యోగ జీవితం :-

ప్రధానంగా ఆయన అధ్యాపక వృత్తిలో జీవితాన్ని గడిపారు.విద్యార్థి దశలో సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొనడం,తండ్రి మరణంతో దారుణమైన పేదరికం వంటి కారణాల వల్ల ఆయన బి.ఎ.పూర్తికాకుండానే ఆంధ్ర జాతీయ కళాశాలలో అధ్యాపకునిగా ఉద్యోగ జీవితాన్ని ఆరంభించారు.అనంతరం ఈయన వివిధ కళాశాలల్లో అధ్యాపక పదవులు నిర్వహించారు.

బందరు నేషనల్ కాలేజి (1928),గుంటూరు ఆంధ్రా క్రిస్టియన్ కాలేజి (ఏసీ కాలేజీ) (1932లో స్వల్పకాలం) పనిచేశారు.అనంతరం దాదాపుగా ఐదారేళ్ళ పాటుగా స్థిరమైన ఉద్యోగం లేకుండా రచన,ప్రసంగాదుల ద్వారా జీవించారు.కఠోరమైన ఆర్థిక దుస్థితిని ఎదుర్కొన్నా ఈ కాలంలో కవిగా ఆయన విఖ్యాతులయ్యారు.విజయవాడలో ఎస్.ఆర్.ఆర్.&‍ సి.వి.ఆర్.కాలేజి (1938-1959)(ఈ కళాశాల ఎస్.ఆర్.ఆర్.ప్రభుత్వ కళాశాలగా మార్పు చెందింది), కరీంనగర్ ప్రభుత్వ ఆర్ట్స్ & సైన్స్ కాలేజి (1959) మొదలైన కళాశాలల్లో ఆయన వివిధ హోదాల్లో పనిచేసారు. 1957లో విశ్వనాథ ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఉపాధ్యక్షులుగానూ,1958లో శాసనమండలికి నామినేటెడ్ సభ్యులుగానూ విధులు నిర్వర్తించారు.

దాంపత్యం :-

విశ్వనాథ సత్యనారాయణ మొదటి భార్య పేరు వరలక్ష్మి.ఆమె అపురూపమైన వ్యక్తిత్వం కల మహా మనీషిగా విశ్వనాథ తరచు పేర్కొన్నారు.వరలక్ష్మి సాహచర్యం తనకు వరమని,ఆమె వల్లనే తానొక కవిని కాగలిగానని పలు విధాలుగా అనేకమైన రచనల్లో పేర్కొన్నారు.ఆమె వాగ్మాధుర్యం,సౌందర్యం,పాతివ్రత్యం,సంసారాన్ని దిద్దుకున్న తీరు వంటివి అతిలోకమైన లక్షణాలుగా వివరించారు.తాను స్వయంగా వట్టి నీరసబుద్ధి గలవాడనని,తాను గొప్ప రసవేత్తను,రసస్రష్టను కావడానికి,మహాకవిని కావడానికి మూలం ఆమేనని పద్యరూపంగా పేర్కొన్నారు.వారికి అచ్యుతదేవరాయలు అనే కుమారుడు కలిగాడు.

1931-32 కాలంలో ఆయన మొదటి భార్య,తనను రసవేత్తగా మలిచిన వ్యక్తి వరలక్ష్మి అనారోగ్యంతో మరణించారు.ఆ వియోగ దు:ఖం విశ్వనాథ జీవితంపై,ఆలోచనలపై తీవ్రమైన ముద్రవేసింది.ఆయన జీవితంలో గొప్ప కుదుపు తీసుకువచ్చింది.తన జీవిన సరస్వం వంటి ఆమె మరణం వల్ల ఆయనలో కలిగిన వేదన తన చరమాంకంలోనూ పోలేదు.ఆయన 36 ఏట తొలి భార్య మరణించగా తన 80వ ఏట మరణించే సమయంలోనూ ఆమెనే తలచుకున్నారని సన్నిహితులు,కుటుంబసభ్యులు పేర్కొన్నారు.వరలక్ష్మి మరణం పొందాకా ఆ వియోగబాధలో రోజుల తరబడి వెలువడ్డ పద్యాలను కూర్చి 20 ఏళ్ళ అనంతరం వరలక్ష్మీ త్రిశతిగా ప్రచురించారు.300 పద్యాలున్న ఈ గ్రంథంలో వరలక్ష్మి మరణం,కర్మకాండలు మొదలుకొని స్మృతిగా మిగిలి వేదన మిగల్చడం వరకూ అనేక సందర్భాల్లో వచ్చిన పద్యాలు ఉంటాయి.

