డా. ఆచార్య ఫణీంద్ర ప్రముఖ తెలుగు కవి, సాహిత్య విమర్శకుడు. వృత్తిరీత్యా శాస్త్రవేత్త.ఆయన తెలుగు కవిత్వంలో పద్యం, గేయం మరియు వచన కవిత్వం లో సుప్రసిద్ధులు.

జీవిత విశేషాలు

ఆయన స్వస్థలం కరీంనగర్ జిల్లా, కోరుట్ల మండలం, బండలింగాపురం గ్రామం. ఆయన తండ్రిగారు వృత్తిరీత్యా నిజామాబాదు పట్టణంలో నివాసమున్న కాలంలో, ఆచార్య ఫణీంద్ర 27 జూలై 1961 (వ్యాస పూర్ణిమ) నాడు నిజామాబాదు పట్టణంలో జన్మించారు. హైదరాబాదులో ఉన్నత విద్యాభ్యాసం చేసారు. ఆయన తండ్రి గారు కీ.శే. గోవర్ధనం దేశికాచార్య. తల్లి కీ.శే. ఇందిరాదేవి.ఆయన మెకానికల్ ఇంజనీరింగ్ లో పట్టభద్రుడు. తెలుగులో ఎం.ఏ. డిగ్రీని సాధించారు. తెలుగులో డాక్టరేట్ డిగ్రీని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి "19వ శతాబ్దంలో తెలుగు కవిత్వం" అనే విషయం పై పొందారు. ముకుంద శతకం, పద్య ప్రసూనాలు, ముద్దుగుమ్మ, మాస్కో స్మృతులు, వరాహ శతకం వంటి పద్యకవితా గ్రంథాలను రచించి మంచి పద్యకవిగా గుర్తింపు పొందారు. వృత్తిరిత్యా 1983లో బి.గ్రేడు శాస్త్రవేత్తగా కేంద్రప్రభుత్వ సంస్థ ఎన్.ఎఫ్.సి.లో చేరారు. ప్రస్తుతం హైదరాబాదులో "ఎఫ్" గ్రేడు సైంటిస్టు గా కొనసాగుతున్నారు. ఉద్యోగపరంగా అనేక సదస్సులలో పాల్గొన్నారు. బాబా అటామిక్ ఎనర్జీ సెంటర్ వారి పరీక్షలలో ఉత్తీర్ణులయ్యారు. భారత ప్రభుత్వం దిగుమతి చేసుకోదలచిన ఇంధనాన్ని తనిఖీ చేయదానికి రష్యాకు పంపిన బృందంలో ఈయన కూడా ఒకరు. ప్రవృత్తి పరంగా సాహితీవేత్త.

తెలుగు సాహిత్యంలో "మాస్కో స్మృతులు" పేరిట 'తొలి సమగ్ర విదేశ యాత్రా పద్య కావ్యా'న్ని రచించారు. తెలుగు వచన కవిత్వ సాహిత్యంలో "ఏక వాక్య కవితల" ప్రక్రియకు ఆద్యులు. ఆయన చూపిన మార్గంలో చాల మంది యువ కవులు, కవయిత్రులు అంతర్జాలంలో వేలాది ఏక వాక్య కవితలను రచిస్తున్నారు. "వాక్యం రసాత్మకం" పేరిట తెలుగు సాహిత్యంలో ఆయన రచించిన తొలి ఏక వాక్య కవితల గ్రంథం "Single Sentence Delights" పేరిట ఆంగ్లంలోకి అనువదించబడింది. ఆయన శ్రీశ్రీ శతజయంతి (2010) సందర్భంగా, నిండు సభలో, మహాకవి శ్రీశ్రీ "మహా ప్రస్థానం" సంపూర్ణ కావ్యగానం ఏకబిగిన వ్యాఖ్యాన సహితంగా చేసి మన్ననలందుకొన్నారు.

