pratilipi-logo ప్రతిలిపి
తెలుగు
← All articles మెరుగైన కథా రచన

ఒక శక్తివంతమైన సన్నివేశాన్ని ఎలా రాయాలి?

గౌరవనీయులైన రచయిత గారికి,

ఒక మంచి సన్నివేశం పాఠకులకు తాము కూడా కథలోనే ఉన్నామనే అనుభూతిని కలిగిస్తుంది. అందులో భావోద్వేగాలు, యాక్షన్, చక్కని సంభాషణలు & కుతూహలం ఉండాలి. ఒక సన్నివేశాన్ని అద్భుతంగా రాసినప్పుడు, అక్కడ ఏం జరుగుతుందో పాఠకులు స్పష్టంగా ఊహించుకోగలరు & పాత్రలతో సులభంగా మమేకం అవ్వగలరు.

మీ కథలో ఒక బలమైన సన్నివేశాన్ని సృష్టించడానికి ఇక్కడ కొన్ని సులువైన చిట్కాలు ఉన్నాయి.

  1. 1

    స్పష్టమైన ఉద్దేశ్యంతో ప్రారంభించండి.

    సన్నివేశాన్ని రాసే ముందు, ఆ సీన్ కథకు ఎందుకు అంత ముఖ్యమో తెలుసుకోండి. అది కథను ముందుకు నడిపించేదిగానో, పాత్రల భావోద్వేగాలను చూపించేదిగానో, ఏదైనా ముఖ్యమైన సమాచారాన్ని బయటపెట్టేదిగానో లేదా ఘర్షణను సృష్టించేదిగానో ఉండాలి.

  2. 2

    భావోద్వేగాలను స్పష్టంగా చూపించండి.

    మీ పాత్రలు ఏం ఫీల్ అవుతున్నాయో పాఠకులకు కూడా తెలిసేలా చేయండి. సన్నివేశాన్ని మరింత బలంగా మార్చడానికి భయం, కోపం, బాధ, ప్రేమ, నేరభావన, అసూయ లేదా గందరగోళం వంటి ఎమోషన్స్‌ను ఉపయోగించండి.

  3. 3

    టెన్షన్‌ను క్రియేట్ చేయడానికి సంభాషణలను ఉపయోగించండి.

    సంభాషణలు… సన్నివేశానికి జీవం పోస్తాయి. వాదోపవాదాలు, ఎమోషనల్ క్షణాలు లేదా రహస్యాల గురించి మాట్లాడుకునేటప్పుడు పాత్రల మధ్య నడిచే శక్తివంతమైన సంభాషణలు పాఠకులను కథలో లీనమయ్యేలా చేస్తాయి.

  4. 4

    బాడీ లాంగ్వేజ్‌ను జోడించండి.

    ఒక పాత్ర కోపంగా, భయంగా లేదా బాధగా ఉందని కేవలం మాటల్లో చెప్పేయకండి. పిడికిలి బిగించడం, చేతులు వణకడం, నిశ్శబ్దంగా కన్నీళ్లు కార్చడం, కళ్లల్లోకి చూడలేకపోవడం లేదా అక్కడి నుండి విసవిసా వెళ్ళిపోవడం వంటి చర్యల ద్వారా దానిని వ్యక్తపరచండి.

  5. 5

    అంతర్గత ఆలోచనలను వ్యక్తపరచండి.

    పాత్రల మనసులోని ఆలోచనలు వారి బాధను, భయాన్ని, గందరగోళాన్ని లేదా దాగి ఉన్న భావాలను పాఠకులకు అర్థమయ్యేలా చేస్తాయి. ఇది పాఠకుడికి & పాత్రకు మధ్య ఒక బలమైన భావోద్వేగ బంధాన్ని ఏర్పరుస్తుంది.

  6. 6

    కథా వేగాన్ని సరిగ్గా ఉంచండి.

    తొందరపాటు లేదా టెన్షన్ ఎక్కువగా ఉండే క్షణాలలో చిన్న చిన్న వాక్యాలను ఉపయోగించండి. అదే ఎమోషనల్ లేదా సీరియస్ సన్నివేశాలు అయితే, కథా వేగాన్ని కొద్దిగా తగ్గించండి.. అప్పుడే పాఠకులు ఆ క్షణాన్ని పూర్తిగా అనుభవించగలరు.