తెలుగు సాహిత్యంలో నిలిచే నవలగా విమర్శకులు భావించిన విశ్వనాథ వేయిపడగలులో నాయకుడైన ధర్మారావు పాత్ర నిజజీవితంలో విశ్వనాథ సత్యనారాయణదనీ,ధర్మారావు భార్య అరుంధతి వరలక్ష్మమ్మ అని పేర్కొంటారు.ఆమె మహోన్నత్యం,సహజ పాండిత్యం,అనారోగ్యం,మరణం వంటివన్నీ ఆ నవలలోనూ వర్ణితమయ్యాయి.ఆయన మహాకావ్యం రామాయణ కల్పవృక్షంతో కూడా వరలక్ష్మి మరణానికి గాఢమైన సంబంధముంది.శ్రీరామచంద్రమూర్తికి ముప్పై ఆరుఏండ్ల వయసులో సీతా వియోగం సంప్రాప్తించింది.తనకుకూడా సరిగా అదే వయస్సులో ఆ భార్యావియోగ హాదు:ఖం సంప్రాప్తించింది. 

ఆ వియోగ వ్యథ ఏమిటో తెలియనిదే తాను రామకథను రసవంతం చేయలేడని భగవంతుడు తనకు ఆ యోగ్యత కూడా కల్పించాడని వాపోయినాడాయన.ఆయన జీవితంపై,సాహిత్యంపై అలా వరలక్ష్మితో దాంపత్యమూ,ఆమె అకాల మరణమూ తీవ్రమైన ప్రభావం చూపించాయి.

ఆయన జీవితంలో 1932 నుంచి 38 వరకూ అత్యంత కష్టదశగా చెప్పవచ్చు.ఈ సమయంలో ఆయన స్థిరమైన ఉద్యోగం లేకుండా జీవించాల్సిరావడంతో ఆర్థికపరమైన కష్టాలు,అత్యంత ప్రేమాస్పదురాలైన భార్య గతించడంతో మానసికమైన దు:ఖాన్నీ అనుభవించారు.విచిత్రమైన విషయమేమిటంటే విశ్వనాథ సత్యనారాయణ రచనల్లో అత్యంత ప్రాచుర్యం పొందినవి ఈ దుస్తరమైన కాలంలోనే వెలువడ్డాయి.1976 అక్టోబరు 18 న (నల నామ సంవత్సర ఆశ్వయుజ బహుళ దశమి) విశ్వనాథ పరమపదించారు.జీవితంలో చాలా కాలం విజయవాడ నగరంలోనే గడచింది.1996 అక్టోబరు 21న ఆయన శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని విజయవాడలో ఆయన విగ్రహాన్ని ఆప్పటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ ఆవిష్కరించారు.

సాహితీ ప్రస్థానం :-

1916 లో "విశ్వేశ్వర శతకము"తో విశ్వనాథ రచనా ప్రస్థానము ప్రారంభమైనది.అప్పటి జాతీయోద్యమ ప్రభావంతో ఆసమయంలోనే "ఆంధ్రపౌరుషము" రచించారు.1920 నాటికే తెలుగులో ప్రసిద్ధ కవిగా గుర్తింపు తెచ్చుకొన్నారు.

