pratilipi-logo ప్రతిలిపి
తెలుగు
← All articles మెరుగైన కథా రచన

పాత్రలను ఎలా మలచాలి?

గౌరవనీయులైన రచయిత గారికి,

విజయవంతమైన కథకు బలమైన పాత్రలే ప్రాణం. మీ పాత్రలు నిజమైన వ్యక్తుల్లా అనిపిస్తూ, చక్కని భావోద్వేగాలను పండిస్తూ, ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉన్నప్పుడు మాత్రమే పాఠకులు వాటికి బాగా కనెక్ట్ అవుతారు.

మంచి పాత్ర ఎప్పుడూ ఒకేలా సాదాసీదాగా ఉండకూడదు. వారికి ప్రత్యేకమైన వ్యక్తిత్వం, కలలు, భయాలు, అలవాట్లు, బంధాలు, బలాలు & బలహీనతలు ఉండాలి. పాఠకులు మీ పాత్రలను ఎంత లోతుగా అర్థం చేసుకుంటే, ఆ పాత్రల జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి వారు అంతగా ఆరాటపడతారు.

  1. 1

    ప్రతి ప్రధాన పాత్రకు స్పష్టమైన వ్యక్తిత్వాన్ని ఇవ్వండి.

    రాయడం ప్రారంభించే ముందే, మీ పాత్ర ఎలాంటి స్వభావం గలదో నిర్ణయించుకోండి. వారు సిగ్గరి కావచ్చు, ధైర్యవంతులు, అమాయకులు, ఎమోషనల్, కోపధారులు, కేరింగ్, ముభావంగా ఉండేవాళ్ళు, ఫన్నీ లేదా ఎప్పుడూ గందరగోళంలో ఉండేవాళ్ళు కావచ్చు.

  2. 2

    వారికి బలాలు & బలహీనతలు రెండింటినీ జోడించండి.

    ఎలాంటి లోపాలు లేని ఖచ్చితమైన పాత్రలు నిజ జీవితానికి దూరంగా అనిపిస్తాయి. మీ పాత్రలకు మంచి గుణాలతో పాటు కొన్ని లోపాలను కూడా పెట్టండి, అప్పుడే పాఠకులు వారిని తమలో ఒకరిగా భావించి సులభంగా కనెక్ట్ అవ్వగలుగుతారు.

  3. 3

    వారికి లక్ష్యాన్ని ఏర్పరచండి.

    కథలోని ప్రతి ముఖ్యమైన పాత్రకు ఏదో ఒక బలమైన కోరిక ఉండాలి. వారి లక్ష్యం ప్రేమ కావచ్చు, పగ, విజయం, స్వేచ్ఛ, కుటుంబం యొక్క ఆమోదం, న్యాయం లేదా ప్రశాంతత.. ఇలా ఏదైనా కావచ్చు.

  4. 4

    వారి వెనుక ఉన్న కారణాన్ని అర్థం చేసుకోండి.

    మీ పాత్రకు ఏం కావాలనేది మాత్రమే కాదు.. అది వారికి ఎందుకు కావాలనే బలమైన కారణాన్ని కూడా మీరు నిర్ణయించుకోవాలి. ఎందుకంటే ఆ కారణమే కథలో వారు తీసుకునే నిర్ణయాలను, చేసే పనులను నడిపిస్తుంది.

  5. 5

    బ్యాక్‌స్టోరీని సిద్ధం చేసుకోండి.

    మీ పాత్ర యొక్క గతం ఎలా ఉందో ఆలోచించండి. వారి బాల్యం, కుటుంబం, బ్రేకప్స్, గతంలో చేసిన పొరపాట్లు లేదా వారు పడిన కష్టాలు.. ప్రస్తుతం వారు ప్రవర్తించే తీరును ఎంతగానో ప్రభావితం చేస్తాయి.

  6. 6

    వారికి కొన్ని అలవాట్లు, చిన్న చిన్న వివరాలను జోడించండి.

    చిన్న చిన్న వివరాలే పాత్రలకు జీవం పోస్తాయి. వారికి ప్రత్యేకమైన అలవాటు, వారు తరచూ వాడే ఇష్టమైన పదం, మాట్లాడే శైలి, తెలియని భయం లేదా నిర్దిష్టమైన దినచర్య వంటివి జోడించి చూడండి.

  7. 7

    వారి భావోద్వేగాలను చేతల ద్వారా చూపించండి.

    పాత్ర బాధగా, కోపంగా లేదా భయంగా ఉందని కేవలం మాటల్లో చెప్పేయకండి. చర్యలు, సంభాషణలు, నిశ్శబ్దం, రియాక్షన్స్ & వారు తీసుకునే నిర్ణయాల ద్వారా ఆయా ఎమోషన్స్‌ను పాఠకులకు తెలిసేలా చేయండి.

  8. 8

    వారి బంధాలను చక్కగా మలచండి.

    ఇతర పాత్రలతో ఉండే బంధాల ద్వారానే ఏ పాత్ర అయినా మరింత ఆసక్తికరంగా మారుతుంది. వారు తమ కుటుంబం, స్నేహితులు, ప్రేమికులు, శత్రువులు & వారు మనసులోనే ఇష్టపడే వ్యక్తులతో ఎలా ప్రవర్తిస్తారో చూపించండి.

  9. 9

    వారిలో రహస్యాన్ని లేదా అంతర్మథనాన్ని సృష్టించండి.

    దాచిన రహస్యం, భయం, నేరభావన, గుప్త ప్రేమ లేదా చేదు జ్ఞాపకం పాత్రను మరింత ఆకట్టుకునేలా చేస్తాయి. ఇది పాఠకులలో ఆ పాత్ర పట్ల ఎప్పుడూ ఒక రకమైన కుతూహలాన్ని కలిగిస్తుంది.

  10. 10

    పాత్రల ప్రవర్తన స్థిరంగా ఉండేలా చూసుకోండి.

    మీరొక పాత్రకు ఒక స్వభావాన్ని నిర్ణయించుకున్నాక, కథ పొడవునా దానిని స్థిరంగా కొనసాగించండి. ఒకవేళ వారి ప్రవర్తనలో మార్పు వస్తే, ఆ మార్పు వెనుక ఉన్న కారణాన్ని వారి అనుభవాలు & వ్యక్తిత్వ ఎదుగుదల ద్వారా స్పష్టంగా చూపించండి.

  11. 11

    ముగింపు సందేశం

    మీ పాత్ర గురించిన ప్రతి చిన్న విషయాన్ని కథలో నేరుగా వివరించాల్సిన అవసరం లేదు. కానీ ఒక రచయితగా, మీ పాత్ర గురించి మీకు సంపూర్ణమైన అవగాహన ఉండాలి.

    మీ పాత్రలను మీరు ఎంత స్పష్టంగా అర్థం చేసుకుంటే, కథలో వారి చర్యలు, సంభాషణలు, భావోద్వేగాలు & నిర్ణయాలు అంత శక్తివంతంగా మారుతాయి. చక్కగా మలిచిన పాత్రలు పాఠకులను మీ కథతో దీర్ఘకాలం ప్రయాణించేలా చేస్తాయి.

సంతోషంగా రాయండి!

— ప్రతిలిపి బృందం

ఇది ఉపయోగకరంగా ఉందా? మెరుగైన కథా రచనలో మరిన్ని వ్యాసాలు చదవండి. మరిన్ని వ్యాసాలు