  7. 7

    ఒక బలమైన నేపథ్యాన్ని ఎంచుకోండి.

    సన్నివేశం జరిగే ప్రదేశం కూడా కథలోని మూడ్‌ను ప్రభావితం చేస్తుంది. చీకటి గది, నిర్మానుష్యమైన రోడ్డు, కిక్కిరిసిన మార్కెట్, హాస్పిటల్ కారిడార్ లేదా వర్షం కురిసే రాత్రి.. వంటి నేపథ్యాలు ఆ సన్నివేశాన్ని మరింత శక్తివంతంగా మారుస్తాయి.

  8. 8

    చిన్న చిన్న వివరాలను ఉపయోగించండి.

    చిన్న చిన్న వివరాలు ఒక సన్నివేశం నిజంగా జరుగుతున్నట్లు అనిపించేలా చేస్తాయి. ఉదాహరణకు, వణుకుతున్న గొంతు, పగిలిన ఫోటో ఫ్రేమ్, సగం రాసి ఆపేసిన మెసేజ్ లేదా అనుకోని సమయంలో మోగే ఫోన్ రింగ్ వంటివి సీన్ యొక్క ప్రభావాన్ని పెంచుతాయి.

  9. 9

    ఘర్షణ లేదా సమస్యను జోడించండి.

    ప్రతి బలమైన సన్నివేశంలోనూ ఏదో ఒక రకమైన ఘర్షణ ఉండాలి. అదొక గొడవ కావచ్చు, అపార్థం, రహస్యం, ఎమోషనల్ స్ట్రగుల్, కఠినమైన నిర్ణయం లేదా ఏదైనా ప్రమాదం కావచ్చు.

  10. 10

    ప్రారంభంలోనే హుక్స్ ఉపయోగించండి.

    సన్నివేశాన్ని పాఠకులలో కుతూహలం రేకెత్తించే అంశంతో ప్రారంభించండి. ఊహించని డైలాగ్, అనూహ్య సంఘటన, వింత ప్రవర్తన లేదా సమాధానం లేని ఒక ప్రశ్న పాఠకులను ఆ భాగంలోకి చకచకా లాగేస్తాయి.

  11. 11

    ముగింపులో క్లిఫ్‌హ్యాంగర్స్ వాడండి.

    కీలకమైన సన్నివేశాలను సస్పెన్స్‌తో లేదా అసంపూర్ణ క్షణంతో ముగించండి. ఇది తర్వాతి భాగంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఆరాటాన్ని పాఠకులలో పెంచుతుంది.

  12. 12

    అనవసరమైన వర్ణనలను నివారించండి.

    కథకు పెద్దగా ప్రాధాన్యత లేని విషయాలను వర్ణించడానికి ఎక్కువ సమయాన్ని వృధా చేయకండి. కేవలం కథలోని ఎమోషన్, ఘర్షణ లేదా కథా గమనానికి తోడ్పడే వివరాలపై మాత్రమే దృష్టి పెట్టండి.

  13. 13

    సులభంగా ఊహించుకునేలా రాయండి.

    సన్నివేశాన్ని పాఠకులు తమ మనసులో స్పష్టంగా ఊహించుకోగలగాలి. కథా ప్రవాహం సాఫీగా సాగడానికి సరళమైన పదాలు, స్పష్టమైన చర్యలు & సహజమైన సంభాషణలను ఉపయోగించండి.

  14. 14

    ముగింపు సందేశం

    శక్తివంతమైన సన్నివేశం అంటే అక్కడ ఏం జరిగిందనేది మాత్రమే కాదు.. పాఠకులు దానిని ఎంత బలంగా అనుభూతి చెందరన్నది ముఖ్యం. మీ సన్నివేశాలను ఎప్పటికీ గుర్తిండిపోయేలా & ఆకట్టుకునేలా మార్చడానికి ఎమోషన్స్, సంభాషణలు, బాడీ లాంగ్వేజ్, నేపథ్యం, హుక్స్ & క్లిఫ్‌హ్యాంగర్స్‌ను చక్కగా ఉపయోగించండి.

సంతోషంగా రాయండి!

— ప్రతిలిపి బృందం

ఇది ఉపయోగకరంగా ఉందా? మెరుగైన కథా రచనలో మరిన్ని వ్యాసాలు చదవండి. మరిన్ని వ్యాసాలు