తరువాత విశ్వనాథ రచనా పరంపర పుంఖానుపుంఖాలుగా కొనసాగింది.మొత్తానికి 25 పైచిలుకు కావ్యాలు,6 శతకాలు, 13 గేయకావ్యాలు,15 నాటకాలు,58 నవలలు,10 సంస్కృత నాటకాలు,10 విమర్శన గ్రంథాలు,మరెన్నో వ్యాసాలు, ఉపన్యాసాలు-ఇలా తెలుగుభాషకు విశ్వనాథ వందల్లో రచనలందించారు.ఆయన రచనలను కొన్ని ఇతర భాషలలోకి అనువదించారు. రేడియో కోసం నాటకాలు,ప్రసంగాలు రూపొందించారు.1961లో కరీంనగర్ ప్రభుత్వ కళాశాలలో ప్రిన్సిపాలుగా పదవీ విరమణ చేసిన తరువాత పూర్తి స్థాయిలో తన సమయాన్ని సాహితీ వ్యాసాంగానికి కేటాయించారు.

ప్రముఖ బెంగాలీ కవి రవీంద్రనాధ టాగూరు వలె తన రచనలను కొన్నింటినైనా ఆంగ్లంలోకి తర్జుమా చేసుకొంటే, ఆయన అంతర్జాతీయ ఖ్యాతినార్జించి ఉండేవాడని ఆయన అభిమానులు అంటుంటారు.అయితే విశ్వనాథ రచనలను విశ్లేషించే విమర్శకుడు ఆయన తాత్విక స్థాయిని అర్ధం చేసుకొంటే గాని సాధ్యం కాని విషయం.

విన్నూత్న,విశిష్టమైన పాత్ర చిత్రణకు విశ్వనాథ పెట్టింది పేరు.ఆయా సందర్భాన్నిబట్టి,సన్నివేశాన్ని బట్టి పాత్రల మనస్త్వత్తాన్ని విశ్లేషించుకుంటూ స్వయం వక్తిత్వంగల పాత్రలుగానూ,స్వయం ప్రకాశవంతమయిన పాత్రలుగానూ, మహత్తరమయిన,రమణీయమయిన శిల్పాలుగాను తీర్చి దిద్దారు.అందునా వారి స్త్రీ పాత్ర చిత్రణ అద్భుతం!
 

ముఖ్య రచనలు :-

విశ్వనాథ రచనల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినవి-ఆంధ్రపౌరుషము,రామాయణ కల్పవృక్షము,వేయిపడగలు, కిన్నెరసాని పాటలు,పురాణవైర గ్రంథమాల,కాశ్మీర చారిత్రిక నవలలు,విశ్వనాథ మధ్యాక్కఱలు,నన్నయ ప్రసన్నకథాకలితార్థయుక్తి వంటివి.తెలుగు తనమన్నా,తెలుగు భాష అన్నా విశ్వనాథకు ప్రత్యేక అభిమానం.ఆంధ్ర పౌరుషం,ఆంధ్రప్రశస్తి ఆయన మొదటి రచనలలోనివి.విశ్వనాథ రచనలలో అతని పాండిత్యమే కాక,రచనాశిల్పం,పాత్ర చిత్రణ,చారిత్రక అవగాహన అద్భుతంగా కనిపిస్తుంటాయి.

తన రచనలలో శ్రీమద్రామాయణ కల్పవృక్షం (జ్ఞానపీఠ అవార్డు లభించినది) తనకు వ్యక్తిగతంగా ఎంతో తృప్తినిచ్చిందని చెప్పారు.ఎందరో కవులు వ్రాసినా మళ్ళీ ఎందుకు వ్రాయాలంటే రోజూ తింటున్నామని అన్నం తినడం మానివేయడంలేదుగదా అన్నారు.తమిళనాడులోని మదురై ప్రాంతం నేపథ్యంలో వచ్చిన నవల "ఏకవీర"ను పుట్టపర్తి నారాయణాచార్యులు మళయాళంలోనికి,అంబటిపూటి హనుమయ్య తమిళంలోనికి అనువదించారు.ఏకవీర సినిమా కూడా వచ్చింది.ఆ సినిమాకు సి.నారాయణరెడ్డి మాటలు,పాటలు సమకూర్చాడు.వేయిపడగలు నవలను మాజీ ప్రధాన మంత్రి పి.వి.నరసింహారావు "సహస్రఫణ్" పేరుతో హిందీ లోకి అనువదించారు.