రచనలు - ముద్రితాలు

ముకుంద శతకం [కంద పద్య కృతి]

కవితా రస గుళికలు [మినీ కవితల సంపుటి]

పద్య ప్రసూనాలు [పద్య కవితా సంపుటి]

విజయ విక్రాంతి [కార్గిల్ యుధ్ధంపై దీర్ఘ కవిత]

ముద్దు గుమ్మ [పద్య కావ్యం]

వాక్యం రసాత్మకం [ఏక వాక్య కవితలు]

మాస్కో స్మృతులు [విదేశ యాత్రా పద్య కావ్యం]

Single Sentence Delights ( ’వాక్యం రసాత్మకం’ అనువాదం )

వరాహ శతకం [అధిక్షేప వ్యంగ్య కృతి]

అముద్రితాలు

తెలంగాణ మహోదయం [ఉద్యమ కవితల సంపుటి]

సీతా హృదయం [గేయ కావ్యం]

కులీ కుతుబు కావ్య మధువు [పద్య కృతి]

ఆంధ్ర భారత భారతి [వ్యాఖ్యాన గ్రంథం]

పందొమ్మిదవ శతాబ్ది తెలుగు కవిత్వంలో నవ్యత[పిహెచ్.డి.సిధ్ధాంత గ్రంథం]

పాద రక్ష [పద్య కావ్యం]

నీలి కురుల నీడలో [లలిత గీతాలు]

అవార్డులు

ఆయన అనేక అవార్డులు, గౌరవాలను ప్రభుత్వం మరియు ఇతర సాంస్కృతిక సంస్థల నుండి పొందారు. ప్రధానంగా - 'వానమామలై వరదాచార్య' స్మారక పురస్కారం, 'దివాకర్ల వేంకటావధాని' స్మారక పురస్కారం, 'పైడిపాటి సుబ్బరామశాస్త్రి' స్మారక పురస్కారం, 'ఆచార్య తిరుమల' స్మారక పురస్కారం, 'బోయినపల్లి వేంకట రామారావు' స్మారక పురస్కారం, "రంజని - విశ్వనాథ" పురస్కారం, 'సిలికానాంధ్ర' గేయ కవితా పురస్కారం, మూడు సార్లు విజయవాడ 'ఎక్స్ రే' పురస్కారాలు, పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వ 'ఉగాది' సత్కారాలు పేర్కొనదగినవి. ఆయన 2012లో తిరుపతిలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలలోనూ, 2014 లో అట్లాంటా లో జరిగిన "నాటా" తెలుగు సభలలోనూ గౌరవింపబడ్డారు. ఆయన హైదరాబాదులోని వి.ఎల్.ఎస్. లిటెరరీ అండ్ సైంటిఫిక్ ఫౌండేషన్ నుండి "పద్య కళా ప్రవీణ" పురస్కారాన్ని పొందారు. తూర్పుగోదావరి జిల్లా, ఏలూరు లోని నవ్య సాహిత్య మండలి నుండి "కవి దిగ్గజ" పురస్కారాన్నిపొందారు. ఆయన "ఆంధ్ర పద్య కవితా సదస్సు" కు ఉపాధ్యక్షులుగానూ, నవ్య సాహితీ సమితి కి ఉపాధ్యక్షులుగానూ మరియు నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠం నకు ప్రధాన కార్యదర్శిగానూ ఉన్నారు. ఆయన ఆంధ్ర పద్య కవితా సదస్సు యొక్క పత్రిక "సాహితీ కౌముది" కు సహ సంపాదకులు. ఆయనకు 2013 సంవత్సరానికి గాను తెలుగు విశ్వవిద్యాలయం వారు 'పద్య కవిత్వం' లో "కీర్తి పురస్కారాన్ని" ప్రకటించారు.

బ్లాగు - https://dracharyaphaneendra.wordpress.com/

(ప్రతిలిపిలో ప్రచురితమవుతున్న శ్రీ ఆచార్య ఫణీంద్ర గారి రచనలు ముందస్తు అనుమతితో ఆయన బ్లాగు నుంచి తీసుకోవడం జరిగింది. కాపీరైటు హక్కులు రచయితకే చెందుతాయి)

రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్