<p>దేవరకొండ బాలగంగాధర తిలక్ (ఆగష్టు 1, 1921 - జూలై 1, 1966) ఒక ఆధునిక తెలుగు కవి. భావుకత, అభ్యుదయం ఇతని కవిత్వంలో ముఖ్య లక్షణాలు.పశ్చిమ గోదావరి జిల్లా తణుకు తాలుకా మండపాక గ్రామంలో 1921 ఆగష్టు 1 న తిలక్ జన్మించాడు.తిలక్ ఎంత సుకుమారుడో అతని కవిత అంత నిశితమైనది. భాష ఎంత మెత్తనిదో, భావాలు అంత పదునైనవి. సంఘ వంచితుల పట్ల ఎంత కారుణ్యమో , సంఘ దురన్యాయాలపట్ల అంత క్రోధ. తిలక్‌కు తెలుగు, ఇంగ్లీషులలో చక్కని పాండిత్యం ఉంది. ప్రాచీనాధునిక పాశ్చాత్య సాహిత్యంలో చాలా భాగం అతనికి కరతలామలకం. అయినా, తెలుగు వచనం గాని, పద్యంగాని ఎంతోబాగా వ్రాసేవాడు. సుతిమెత్తని వృత్త కవితతో ప్రారంభించినా, ఆధునిక జీవితాన్ని అభివర్ణించడానికి వృత్త పరిధి చాలక వచన గేయాన్ని ఎన్నుకున్నాడు. అది అతని చేతిలో ఒకానొక ప్రత్యేకతను, నైశిత్యాన్ని సంతరించుకుంది, సౌందర్యాన్ని సేకరించుకుంది.</p><p>మన కళ్ళ ఎదుట ప్రతి నిత్యం జరిగిపోతున్న జీవిత నాటకాన్ని ప్రతిబింబించడానికి ఆయన కవితను , కథలను, నాటికా ప్రక్రియను సమానంగా ఉపయోగించుకున్నాడు. మనకు రోడ్ల మీద తారసిల్లే వ్యక్తులు- బిచ్చగాళ్ళు, అనాథలు, అశాంతులు, దగాపడ్డ తమ్ముళ్ళు, పడుపుగత్తెలు, చీకటిబజారు చక్రవర్తులు ఇంకా ఎందరెందరినో ఆయన పాత్రలుగా తీసుకుని అసలు వేషాలలో మన ముందు నిలబెట్టాడు.</p><p>మొదట దేవులపల్లి కృష్ణశాస్త్రి ప్రభావంతోనూ , తరువాత శ్రీశ్రీ ప్రభావంతోనూ , కవిత్వం వ్రాసినా, వచన కవితా ప్రక్రియను తన అసమాన ప్రతిభాసంపదతో ఉన్నత శిఖరాలకు తీసుకొని వెళ్లిన ప్రముఖుడు. వచన కవితలకు అప్పజెప్పే లక్షణాన్ని తెచ్చినవాడు తిలక్. భావకవిత్వంలోని భావ సౌకుమార్యం, భాషా మార్దవం, అభ్యుదయ కవిత్వలక్షణాలతో కలసి వెలసిన తిలక్ కవిత్వం, అభ్యుదయ, భావ కవిత్వాల కలనేత.</p><p>(సేకరణ - వికిపీడియా)</p>
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్