భారతీయ సంస్కృతి,ఆచారం,విశేషాలు,మధ్య తరగతి జీవన విధానాలు ఈ నవలలో విశేషంగా చూపబడ్డాయి. కోకిలమ్మ పెళ్ళి,కిన్నెరసాని పాటలు (ఆనాటి) యువతరాన్ని ఆకట్టుకొనే వ్యావహారిక భాషలో వ్రాశారు.విశ్వనాథ నవలలలో పురాణవైర గ్రంథమాల క్రింద వచ్చిన 12 నవలలు మహాభారతానంతర పూర్వయుగ భారతదేశ చరిత్రను మరొకవిధంగా చూపుతాయి.అయితే వీటిలో ప్రతి నవలా ఉత్సుకతతో నిండిన కథ,అనితరమైన ఆయన శైలి,విశేషమైన పాత్రలతో పాఠకులను ఆకట్టుకొంటాయి.

విశ్వనాథ సత్యనారాయణ వారి ముఖ్య రచనా సాహిత్యంలో శతకములు ఒక ప్రముఖ పాత్ర వహిస్తాయి, వీటి గురించి తప్పకుండా ప్రస్తావన చెయ్యాల్సిందే.

ఈ క్రింద చెప్పిన 10 శతకాలు వాటి పేర్లు, మకుటము ప్రస్తావించటం జరిగింది.


1. శ్రీగిరి శతకము (మధ్యాక్కరలు) - మకుటం: శ్రీ శైల మల్లికార్జున మహా లింగ!
2. శ్రీకాళహస్తి శతకము (మధ్యాక్కరలు) - మకుటం: శ్రీ కాళ హస్తీస్వరా! మహా దేవ!
3. భద్రగిరి శతకము (మధ్యాక్కరలు) - మకుటం: భద్ర గిరి పుణ్య నిలయ శ్రీ రామ!
4. కులస్వామి శతకము (మధ్యాక్కరలు) - మకుటం: నందమూర్నిలయ! విశ్వేశ్వరా! కులస్వామి!
5. శేషాద్రి శతకము (మధ్యాక్కరలు) - మకుటం: వేంకటేశ్వరా! శేషాద్రి నిలయ!
6. ద్రాక్షారామ శతకము (మధ్యాక్కరలు) - మకుటం: భీమేశలింగ! ద్రాక్షారామ సంగ!
7. నందమూరు శతకము (మధ్యాక్కరలు) - మకుటం: నందమూర్నిలయ! సంతాన వేణు గోపాల!
8. నెకరు కల్లు శతకము (మధ్యాక్కరలు) - మకుటం: నెకరుకల్ ప్రాంత సిద్ధాబ్జ హేళి!
9. మున్నంగి శతకము (మధ్యాక్కరలు) - మకుటం: నిర్ముల! మున్నంగి వేణు గోపాల!
10. వేములవాడ శతకము (మధ్యాక్కరలు) - మకుటం: వేములవాడ రాజరాజేశ్వర! స్వామి!

వ్యక్తిత్వం:-

విశ్వనాథ వ్యక్తిత్వం కూడా ప్రాచీన విధానాలకు,ఆచారాలకు కట్టుబడ్డది.భారతీయత మీద,తెలుగుదనంమీద అభిమానం కలిగింది.తన అభిప్రాయాలను,ఇష్టాయిష్టాలను నిక్కచ్చిగా తెలిపేవారు.ఇందువల్ల విశ్వనాథను వ్యతిరేకించినవారు చాలామంది ఉన్నారు.ఛాందసుడు అనీ,"గతకాలమె మేలు వచ్చుకాలము కంటెన్" అనేవాడు అనీ (శ్రీశ్రీ విమర్శ) విమర్శించారు.విశ్వనాథకు పాశ్చాత్య సాహిత్యం అంటే పడదని అనుకొంటారు.కాని ఆయన పాశ్చాత్య సాహిత్యం పట్ల గౌరవం కలిగి ఉండేవారు.షేక్స్‌పియర్,మిల్టన్,షెల్లీ వంటి కవుల రచనలను ఆసాంతం పరిశీలించారు.

“    అలనన్నయకు లేదు తిక్కనకు లేదా భోగమస్మాదృశుం
డలఘు స్వాదు రసావతార ధిషణాహంకార సంభార దో
హల బ్రహ్మీమయమూర్తి శిష్యుడైనాడన్నట్టి దావ్యోమ పే
          శల చాంద్రీ మృదుకీర్తి చెళ్ళపిళ వంశస్వామి కున్నట్లుగన్    ”

 

 

గురువులపట్ల ఎనలేని గౌరవం ఉన్న విశ్వనాథకు తన ప్రతిభ పైన అపారమైన విశ్వాసం కూడా కలిగి ఉండేవారు. తనంతటివాడు (అనగా విశ్వనాధ సత్యనారాయణ అంతటివాడు) శిష్యుడయ్యాడని చెప్పుకొనే భాగ్యం నన్నయ తిక్కనాదులకు లభించలేదని,చెళ్ళపిళ్ళ వారికి దక్కిందని ఒకమారు తమ గురువుగారి సన్మాన సభలో అన్నారు విశ్వనాథ. జాతీయ భావం తీవ్రంగా ఉండడానికి,ఆరోగ్యకరంగా ఉండే ప్రాంతీయ భావం కూడా ఎంతో కొంత అవసరం అని విశ్వనాథ అనేవారు.శిల్పం గాని,సాహిత్యం గాని జాతీయమై ఉండాలి కాని విజాతీయమై ఉండరాదనేవారు.సముద్రంపై పక్షి ఎంత ఎగిరినా రాత్రికి గూటికెలా చేరుతుందో అలాగే మన జాతీయత, సంప్రదాయాలను కాపాడుకోవాలనుకొనేవారు.

విశ్వనాథ వ్యక్తిత్వాన్ని చతుర్వేదుల లక్ష్మీనరసింహం ఇలా ప్రశంసించాడు:- "ఆహారపుష్టి గల మనిషి.ఉప్పూ కారం, ప్రత్యేకంగా పాలు ఎక్కువ ఇష్టం.కాఫీలో గాని,తాంబూలంలో గాని ఎక్కువగా పంచదార వాడేవారు.ఆజానుబాహువు. బ్రహ్మతేజస్సు ముఖాన,సరస్వతీ సంపద వాక్కున,హృదయ స్థానాన లక్ష్మీకటాక్ష చిహ్నంగా బంగారుతో మలచిన తులసీమాల.మనస్సు నవ్య నవనీతం.వాక్కు దారుణాఖండల శస్త్రతుల్యం.చదివేవి ఎక్కువ ఆంగ్ల గ్రంథాలు.వ్రాసేవి ఆంధ్ర సంస్కృత గ్రంథాలు.చిన్నలలో చిన్న,పెద్దలలో పెద్దగా ఒదిగి పోయే స్వభావం.శారీరకంగా వ్యాయామం, యోగాభ్యాసం అయన నిత్యం అభ్యసించేవి.విమర్శలూ,స్తోత్రాలూ,తిట్లూ,దీవెనలూ,దారిద్ర్యం,ఐశ్వర్యం-ఇలాంటి ద్వంద్వాలకు అతీతుడు.ఒకమాటలో ఆయన అపూర్వమైన 'దినుసు' "


శైలి :-

విశ్వనాథ వారిది విశిష్టమైన శైలి.ఆయన రచనల్లో లోకానుభవం తొంగి చూస్తుంది.ఆయన గురించి ఆయనే చెప్పుకున్న ఈ వాక్యాలు ఆయన శైలిని అవగతం చేస్తాయి:
నాకవిత్వం అంతా నా జీవితంలోని అనుభవాలమయం.లోకవ్యక్తిని కావ్యవ్యక్తి నయ్యాను.దశరథుణ్ణి గూర్చి బంధుజ్యేష్ఠుడన్నాను,వేయిపడగలలో "రామేశ్వరశాస్త్రి బంధుజ్యేష్ఠుడు" అన్నాను.ఎవరీ బంధుజ్యేష్ఠుడు? మా నాయనగారు.నీ చుట్టువున్న లోకంలో నీకు చెందని భావం ఏముంటుంది? ఈ భావాలు.ఈ అనుభవాలు నీ మనస్సుపై వేసిన ముద్రలలో నుండే నీ మాటలు దొర్లుకొనివస్తాయి.నీవు కవివయితే ఆ శబ్దము వ్యంజకమై కావ్యత్వాన్ని పొందుతుంది.కవివయితే నంటే ఏమిటి? కవియైనవాడు లోకాన్ని చూచే దృష్టివేరు వానికి కనిపించే లోకము అందరు చూచే లోకమే

పలుచని బురదలోపల మానిసిని జూచి
         నెగచి యూకున దూకె నీటిపాము
వెలివడ్డ బొరియముంగలనిక్కి తెల్లబో
         యెను కొంగ కెఱగాని యెండ్రకాయ
ఒడ్డున బురదలో గొడ్డు గిట్టలు దిగి
         పడె జంఘదఘ్నమై పంటకాల్వ
జనుము చల్లుటకు తీసిన పాయ పాపట
         చక్కదీగిచి దిద్దె సస్యలక్ష్మి
    పలుచగా వేడియెక్కు బవళ్ళతోడ
    బైరగాలి పొరల్ తడియారజొచ్చె
    పగటి కుషసు నా నొప్పె నవార్షుకములు
    కాఱులకు దొల్తగా శరత్కాల లక్ష్మి

తెలుగు ఋతువులలో ఈ పద్యం వ్రాసాను.నేను మా పల్లెలో చిన్ననాడు చూచిన దృశ్యాలు ఎవరూచూడలేదా? చూసేవుంటారు కాని చెప్పలేదు.శక్తి లేక చెప్పకపోవచ్చు లేక ఆ దృష్టి లేకచెప్పకపోవచ్చు.కనుక ఎవడు కవి? ఆ శక్తి, ఆ దృష్టి ఉన్నవారు.

పురస్కారాలు:-

విశ్వనాథ సత్యనారాయణ బొమ్మ ఉన్న తపాలా బిళ్ళను నిన్న గుంటూరు నగరములో విడుదల ప్రముఖులు చేసారు.
ఆంధ్రజాతి తన సంప్రదాయాలకు అనుగుణంగా ఆయనను "కవి సమ్రాట్" బిరుదుతో సత్కరించింది.
1964లో ఆంధ్ర విశ్వ కళాపరిషత్ "కళాప్రపూర్ణ"తో సన్మానించింది.
1942 సంక్రాంతికి ఆయనకు గుడివాడలో "గజారోహణం" సన్మానం జరిగింది. 1956 లో షష్టి పూర్తి వేడుకలు కూడా గుడివాడలో ఘనంగా జరిగాయి.
శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం డి.లిట్ పట్టాతో సన్మానించింది.
1962 లో "విశ్వనాథ మధ్యాక్కఱలు" రచనకు కేంద్రసాహిత్య అకాడెమీ వారి బహుమతి లభించింది.
1970 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆస్థాన కవిగా గౌరవించింది.
1970 లో భారత ప్రభుత్వము పద్మభూషణ పురస్కారంతో గౌరవించింది.
జ్ఞానపీఠ అవార్డు పొందిన తొలి తెలుగు రచయిత.1971లో ఆయన "రామాయణ కల్పవృక్షము"నకు,జ్ఞానపీఠ పురస్కారాన్ని అందించినపుడు,సన్మాన పత్రంలో ఇలా వ్రాయబడింది.

As a Poet of classic vision and virility, as a novelist and play wright of deep insight and impact, as an essayist and literary critic of force and felicity, and as a stylist of rare "range" Mr. Satyanarayana has carved for himself a place of eminence amongst the immortals of Telugu Literature. His ceaseless creativity and versatility have kept him in the forefront of contemporary Telugu Literary Scene.